13, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 103 (ప్రహేళిక)

సీ.
మనుజుని యాకార మహిమకు మొద లెద్ది?
నగవైరివైరి దౌ నగర మెద్ది?
రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది?
శిబి కర్ణు లార్జించు చెలువ మెద్ది?
పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది?
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది?
నయనాంగరక్షకు ననువైన బల మెద్ది?
చెలఁగి మానముఁ గాచు చె ట్టదెద్ది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్కరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

9 కామెంట్‌లు:

  1. మనుజుని యాకార మహిమకు మొద లెద్ది? - తల
    నగవైరివైరి దౌ నగర మెద్ది? - లంక
    రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది? - కాకి
    శిబి కర్ణు లార్జించు చెలువ మెద్ది? - కీర్తి
    పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది? - తీపి
    గిరిపతి భుజియించు గిన్నె యెద్ది? - పుర్రె
    నయనాంగరక్షకు ననువైన బల మెద్ది? - రెప్ప
    చెలఁగి మానముఁ గాచు చె ట్టదెద్ది? - పత్తి

    రిప్లయితొలగించండి
  2. మురళీ మోహన్ గారూ ! భలే చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా !
    "ఆదులుడుపంగ దుదలెల్ల నాదు లగును"
    అంటే ఏమిటి ?

    రిప్లయితొలగించండి
  4. కవిమిత్రులారా,
    కోడీహళ్ళి మురళి మోహన్ గారూ సరైన సమాధానాలు ఇచ్చినందున, వివరణ అవసరం లేనందున ‘ప్రహేళిక సమాధానం’ అని ప్రత్యేకంగా పోస్ట్ పెట్టడం లేదు.

    రిప్లయితొలగించండి
  5. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    ధన్యవాదాలు, అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    రెండక్షరాల సమాధానంలోని మొదటి అక్షరాన్ని వదిలితే మిగిలిన రెండవ అక్షరం తరువాతి సమాధానానికి మొదటి అక్షరం అవుతుంది.
    మొదటి సమాధానం ‘తల’లోని మొదటి అక్షరం ‘త’ను తొలగిస్తే మిగిలిన ‘ల’ రెండవ సమాధానానికి మొదటి అక్షరం అవుతుంది. రెండవ సమాధానం ‘లంక’. ఇలాగే మిగిలినవీ.
    ఈ రోజు ఇస్తున్న ప్రహేళిక ఇలాంటిదే. ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు !
    నేను రెండూ ఒకే అక్షరాలు ఉండాలనుకున్నాను !
    మొదటిది తీసేస్తే రెండవదే మొదటిది అవ్వాలనుకున్నా !

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ,
    నగవైరికి శత్రువులు రాక్షసులందరూ కాబట్టి తేల్చుకోలేకపోయాను. అది తప్ప మిగతావన్నీ తెలిశాయి. కానీ

    లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;

    ఈ పాదం తికమక పెట్టింది. ఈ తుది అక్షరాలతో ఏదైనా పెద్ద పదం రావాలేమో అని అనుకుని ఆ పదాలతో ఏ పదమూ రాక మౌనంగా ఊరుకున్నాను. అయ్యో!

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ,
    ఈనాటి ప్రహేళికను ప్రయత్నించండి. విజయోऽస్తు!

    రిప్లయితొలగించండి