4, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 114

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.

20 కామెంట్‌లు:

  1. నమస్కారమండీ, నా పురణ :

    మెప్పుగ చెప్పగ వింటిని
    అప్పా యీ కధను నంత నతిధుల నోళ్ళన్
    ఒప్పుల కుప్పగు యా వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    రిప్లయితొలగించండి
  2. చెప్పగ పేరుకు సుందరి
    గొప్పగ నుండదసలు మరి ఘోరము చూడన్
    నప్పగ తన్వలచిన వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.
    సామెత: తా వలచింది రంభ, తామునిగింది గంగ ! వారి పెండ్లికి అక్షింతలు వేద్దాము:-)

    రిప్లయితొలగించండి
  3. మరో పూరణండీ:

    ఒప్పుల రాజ తనూజుడు
    కప్పై తా తిరిగె నంట కాసారమునన్
    మెప్పుగ ముద్దులనీయా
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్
    ( మరి అప్పటికే కప్ప రాకుమారుడయిపోయాడు. )

    రిప్లయితొలగించండి
  4. చెప్పిరి జ్యోస్యులు ఇట్టుల
    తప్పదు మృత్యువు వరునకు, తాళే పామౌ!
    చప్పున పెద్దలు కూడగ
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్!!

    రిప్లయితొలగించండి
  5. చప్పున చెక్కిలి మీటగ
    మెప్పుగ సుందరిని గాంచె మక్కువ తోడన్
    నప్పును మనకిక జోడీయన వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్ !

    రిప్లయితొలగించండి
  6. అనంతపురం జిల్లాలో గణపతిని చాలా ప్రత్యేకంగా "బెండకప్ప" అని పిలుచుకుంటారు. ఈ పదం వ్యుత్పత్తి తెలియదు గానీ, జనపదంలో సుప్రతిష్ఠమైన మాట ఇది. కందంలో బెండకప్ప కుదిరే వీలు లేక, ఆయన్ని 'బెండాకప్ప' ను చేసానిక్కడ..
    అప్పము లుండ్రాళ్ళు కుడుము
    లప్పనముగ మెక్కి గణములౌజులు చేయన్-
    గొప్పగ సందడి; బెండా
    కప్పకు సుందరికి బెండ్లి ఘనముగ జరిగెన్.
    (ఔజులు=సేవకులు; సుందరి=ఇక్కడ సిద్ధి/బుద్ధుల్లో ఒకరు!)

    రిప్లయితొలగించండి
  7. తప్పుగ మండోదరినా
    మిక్కిలి పార్వతి యనుకొని మిన్నక నౌరా
    చక్కని కన్నియ యనలం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్!
    విన్నపము: లంకప్ప= లంకాధీశుడు, రావణాసురుడు. భూకైలాస్ సినిమాలో తప్ప ఇంకే పురాణంలోనూ రావణాసురుడు భ్రమ చెందినట్లు చదవలేదు. పోనీలే పద్యం వరకు వొప్పుకొందాం.

    రిప్లయితొలగించండి
  8. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. ముఖ్యంగా రెండవ పూరణలో శాపవశాత్తు రాకుమారుణ్ణి కప్పను చేయడం ఉచితంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలూ నిర్దోషంగా, చక్కగా ఉన్నాయి. రావణుడిని లంకపను చేయడం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నచికేత్ గారూ,
    మంచి ఐతిహ్యంతో పూరణ చేసారు. వైధవ్య గండం తప్పించడనికి ఇలాటి పెళ్ళిళ్ళు జరిపించిన కథలు ఎన్నో ఉన్నాయి. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నేదునూరి రాజేశ్వరి గారూ,
    పద్యం నిర్దోషంగా, పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నారాయణ గారూ,
    మీ వల్ల గణపతికి "బెండకప్ప" అనే పేరున్నట్లు కొత్త విషయం తెలిసించి. ధన్యవాదాలు.
    గణపతిని "వెనకయ్య" అనడం సాధారణమే కదా. రాయలసీమలో అయ్యను అప్ప అంటారు కదా. వెనకయ్య వెనకప్ప అయింది. "వ"ను "బ"గా పలకడం (వబయో రభేదః) ప్రసిద్ధమే. వెనకప్ప బెనకప్పగా మారి కాలాంతరాన బెండకప్పగా మారి ఉంటుందా?
    పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నే పుట్టి పెరిగింది అనంతపురం. బెండకప్ప నేనెప్పుడూ వినలేదు. బెణకప్ప అని అంటారు. అది గణపయ్య అయి వుంటుంది. గణప=బెణక, అయ్య=అప్ప.

