1, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 111

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను చంద్రశేఖర్ గారు పంపించారు ...
అగ్నితోడ నగ్ని నార్పవచ్చు.

21 కామెంట్‌లు:

 1. ముల్లు పెఱికివేయ ముల్లును వాడగ
  వజ్రము పగుల గొట్ట వజ్రము వాడు
  నటులె సూక్ష్మసూత్ర మరయ సులభ
  మగ్నితోడ నగ్ని నార్పవచ్చు.

  రిప్లయితొలగించండి
 2. నమస్కారమండీ, నా పూరణ:

  శాస్త్రజ్ఞాన మనెడి జాతవేదుని యందు
  అణగి యుండు నహము ననెడి యగ్ని
  అరణి కాలి పిదప నారదే హోమంబు
  నగ్ని తోడ నగ్ని నార్ప వచ్చు.

  జాతవేదుడు = అగ్నిదేవుడు

  రిప్లయితొలగించండి
 3. చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  కాని రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
  "వజ్రభేది యగుచు వజ్ర మొప్పు"

  రిప్లయితొలగించండి
 4. నరసింహ మూర్తి గారూ,
  ఉదాత్తమైన భావంతో పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  కాని కొన్ని చిన్న లోపాలు ... "శాస్త్రజ్ఞాన" మన్నప్పుడు స్త్ర గురువు అవుతుంది. దానిని "శాస్త్రసంజ్ఞ యనెడి" అని సవరిస్తే బాగుంటుంది. సంజ్ఞ శబ్దానికి జ్ఞానమనే అర్థం కూడా ఉంది.

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్య గారూ, మీ సవరణకు ధన్య వాదాలు. ముందు "జ్ఞాన సంపదనెడి జాతవేదుని యందు " అనివ్రాసి మార్చాను జ్ఞా కి జా కి యతి మైత్రి లేదనే భావము వలన. జ్ఞ జ లకు యతి మైత్రి ఉందో లేదో సందేహం తీర్చ గలరా ? ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. గురుతుల్యులకి,
  నమస్కారం.
  నేను సమస్యాపూరణాలు రోజూ విధి గా చదువి ఆనందిస్తుంటాను.
  నాకూ వ్రాయాలని అనిపిచినా ఎప్పుడో ముప్పై యేళ్ళ క్రితం నేర్చుకున్న వ్యాకరణం మీద అంత పట్టు లేదు. వచన కవిత్వం అలవాటు కానీ, ఛందొపద్దం గా ఒక్క సారి (1978 లో) వినాయకుని మీద శ్లోకం వ్రాయడానికి ప్రయత్నించానంతే. మీరు 'ఛందస్సు నేర్చుకుందామా?' శీర్షిక మొదలుపెడ్తున్నందుకు చాలా సంతోషం. మీ శిష్యరికం లో త్వరలోనే సమస్యాపూరణం లో పాల్గొనగలుగుతానని ఆశ.

  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరు

  రిప్లయితొలగించండి
 7. నరసింహ మూర్తి గారూ,
  జ-జ్ఞ లకు యతి చెల్లుతుంది.

  రిప్లయితొలగించండి
 8. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. ఛందోపాఠాలు త్వరలోనే ప్రారంభిస్తాను.

  రిప్లయితొలగించండి
 9. చేయుమెన్నియైన శీతోపచర్యలు
  చల్లబరచ లేము సాంతముగను
  వేడి యంతకంత బెరుగు తా కామాగ్ని
  అగ్ని తోడ నగ్ని నార్పవచ్చు

  రిప్లయితొలగించండి
 10. మాష్టారు గారు,
  మీ సవరణ నా తప్పుని దిద్దటమే గాక పద్యానికి సొబగు చేకూర్చింది. "వజ్ర" లో వ గురువు అవుతుందని తెలిసింది. క్రా వడి వచ్చినపుడల్లా సందిగ్డమే. ఛందో నియమాలల్లో ఊది పలికి నప్పుడు గురువవుతుందని చదివినట్లు గుర్తు. ఉదాహరణకి కద్రువ లో క లఘువు అవుతుందని అనుకొంటున్నాను. ఈ క్రావడి చుట్టూ వుండే నియమాలు దయచేసి తెలుప గలరు. "వజ్రం వజ్రేణ భేద్యతే" అనే నా భావాన్ని పసిగట్టి సరిచేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. ఒక అరుణం:-)
  కడుపు మంట నోర్చి కాలెదవెన్నాళ్ళు?
  కాలకాలు వోలె కదను త్రొక్కు!
  పోరు మంట నిడక పోదురా నీ వ్యధ,
  అగ్నితోడ నగ్ని నార్పవచ్చు!

  రిప్లయితొలగించండి
 12. మరొక పూరణ:
  విసమునొసగి విసము విరుగ జేయగవచ్చు
  అగ్నితోడ నగ్ని నార్పవచ్చు
  అరయ హానెమాను ఆవిష్కరణ యదే-
  హోమియోపతియను యోగమాయె!

  రిప్లయితొలగించండి
 13. అనల!హనుమ గాచి శైత్యంబు చేకూర్చు
  మనగ సీత మహిమ నగ్ని శుభుడ
  వగ పవనుడు దలచె వరపరమ పతివ్ర
  తాగ్నితోడ నగ్ని నార్ప వచ్చు.
  విన్నపము: సుందరకాండ, 53 వ సర్గ - శీతోభవ హనూమత: అని సీతామ్మవారు ప్రార్ధించగా అగ్ని చల్లబడటం. "...దృశ్యతే చ మహా జ్వాల: కరోతి న చ మే ఋజమ్...సీతాయాశ్చానృశంస్యేన..." అని హనుమ అనుకొంటాడు.
  క్రింద విన్నపము తో సహా వేయగలరని ఆశిస్తూ,
  -చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 14. హరి గారూ,
  పద్యం నిర్దోషంగా, భావం ఉదాత్తంగా ఉంది. అభినందనలు.

  నారాయణ గారూ,
  రెండు పూరణలు దేనికదే బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. చంద్రశేఖర్ గారూ,
  ఈ పద్యం ఎలాగో మిస్సయింది. ఇప్పుడే చూసాను. చాలా బాగుంది. మంచి భావం. పద్యంకూడ నిర్దోషంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. అగ్గి రవ్వ వోలె నాలి మీదను లేచి
  కొట్ట బోగ కోటి, కొరవి దెచ్చి
  చూప సుమతి ;గప్పు చుప్పున కూర్చుండె,
  'అగ్నితోడ నగ్ని నార్పవచ్చు'.

  రిప్లయితొలగించండి
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సమస్యాపూరణలో హాస్యరసాన్ని ఒలికించారు. అద్భుతం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా ! ధన్యవాదములు.
  చిన్న సవరణ .
  అగ్గి రవ్వ వోలె నాలి దిట్టుచు, తాగి
  కొట్ట బోగ కోటి, కొరవి దెచ్చి
  చూప సుమతి ;గప్పు చుప్పున కూర్చుండె,
  'అగ్నితోడ నగ్ని నార్పవచ్చు'.

  రిప్లయితొలగించండి
 19. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అడవిలో దావానలం నుండి తప్పించుకొనుటకు
  దానికి ఎదురు వెళ్ళు నట్లుగా మంట రగిలించడమే !
  రెండూ కలసిన చోట మంట ఆరిపోతుంది !

  01)
  __________________________________

  అడవి లోన నుండ - యగ్ని పుట్టినపుడు
  ఎదురు నిప్పు పెట్ట - నెరుక గలిగి
  మంట వెళ్ళి మొదటి - మంటను గలసిన
  అగ్నితోడ నగ్ని - నార్పవచ్చు!
  __________________________________

  రిప్లయితొలగించండి
 20. వసంత కిశోర్ గారూ,
  దావానలాన్ని ఆర్పడానికి ఎదురు నిప్పుపెట్టడమా? ఇదేదో క్రొత్తగా ఉంది. పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యా !
  ఒక యింగ్లీషు సినిమాలో చూశా నెప్పుడో !
  కొంతమంది అడవిలో ఉండగా
  దూరంగా దావానలం పుట్టి వీరున్న వైపు వస్తుంటుంది !
  వాళ్ళు వెంటనే మూడు గజాల మేర తమచుట్టూ యున్న గడ్డీ గాదం
  నరికి తాము నిలబడుటకు చోటు చేసుకొని తమచుట్టూ యున్న
  మిగిలిన గడ్డిని తగలబెడతారు !
  అంతే కొద్దిసమయానికి వీళ్ళ చుట్టూ ఉన్న
  గడ్డి తగల బడుతూ మంటను దూరంగా తీసుకెళ్తుంది !
  కొద్ది సేపటికి యీ మంటా ఆ మంటా కలుసుకుంటాయి !
  తగలబెట్టడానికి యేమీ లేక మంటలు ఆరిపోతాయి !

  రిప్లయితొలగించండి