14, అక్టోబర్ 2010, గురువారం

చమత్కార పద్యాలు - 48

ప్రహేళికా చాటు పద్యం
సీ.
ధరణిపుత్రుని పినతల్లి తమ్ముని సుతు
తాత యల్లుని రాణి తండ్రి కొడుకు
కొడుకు తండ్రికి తండ్రి కోడలి సుతు బంటు
కరియైనవా నబ్బ కగ్రసుతుని
తమ్ముని యేలిక తండ్రి వియ్యంకుని
కూతు నేర్పునఁ జెరగొన్నవాని
తనయుని ద్రుంచిన ఘను నౌషధముఁ దెచ్చు
వా నయ్య సుతుని తద్వరకుమారు
తే.గీ.
నవ్వ కోడలి కోడలి యన్న తండ్రి
భామయొద్దను కొలువున్న భామ జనకు
తనుయుచేతను గూలిన ఘనుని తల్లి
ధరుఁడు మీ కిచ్చుఁ బుత్రపౌత్రాభివృద్ధి.
- అజ్ఞాత కవి
ఇత డెవరో వివరించగలరా?

1 కామెంట్‌:

  1. ఈ ప్రహేళికా చాటు పద్యాన్ని అటునుంచి నరుక్కురావడానికి ప్రయత్నిస్తాను.

    తల్లి ధరుడు = గంగా ధరుడు.
    కూలిన ఘనుడు = భీష్ముడు
    తనుయుచేత = శిఖండి
    జనకు = పాంచాల రాజు
    కొలువున్న భామ = ద్రౌపది
    భామయొద్ద = సుధేష్ణ
    తండ్రి = విరాటరాజు
    అన్న = ఉత్తర కుమారుడు
    కోడలు = ఉత్తర
    కోడలు = ద్రౌపది
    అవ్వ = కుంతీదేవి
    వరకుమారుడు = ఘటోత్కచుడు
    సుతుడు = భీముడు
    అయ్య = వాయుదేవుడు
    ఔషదము తెచ్చువాడు = ఆంజనేయుడు
    ద్రుంచిన ఘనుడు = లక్ష్మణుడు
    తనయుని = ఇంద్రజిత్తు
    జెరగొన్నవాని= రావణుడు
    కూతురు = సీత
    వియ్యంకుని = జనక మహారాజు
    తండ్రి = దశరథ మహారాజు
    యేలిక = శ్రీరాముడు
    ఇంత దాకా లాక్కొచ్చాను. ఇక మిగతా మీరే శలవివ్వాలి.

    రిప్లయితొలగించండి