6, అక్టోబర్ 2010, బుధవారం

చమత్కార పద్యాలు - 44

అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే.
కవిసార్వభౌముడు శ్రీనాథునికి ఒకానొక సభలో అన్నీ సర్వనామాలతో కూడిన ఈ సమస్యను ఇచ్చారట! దీనిని పూరించలేక ఆయన అవమానం పొందాలని వాళ్ళ ఆలోచన. కాని శ్రీనాథుడు వాళ్ళనే అవమానిస్తూ చేసిన పూరణ ...
ఉ.
కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్,
కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలుని యెక్కిరింతలున్,
కొందఱు కృష్ణ జన్మమునం గూసిన ధన్యులు నీ సదస్సులో
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే.

అర్థాలు -
భైరవాశ్వములు = కుక్కలు
పార్థుని తేరి టెక్కెముల్ = కోతులు
ప్రాక్కిటీశ్వరులు = పందులు
కాలుని యెక్కిరింతలు = దున్నపోతులు
కృష్ణ జన్మమున కూసిన ధన్యులు = గాడిదలు.

4 కామెంట్‌లు:

  1. పద్యం చాలా బాగుంది శ్రీనాధు డంటే మాటలా మరి ? చక్కని పడ్యాలను అందిస్తున్నందుకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  2. పద్యం బాగుందండి. ప్రాక్కిటీశ్వరులు = పందులు ఎలా వచ్చిందో వ్యుత్పత్తిని దయచేసి వివరించి చెప్తారా.

    రిప్లయితొలగించండి