28, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 136

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పచ్చి మాంసమ్ముఁ దినువాఁడు బ్రాహ్మణుండు.

23 కామెంట్‌లు:

 1. భూరుహములఁ గాసెడి కాయగూరలన్న
  భోజ్య మాంసంబు లేయని బుద్ధ బోధ
  యనగ - ప్రాణులఁ జంపక యవని నట్టి
  పచ్చి మాంసమ్ముఁ దినువాఁడు బ్రాహ్మణుండు!

  రిప్లయితొలగించండి
 2. పచ్చి మాంసమ్ము దినువాడు,బ్రాహ్మణుండు,
  ప్రక్క ప్రక్కనే నిలబడి మ్రొక్కినారు,
  పరమ నిష్టతో పరమేశు పార్వతులను,
  భుక్తి కొరకునొకరు,మరిముక్తికొకరు!

  రిప్లయితొలగించండి
 3. పచ్చి మాంసమ్ము దినువాడు, బ్రాహ్మణుండు
  అరయ ఇరువురియందలరారు ఆత్మ
  యొకటె యుచ్చ నీచలు మన యూహలే గ-
  దా, కులమునెంచి వేరిమి దలచ రాదు.

  రిప్లయితొలగించండి
 4. క్రూర మృగముల కటవి నాహార మేది?
  తెలుగులో భోక్త యన నేమొ తెలుపగలవె?
  బ్రహ్మ మెఱిగిన విఙ్ఞుడౌ వ్యక్తి యెవడు?
  పచ్చి మంసమ్ము, తినువాడు, బ్రహ్మణుండు.

  రిప్లయితొలగించండి
 5. రవి గారూ,
  పద్యం బాగుంది. కాని భావం తికమక పెడుతోంది.

  రిప్లయితొలగించండి
 6. మంద పీతాంబర్ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. నారాయణ గారూ,
  చక్కని భావంతో పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  మూడవ పాదంలో "ఉచ్చ నీచలు" ప్రయోగమే కాస్త ఇబ్బంది పెట్టింది.

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. సరేనండీ, అయితే ఉచ్చనీచల బదులు 'హెచ్చుతగ్గులు' అంటే సరిపోతుందా?

  రిప్లయితొలగించండి
 10. ధర్మము బహు సూక్ష్మము దాని మర్మమెరుగ
  ధర్మవ్యాధుడు బోధించె కర్మ వేత్త
  కౌశికునకు, చిత్రము గురుశిశువు లెవరు
  పచ్చి మాంసమ్ముఁ దినువాఁడు, బ్రాహ్మణుండు.
  మనవి: శిశువు = శిష్యుడు; బహుసూక్మంగా పరిశీలిస్తే భారతంలో ఆ ఉపాఖ్యనంలో ధర్మవ్యాధుడు మాసం అమ్ముకొన్నట్లుగా మాత్రమే చదివినట్లు గుర్తు. భారతంలోంచి ఒక పద్యం:
  ధర్మవ్యాధుడు:
  జీవహింస యెన్నండును జేయ ననఘ,
  యొరులు సంపి తెచ్చిన మాంస మొనర విలిచి,
  తగిన వెల కమ్మి బ్రదుకుదు(; దద్ధననమున
  నమల మానస శాంతి నా యర్ధ మెందు.

  రిప్లయితొలగించండి
 11. శంకరయ్య గారు,
  కాయగూరలు కూడా చెట్లకు మొలిచే మాంసమని బుద్ధుడి మాటట. జీవహింస చేయక, అట్టి మాంసాన్ని తినేవాడు బ్రాహ్మణుడని నా ఊహ.

  ఆఫీసులో సమయం దొరక్క, తొందరలో ఏదో పూరించాను.

  రిప్లయితొలగించండి
 12. పచ్చి మాంసమ్ము దినువాడు, బ్రాహ్మణుండు
  ఒక్క చోటనె నివసించె నొక్క నాడు !
  కరువు బ్రాహ్మడి జీవనం బరువు చెయ్య
  పక్షి మాంసమ్ము కటికుడే పంచి ఇచ్చె !!

  (త్రిశంకుడు, విశ్వామిత్రుల కధ ఆధారంగా)

  రిప్లయితొలగించండి
 13. మిగుల ధర్మసూక్ష్మములను మిధిల పురిని
  పచ్చిమాంసమ్ముఁ దినువాఁడు బ్రాహ్మణుండు
  నకు దెలియఁజెప్పెఁ దగదు గుణాఢ్య్హులందు
  కులము నెంచంగ బుధులకుఁ గొఱఁత గాదె

  రిప్లయితొలగించండి
 14. పచ్చి కూరలు ఫలములు మెచ్చి తినగ
  హెచ్చు ధరలకు కొనితిన యేరికైన
  ముచ్చ టించగ మునులైన మరచి తినిరి
  పచ్చి మాంసమ్ము తినువాడు బ్రాహ్మ ణుండు

  రిప్లయితొలగించండి
 15. జాతి భేదము గాంచునె జ్ఞాని యైన
  పచ్చిమాంసమ్ముఁ దినువాఁడు,బ్రాహ్మణుండు,
  సింహ,సామజ,శార్దూల శ్రేణులందు
  ఆత్మ వర్తిల్లు టెఱుగడె నాత్మ యందు

  ఇది భగవద్గీత రహస్యం కదండీ !

  రిప్లయితొలగించండి
 16. గుడికి వెడలిరి రామురహీము గలసి మెలసి
  బడిని జదివిరి పసివారు భాయి భాయి .
  గుడియె బడియైన వరమిచ్చు గురువు శివుడు
  పచ్చి మాంసమ్ము దినువాడు బ్రాహ్మ ణుండు

  రిప్లయితొలగించండి
 17. రవి గారూ,
  మీ వివరణతో సందేహనివృత్తి జరిగింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. నచికేత్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పద్యం మూడవ పాదంలో "శార్దూల శ్రేణులందు" అన్నప్పుడు "శ్రే"కు ముందున్న "ల" గురువై "శార్దూల" మగణం అవుతున్నది. గమనించండి.

  నేదునూరి రాజేశ్వరి గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
  "కొని తిన యేరికైన" అనేది "కొని తిన నేరికైన" అంటే నిర్దోషంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 19. నమస్కారమండీ, ధన్యవాదములు. మూడవపాదాన్ని

  సింహ శార్దూల సామజ శ్రేణు లందు

  గా మారుస్తాను.

  రిప్లయితొలగించండి
 20. పాంచభౌతికమైన ప్రపంచమందు
  నుచ్చ నీచ గుణంబులు నుండగలవె?
  పచ్చి మాంసమ్ము దినువాడు , బ్రాహ్మణుండు
  తరచి చూడగనొకటె అద్వైతమందు!!!

  రిప్లయితొలగించండి