    రిప్లయితొలగించండి
  14. నాకు తెలిసి వినాయకుడిని బెణకప్ప అని అంటారు. బెండకప్ప అని అనరు. మరి నారాయణగారు పొరబడ్డారో ఏమో!

    రిప్లయితొలగించండి
  15. నేను విని రాయటమేనండీ- సరైన పదం 'బెణకప్ప' అయి ఉండచ్చు. ఇక్కడ పల్లెలో అందరూ బెణకప్పను బెండకప్పలాగా పలుకుతున్నారేమో, మరి. నేను నిఘంటువులో వెతికితే గణపతికి 'వెనకయ్య' అని పర్యాయపదం దొరికింది గాని, బెణక/బెండ లతో ఏదీ లభించలేదు. సరి దిద్దిన విజ్ఞులందరికీ ధన్యవాదాలు. ఇంతకీ 'బెణక' అంటే ఏంటో తెలీలేదు.. పదానికి కన్నడ మూలాలేమైనా ఉన్నాయా @అజ్ఞాతగారు/మురళీమోహన్ గారూ?

    రిప్లయితొలగించండి
  16. ఓ నారాయణప్పా, గెణకప్ప బెణకప్ప అయ్యుంటుందప్పా. గణ్పతి యప్పా మోరియా అని మరాఠీలో అని అంటారు. గణపయ్య > గణాధిపతి + అప్ప = గణపయ్య > బెణకప్ప. ఇక ఇంతకన్నా సాగదీయడం నాచేత కాదప్పా. :) బెండకప్ప అంటే బెండకాయల వ్యాపారి అయ్యుంటాడు. :)) వెంకప్ప అంటే వెంకన్నకు ఇంకో ముద్దుపేరు, గణప్ప కాడు.
    అనంతపురం-బళ్ళారి తేట తెలుగు చూసే కన్నడ మూరురాయర గండ ముచ్చట పడి "దేశ బాషలందు తెలుగు లెస్స " అని జగమెరిగిన సత్యం అని భాషాప్రవీణులు మీకు తెలిసిందే. :) నా చిన్ననాటి అనంతపురం గుర్తు చేశారు, థాంక్సులు.

    రిప్లయితొలగించండి
  17. చంద్రశేఖర్ గారూ,
    మీ పద్యంలో ప్రాసదోషం ఉంది. నేదునూరి రాజేశ్వరి గారు చెప్పేదాక నేను గమనించలేదు.

    రిప్లయితొలగించండి
  18. గొప్పగ సుందర వనమున
    నెప్పుడు చీకాకు లేని నెఱజాణ వలెన్
    చప్పుడు బెకెబెక జేసెడి
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    సుందరి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953    

    3. the mangrove tree

    ఈ "సుందరి" చెట్లవలెనే "సుందర్బన్స్" అనే పేరు సార్ధకమైనది.

    రిప్లయితొలగించండి
  19. అప్పడము వడియములతో
    పప్పును పులుసును వడలును పరమాన్నముతో
    కుప్పములో వెంగళి వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    Kuppam:

    "1989, 1994, 1999, 2004, 2009 and 2014 - N. Chandrababu Naidu (Chief Minister of Andhra Pradesh)"

    రిప్లయితొలగించండి