29, అక్టోబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 19 సమాధానం

ఈ పదాలు ఏమిటో చెప్పండి
సీ.
కనులకు పెను వేదనను గూర్చు జబ్బేది?
శృంగారచేష్టకు గుర్తదేది?
వచ్చియు రానట్టి వరనిద్ర యేదది?
షడ్రుచు లం దామ్ల సామ్య మేది?
కాలి చివరి గుదికా లన నెయ్యది?
విస్తృతార్థ పదము విధ మదేమి?
మార్దవంబగు నూత్న మణికాంతి నేమండ్రు?
కోరికలను దెల్పుకొను మనండి.
తే.గీ.
అన్నిటికి జూడ మూడేసి యక్షరమ్ము
లీవ లావలనుండి పఠించి చూడ
నొక్క విధముగ నుండును చక్కగాను
యోచనము జేసి చెప్పఁగ నొప్పు నిపుడు.
సమాధానాలు -
కనులకు పెను వేదనను గూర్చు జబ్బు - కలక
శృంగారచేష్టకు గుర్తు - కులుకు
వచ్చియు రానట్టి వరనిద్ర - కునుకు
షడ్రుచు లం దామ్ల సామ్యము - పులుపు
కాలి చివరి గుదికా లనగా - మడమ
విస్తృతార్థ పదము విధము - విరివి
మార్దవంబగు నూత్న మణికాంతి - మిసిమి
కోరికలను దెల్పుకొను మనండి - కోరుకో
అన్నీ సరైన సమాధానాలు పంపినవారు ఒక్కరు కూడ లేరు. ఒకటి, రెండు తప్పులతో సమాధానాలు పంపినవారు ....
మంద పీతాంబర్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి