1, జులై 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 60

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

60

ON the seashore of endless worlds
children meet. The infinite sky is
motionless overhead and the restless
water is boisterous. On the seashore
of endless worlds the children meet
with shouts and dances.

They build their houses with sand
and they play with empty shells. With
withered leaves they weave their boats
and smilingly float them on the vast
deep. Children have their play on the
seashore of worlds.

They know not how to swim, they
know not how to cast nets. Pearl
fishers dive for pearls, merchants sail in
their ships, while children gather pebbles
and scatter them again. They seek not
for hidden treasures, they know not how
to cast nets.

The sea surges up with laughter and
pale gleams the smile of the sea beach.
Death-dealing waves sing meaningless
ballads to the children, even like a
mother while rocking her baby's cradle.
The sea plays with children, and pale
gleams the smile of the sea beach.

On the seashore of endless worlds
children meet. Tempest roams in the
pathless sky, ships get wrecked in the
trackless water, death is abroad and
children play. On the seashore of end-
less worlds is the great meeting of
children. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

అంతు తెలియని యీ ప్రపంచాంబురాశి
తీరమున్ వేడ్క బాలురు చేరుకొనిరి ||

కలదు మీద నపారనిశ్చలనభంబు,
నిరతచలదూర్మిమాలిక తరచుఁ గ్రింద,
ఆటపాటల పెన్ హళాహళి చెలంగ
నంతు తెలియని యీ ప్రపంచాంబురాశి
తీరమున్ వేడ్క బాలురు చేరుకొనిరి ||

ఇసుకకుప్పలతోఁ దమ యిండ్లు కట్టి,
యాడుదురు వట్టిగవ్వలతోడ వారు,
పుడమిఁ బడు నెండుటాకులఁ బడవ లల్లి
లేతనవ్వున విడుతురు లోతునీట,
నాటపై వేడ్కతోఁ బ్రపంచాంబురాశి
కూలమందున బాలురు గూడుకొనిరి ||

ఈదుటయు రాదు, వలవేయరాదు తమకు,
మునుఁగుచుండిరి నావికుల్ ముత్తెములకు,
బంగరువు వెండి వర్తకుల్ పడవ లెక్కి
చనుచునుండిరి ధనసమార్జనము కొరకు,
కాని, బాలకులో మరి కడలిదరిని
గులకరాల్ కుప్పకుప్పలు కూర్చుకొనుచుఁ
దిరిగి వెదఁజల్లుచుండిరి దెసలనిండ
తమ ధనము చాటుమాటున దాచుకొనెడి
పనియె తెలియదు, వలలును పన్నరాదు ||

అట్టహాసాన పొంగె మహాంబురాశి
నురుగు చిరునవ్వు రేఖలు దరుల మెరసె,
తొట్టెలో నూగు బిడ్డ సంతోషమునకుఁ
దల్లి జోలగ వోలె నర్థమ్మె లేక
పాడె మృత్యువు బేరము లాడు తరఁగ
లాడుకొనుచుండె బాలురతోడఁ గడలి,
నురుగు చిరునవ్వు రేఖలు దరుల మెరసె ||

అంతు తెలియని యీ ప్రపంచాంబురాశి
తీరమందున బాలురు చేరుకొనిరి,
బాట గనరాని మింట తుపాను విసరె,
పగిలెఁ బడవలు గుర్తు గన్పడని తడల,
మృత్యు వచ్చట విచ్చలవిడిగఁ దిరిగె ||

కాని, బాలకులో మరి కడలిదరికి
నాడుకొనుచునె యున్నారు వేడు కలర,
నంతు తెలియని యీ ప్రపంచాంబురాశి
కూలమున బాలకుల్ గుమిగూడినారు ||

7 కామెంట్‌లు:

  1. Sankaranarayana Sastry, Xclass, Tirupati.ఆదివారం, జులై 01, 2012 8:50:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    గురువర్యులకు నమస్కారములు.
    పదవ అరగతిలోని శ్రీ చలం గారి అనువాదమును తిలకించండి.

    అంతులేని లోకాల సముద్ర తీరాన
    పిల్లలు కలుసుకున్నారు,
    పైన అనంతాకాశం నిశ్చలంగా వుంది,
    అవిరామంగా సముద్రం పొంగిపొర్లుతోంది.
    అంతంలేని లోకాల సముద్ర తీరాన
    పిల్లల అరుపులతో నృత్యాలతో కల్కౌసుకున్నారు.

    ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటారు
    ఉత్త ఆల్చిప్పలతో ఆడుకుంటారు.
    ఎండుటాకులతో పడవలుచేసి
    విశాల సముద్రం పైన చిరునవ్వుతో వొదులుతారు
    లోకాల సముద్రతీరాల పిల్లలాడుకుంటున్నారు.

    ఈదడమెట్లానో తెలీదు వారికి.
    వలలు వెయ్యడమూ ఎరుగరు.
    పల్లెవాళ్ళు ముత్యాలకోసం మునుగుతారు.
    వర్తకులు ఓడల్లో ప్రయానమౌతారు.

    కానీ పిల్లలు గుళకరాళ్ళను పోగు చేసికొని
    వాటిని నీళ్ళలో వెదజల్లూతారు.
    గుప్తభాగ్యరాసుల కోసం వెతకరు.
    వాళ్ళకి వలలు వెయ్యడం చాతకాదు.

    నవ్వులతో పొంగుతోంది సముద్రం.
    తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది,
    మృత్యు భయంకరమైన అలలు
    శిసువుకి వుయ్యాలలూపే తల్లివలె
    అర్థంలేని జోలపాటల్ని పాడుతున్నాయి,
    సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది.
    తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది.

    అంతులేని లోకాల సముద్ర తీరాన
    పిల్లలు కలుసుకున్నారు.
    తోవ తెలీని ఆకాశంలో తుఫాను విహరిస్తోంది,
    నావలు భగ్నమౌతున్నాయి.

    మృత్యువు విచ్చలవిడిగా సంచరిస్తోంది.
    పిల్లలు ఆడుతున్నారు, అమతులేని లోకాల తీరంపైన
    పిల్లల గొప్ప సమావేశం జరుగుతోంది.

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 01, 2012 9:05:00 AM

    అద్భుతమైన విశ్వకవిభావనలకు
    చక్కని అనువాదమునందించిన శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులవారికి శతకోటి వందనములు. ఆకాశము,సముద్రమునకు సంబంధించిన కవిత్వమేదైనా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. శంకరనారాయణ శాస్త్రి గారూ,
    నాకెంతో శ్రమ తగ్గించారు. పదవ తరగతి పాఠ్యపుస్తకం సంపాదించి చలం అనువాదాన్ని వ్యాఖ్యగా పెట్టాలనుకున్నాను. ఆ పని మీరు చేసారు. ధన్యవాదాలు. అన్నట్టు మీరు పదవ తరగతి ఉపాధ్యాయులా? విద్యార్థులా?
    *
    శ్రీపరి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 01, 2012 12:44:00 PM

    గురువుగారు ధన్యవాదములు. శంకరనారాయణ నా కుమారుడు. 10వ తరగతి చదువుతున్నాడు.

    రిప్లయితొలగించండి
  5. అద్భుతమైన పద్యం. ఆచార్యుల వారి అనువాదం మహాంబురాశి లహరి వలే ఉన్నది.

    రిప్లయితొలగించండి
  6. ’the tree’ గారూ
    ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చాలా సంతోషం.
    *
    రవి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి