29, అక్టోబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 20

ఈ నగరం పేరేమిటి?
సీ.
కావ్య మంకిత మందఁగా మెచ్చు నెవ్వఁడు?
కోనేటి రాయని కొండ యేది?
నిదుర రానున్నటు లెది తెల్పు మనలకు?
ప్రహ్లాదమున కన్య పద మదేమి?
వంద పద్యములతో వరలెడి కృతి యేది?
వృషభ భుజమున కేది వేఱు పేరు?
బ్రహ్మ నాలుక పైన వసియించు నే కాంత?
నైరృతి దిగ్గజ నామ మేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లా పదమ్ముల రెండవ యక్షరముల
నుడువఁగ ననంత పద్మనాభుఁడు వెలసిన
నగరమై యొప్పుఁ జెప్పు డా నగర మేదొ.
ఆ నగరం పేరు చెప్పండి.

15 కామెంట్‌లు:

 1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, అక్టోబర్ 29, 2010 10:15:00 AM

  తిరువనంతపురము
  (కృతిభర్త, తిరుపతి, ఆవలింత, ?, శతకము, మోపురము, సరస్వతి, ? )
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  మరీ ఇంత స్పీడా?
  మీ సమాధానం సరైనదే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. కృతిభర్త, తిరుపతి, ఆవలింత, ఆనందము, శతకము, మూపురము, సరస్వతి, కుముదము = తిరువనంతపురము

  రిప్లయితొలగించండి
 4. క్షితిపతి ,తిరుమల ,ఆవలింత, ఆనందము,శతకము,మూపురము,సరస్వతి ,-ము --.=తిరువనంతపురము !

  రిప్లయితొలగించండి
 5. కృతిపతి(కృతిభర్త), తిరుమల(గరుడాద్రి), ఆవలింత, ఆనందము, శతకము, మూపురము, సరస్వతి, కుముదము అనే ఎనిమిది పదాలలోని రెండవ అక్షరాలనూ కూర్చగా వచ్చేది 'తిరువనంతపురము'.

  రిప్లయితొలగించండి
 6. మందాకిని గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  నారాయణ గారూ,
  మీ అందరి సమాధానాలు సరి యైనవే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కృతిపతి, తిరుపతి,ఆవలింత, ఆనందము, శతకము, మూపురము, సరస్వతి, కుముదము ( ? )

  తిరువనంతపురము

  రిప్లయితొలగించండి
 8. నేడు నేనొక ప్రహేళికను వ్రాసి మీకు
  ఇమెయిలు చేసినాను పరిశీలించ గలరు

  రిప్లయితొలగించండి
 9. 1.కృతిభర్త 2.తిరుమల.3.ఆవలింత .4.ఆనందము.5.శతకము .6.మూపురము.7.సరస్వతి .8....? = జవాబు = తిరువనంత పురము .

  రిప్లయితొలగించండి
 10. కావ్య మంకిత మందఁగా మెచ్చు నెవ్వఁడు? - కృతిపతి
  కోనేటి రాయని కొండ యేది? -తిరుమల
  నిదుర రానున్నటు లెది తెల్పు మనలకు?- ఆవలింత
  ప్రహ్లాదమున కన్య పద మదేమి? - ఆనందము
  వంద పద్యములతో వరలెడి కృతి యేది? -శతకము
  వృషభ భుజమున కేది వేఱు పేరు? - మోపురము
  బ్రహ్మ నాలుక పైన వసియించు నే కాంత? - సరస్వతి
  నైరృతి దిగ్గజ నామ మేది? - ?ము??

  తిరువనంతపురము

  రిప్లయితొలగించండి
 11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  మీ అందరి సమాధానాలూ సరైనవే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. మంద పీతాంబర్ గారూ,
  రేపు ప్రకటించేది మీరు పంపిన ప్రహేళికే.

  రిప్లయితొలగించండి
 13. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, అక్టోబర్ 30, 2010 9:22:00 AM

  గురువు గారూ,
  నైరృతి దిగ్గజ నామ మేది? కి సమాధానం ఇంకా తెలియలేదు.
  కొందరు కుముదము అని వ్రాసారు. సరి అయిన జవాబు చెప్పగలరు,
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి