23, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 131

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్.

18 కామెంట్‌లు:

  1. తరు వొక్కటి పెర డుండగ
    చిరు చిన్నది పాదు లుంచె జెట్టుకు మొదలన్
    చెరచెర మని ప్రాకంగను
    సొర, చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్

    రిప్లయితొలగించండి
  2. ఎరువులు ఎచటివి వేసెనొ,
    బరువులు తరువుకు తగవని భావింపగనో,
    గురువులు బ్రహ్మము చెప్పెనొ !
    సొర చెట్టుకు బీర కాయ సొంపున గాచెన్!

    రిప్లయితొలగించండి
  3. ఇరువది కాయలు గాచెను
    సొరచెట్టున; బీరకాయ సొంపుగ గాచెన్
    మరియొక ఇరువది తట్టలు
    కురిసెనయా, రైతు ఇంట కోర్కెల వానల్!

    రిప్లయితొలగించండి
  4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, అక్టోబర్ 23, 2010 9:19:00 AM

    గురువు గారూ,
    చిన్న సందేహం. సొర చెట్టు అనవచ్చా? సొర తీగ అనాలి కదా?

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  5. గురువర! పిచ్చుకపై మీ
    రరయక బ్రహ్మాస్త్ర మేయనగునే హాఁ! నా
    తరమా పూరింపగ నే
    సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్?

    రిప్లయితొలగించండి
  6. మర మనుషుల కాలంబున
    తెరువరియై మనిషి జేయ దీటుగ క్లోనింగ్
    అరయగ నచ్చెరువెందుకు?
    "సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్".

    రిప్లయితొలగించండి
  7. అరసితిరె నేటి వింతలు
    గురువర 'ఈనాడు'భూరి కూష్మాణ్డమున్,
    యెరుపగు బెండను కానగు
    సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్.
    (మరొక పూరణమండీ గురువుగారూ)

    రిప్లయితొలగించండి
  8. పీతంబర్ గారూ ధన్యవాదాలు.
    "పీతాంబరు కృతులు శీతాంశు రేఖలు
    గిలిగింతలిడు మేన పులకలూర"
    మీ పద్యాలు చాలా బావుంటాయి. ఎందులోనూ తీసిపోవు. దత్తపది-8 లో మీరు చేసిన బాసర వాణీ స్తుతి యెంతో హృద్యంగా నిత్యప్రార్థనా పద్యానికి తీసిపోని రీతిలో శోభిల్లుతోంది.గురుకృప మహత్తరమైనది. నమస్కారాలు.

    రిప్లయితొలగించండి
  9. నమస్కారమండీ ,మరొ పూరణ

    పరువెత్తి శిష్యు నుడివెను
    'సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్ '
    'పరమాత్మ వింత గాదుర
    పరిణామ ఫలము ' బలికెను ప్రవరుడు గురుడున్

    రిప్లయితొలగించండి
  10. సరిగా పాదులు జేసితి
    ఎరగా వేసితి యెరువులు ఏపుగ పెరిగెన్
    మరి చిత్రము చీడట్టెన్
    సొర చెట్టున, బీరకాయ సొంపుగ( గాచెన్.

    మనవి: మా పెరట్లో యేటా జరిగేదే. మొదట్లో అన్నీ యేపుగా పెరుగుతాయి. చివర్లో దేనికో చీడ పడుతుంది, కాయ కాయదు.

    రిప్లయితొలగించండి
  11. పెరడున తరులకు యెరువులు
    మర మనుషులు వేసిరంత మర్మము తోడన్ !
    కొరమీనలు సొరచాపలు
    సొర చెట్టున బీరకాయ సొంపుగ గాచెన్ !

    రిప్లయితొలగించండి
  12. ధరనేలెడి మర నేతలు
    పుర వీధుల వెంట దిరిగి వరముల నియ్యన్ !
    పెరడున వనముల పెంచుడు
    సొర చెట్టున బీరకాయ సొంపుగ గాచెన్ !

    రిప్లయితొలగించండి
  13. అందరికీ నమస్కృతులు.
    ఈ రోజు మా మాతృదేవత ప్రథమ వర్ధంతి. ఆబ్దిక కార్యక్రమాలలో వ్యస్తుణ్ణై మీ పూరణలను పరిశీలించి, వ్యాఖ్యానించలేక పోతున్నాను. రేపు స్పందిస్తాను. ఈ రోజు ప్రహేళిక కూడ ఇవ్వలేక పోతున్నాను. క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  14. ధన్యురాలు.పునరావృత్తి రహిత స్వర్గ లోక ప్రాప్తిరస్తు!

    రిప్లయితొలగించండి
  15. దొరసానికి నాఫ్రికనుకు
    సరదాగా పెండ్లి జరిగి సఫలమ్మవగా
    హరిహరుడాయె నొబామా
    సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్

    రిప్లయితొలగించండి

  16. హరహర యని జంద్యమునిడి
    కొరగాకయె సోనియాకు కొడుకై పుట్టెన్
    ధరలో వింతేమున్నది:
    "సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్"

    రిప్లయితొలగించండి