చెప్పుకోండి చూద్దాం
సీ.గణగణ మని మ్రోగఁగల వస్తు వది యేది?
భూమికి వెలకు పదం బదేమి?
మీనంబులను బట్ట మేటి సాధన మేది?
విష్ణ్వింద్రులకు నొక్క పేరదేమి?
నగజాత పతి వాహనం బనఁగ నెయ్యది?
నది కటునిటు నుండునది యదేమి?
భగవంతునిఁ దలంచి భక్తు లే మొనరింత్రు?
ఇడుములో "ఇ"ని తీయ నేమి మిగులు?
తే.గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు;
వరుస ప్రథమాక్షరమ్ముల నరసి చూడ
ఆంజనేయుఁడొ భీముఁడో యై తనర్చుఁ
నట్టి దెద్దియో తెలుపుడీ యంఘులార!
వివరణ -
గణగణ మని మ్రోగు వస్తు వది - గంట
భూమికి, వెల కొకే పద మగును - ధర
మీనంబులను బట్టు సాధనం బది - వల
విష్ణ్వింద్రులకు నొక్క పేరగును - హరి
నగజాత పతి వాహనం బగును - నంది
నది కటునిటు నుండునదేమొ - దరి
భగవంతునకు భక్తు లొనరించెదరు - నుతి
ఇడుములో "ఇ"ని తీయ మిగిలేది - డుము
గంట, ధర, వల, హరి, నంది, దరి, నుతి, డుము ... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం .................. గంధవహ నందనుడు.
సరియైన సమాధానాలు పంపిన వారు ........
గన్నవరపు నరసింహ మూర్తి గారు, నారాయణ గారు, చంద్రశేఖర్ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మంద పీతాంబర్ గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి