12, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 122

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
భూతములకు మ్రొక్కెఁ బురహరుండు.

13 కామెంట్‌లు:

  1. పురము లన్ని గూల్చి పూడ్చిన లోహము
    పుడమి నుంట గనియె భూతగణము
    పుడమి యేలుబడిన భూతేశు డెవడన్న
    భూతములకు మ్రొక్కెఁ బురహరుండు

    రిప్లయితొలగించండి
  2. యాతుధాన యోధు యమపురి కంపించి
    సీత చెరను బాప శ్రీ రఘుపతి
    మోదమాయె భువిని మునులకును సకల
    భూతములకు, మ్రొక్కె బురహరుండు.

    రిప్లయితొలగించండి
  3. వెండి కొండపై నివసించు వేల్పు ఎవడొ,
    ముక్తి దాయకుండఖిలాండ శక్తి ఎవడొ ,
    అట్టి జగజెట్టి ముక్కంటి ఆత్మ లోని ,
    భూతములకు మ్రొక్కె బురహరుండు.!

    రిప్లయితొలగించండి
  4. పాలవెల్లి బొంగు హాలాహలము మింగి
    రక్ష గూర్చె దేవ రాక్షసులకు
    కుక్షి సకల భూత రక్ష గోరుచు పంచ
    భూతములకు మ్రొక్కెఁ బురహరుండు

    రిప్లయితొలగించండి
  5. కైలా సమున జూడ కంకాళ నృత్యమ్ము
    బూది పూత లలదు భుజగ గళము
    లింగ పూజ లేల లింగేశ్వరా నీకు ?
    భూతములకు మ్రొక్కె బుర హరుండు.!

    రిప్లయితొలగించండి
  6. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మొదటి పద్యం నిర్దోషంగా, ధారాశుద్ధి కలిగి ఉంది.
    కాని పూరణ భావం కొంత క్లిష్టంగా ఉన్నట్టుంది.
    మీ రండవ పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని నేనిచ్చిన సమస్య "ఆటవెలది". మీ మూడు పాదాలూ తేటగీతిలో ఉన్నాయి. సరే! నా సమస్యనే తేటగీతిగా మారుస్తాను.
    "భూతములకుఁ బ్రణతుఁ డయ్యెఁ బురహరుండు"

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    కాని మొదటి పాదం మొదటి గణం "గగం" అవుతున్నది. దానిని ఇలా మార్చాను.
    "వెండికొండఁ జూడ తాండవ నృత్యమ్ము"

    రిప్లయితొలగించండి
  7. ధాత సారధియవ ధరణితా రధమయ్యె
    విష్ణు మందరములు విశిఖ చాప
    మవ్వ త్రిపురములను మట్టుబెట్టగ నాది
    భూతములకు మ్రొక్కెఁ బురహరుండు!

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నమస్కారమండీ, మొహమాటము ఎందుకు ? నా భావము: త్రిపురములు ఇనుము,వెండి,బంగారాలతో కట్టబడ్డాయి కదా. ఆ పూరాలను పురహరుండు కూలిస్తే వచ్చిన లోహాలు భూమిలో పూడుకు పోయాయిట. ఆ సంగతి తెలిసిన భూతాలు భూమి మీదకు ఆ లోహాలు దోచుకోవడానికి వచ్చి, పరిపాలకులయి, మదముతో 'భూతేశుడా ఎవడు ' అని ధిక్కరిస్తే ఈశ్వరుడు వాళ్లకో దండం పడేసాడుట. ఈ దినములలో పరిపాలించడం అంటే దోచుకోవడమేనా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారు నమస్కారం
    నా పొరపాటుని సవరింప యిచ్చిన సమస్యనే
    తేట గీతి లోకి మార్చారు .కృతఙ్ఞతలు .
    అజ్ఞానము వల్ల కొన్ని, అజాగ్రత్త వల్ల కొన్ని,
    అతి జాగ్రత్త వల్ల కొన్ని వెరసి ఎన్నో తప్పులు
    దొర్లుతూనే ఉన్నాయి ముందు కూడ దొర్లుతూనే
    ఉంటాయేమో! మీ ఓపికకు మరొక్క మారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నా సందేహం వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. మంద పీతాంబర్ గారూ,
    "ప్రమాదో ధీమతామపి" అని ఊరికే అన్నారా?

    రిప్లయితొలగించండి