30, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 138

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్.

26 కామెంట్‌లు:

  1. విరి శరముల కలవర పడి
    పురహరుడే వివశు డయ్యె ,పూర్వము జూడన్,
    నరవర వెరువక మగువ,ము
    ఖర,పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్!

    రిప్లయితొలగించండి
  2. వర కవితా శరనిధియై
    సరస్వతీ చరణసేవ సాగించెడి ని
    ర్భర పుణ్యశాలి-కవి శే
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్!

    రిప్లయితొలగించండి
  3. మంద పీతాంబర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ముఖర శబ్దానికి శంఖము, మ్రోగేది, అసంబద్ధ ప్రలాపి అనే అర్థాలున్నాయి. మీ ఏ అర్థంలో ఉపయోగించారో?

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత గారూ,
    అద్భుతమైన పూరణ. ధన్యోస్మి! ధన్యవాదాలు.
    ఇంత చక్కని పద్యం వ్రాసి అజ్ఞాతంగా ఉండడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  5. కరిచర్మా౦బర ధారీ,
    హరహర శంకర భవభయ హరణుడు, నాగా
    భరణు౦డౌనా శశిశే
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్.

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత గారి పూరణ అత్యద్భుతం వారికి అభినందనలు.
    నేను సందేహ పడుతూనే పూరించాను .చిన్నప్పుడు
    నే చదివిన ప్రహ్లాదుని ఒక పద్యం గుర్తుకొచ్చింది "చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులు "
    ముఖర అన్న పదానికి" ముఖ్యమైన" అన్న అర్థం గురువు గారు చెప్పి నట్లు గుర్తు
    నేను జ్ఞాపకము ఉంచుకోవడములో పొరపాటైనా పడిఉండ వచ్చును.అర్థం సరిపోతే
    పేచే లేదు సరి పోకపోతే సవరించు కొంటాను.

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారూ, ఈ సమస్య బాగుందేమో చూస్తారా?
    "రాజీవుని నామ జపము రసభస జేసెన్"

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    చక్కని ధారాశుద్ధితో మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందన్లౌ.
    అయితే "కరిచర్మాబర ధారీ, హరహర శంకర" వరకు సంబోధనాంతాలై, భవభయ హరణుడు, నాగాభరణుండు అనేవి ప్రథమార్థాలుగా ఉన్నాయి. దానికి ఇలా చెపితే బాగుంటుంది కదా!
    కరిచర్మాంబరధారియు
    హరుఁడును శంకరుఁడు కష్ట హరణుఁడు నాగా
    భరణుండగు నా శశిశే
    ఖర పదముల మ్రొక్కి నపుడె కలుఁగును సుఖముల్.

    రిప్లయితొలగించండి
  9. నచికేత్ గారూ,
    మీరు పంపిన సమస్య బాగుంది. కొద్దిగా సవరించి ప్రకటిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. హరి పదములు, రమకు వరము,
    పురహరి పదములు, గిరిజకు పరమై పోయెన్,
    పుర జనులకు సద్గుణ శే
    ఖర పదముల మ్రొక్కి నపుడె కలుగును సుఖముల్!

    చంద్ర భాసురమునుండి,చంద్ర శేఖరుండు నాగాభరణుoడై,
    హరిహర శంకరుడై ,శిశి శేఖరుడై ,హృద్యమైన పద్యాన్నిచ్చి
    సుఖాన్ని కలుగ జేశారు .అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మాష్టారు గారూ, సవరణకి ధన్య వాదములు. పద్యం పంపిన తరువాత నాలో నేను చదువు కొన్నప్పుడు అదేఅనిపించింది.ఇంకొక రెండు పూరణలు చేసి పంపుతాను, వేరే రకంగా.

    రిప్లయితొలగించండి
  12. హరిహర పృథుశాఖమ్ముల
    విరులెన్నియొ పూచి హృదిని వికసింపంగా
    తరుమూల జ్ఞా బుధశే
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్

    రిప్లయితొలగించండి
  13. సిరులను గోరెదొ శశిశే-
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్,
    మరి మోక్షగామివే శ్రీ
    హరి చరణమె శరణ మగును అవనిని నీకున్.

    రిప్లయితొలగించండి
  14. వరద కటి హస్తునా భూ
    సుర సుందర శ్రీనివాసు సుక్షేత్రమునన్
    భరవన పరివృత పుణ్యశి
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్.

    మనవి: మా ఇలవేల్పు శ్రీ వేంకటేశుని శనివారం నాడు స్మరిస్తూ ఆ స్వామి మీద పద్యం వ్రాయటం ఆనందదాయకంగా వుంది.

    రిప్లయితొలగించండి
  15. అజ్ఞాత గారి పూరణ అద్భుతంగా ఉంది. పీతాంబరుల వారు మంచి చంద్రభాసుర పట్టులో వ్రాస్తున్నారు. చంద్రశేఖరుల వారి పదమిది.మంచి పూరణలందిస్తున్నారు.మిస్సన్న గారు,నారాయణ, నచికేత్లు,రాజేశ్వరి గారు అందమయిన పద్యాలందిస్తున్నారు. కార్తీక మాసము దగ్గఱలో ఉంది. శంకరుల వారి కొలువులో ఉన్నందుకు సంతోషంగా ఉంది.

    ఆర్యా అజ్ఞాత గారూ,

    కవిచంద్రులు,కవి సూర్యులు
    కవిసింహులు,కవుల నందు ఘనవిక్రములున్
    కవిఋషభులు,కవిశిఖరులు
    కవివర యజ్ఞాత మేల కనరారండీ !

    రిప్లయితొలగించండి
  16. నిరతము పరహిత మందున
    పరమానందమును( బొందు పవనసుతుడు,దా
    శరధీ ప్రియుడా కపిశే
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్.

    మనవి: మన జీవిత‘సమస్య’లను భవ్యముగ పూరించు మా స్వామిని మరచుటెట్లు? అందుకే ఈ సమర్పణ.

    రిప్లయితొలగించండి
  17. కరి వదనుని స్తుతియించగ
    పరిమార్చును వెతల నెపుడు పరితుష్టి నొసంగన్ !
    సిరి విరిసిన మరువక హరి
    ఖర పదముల మ్రొక్కి నపుడె కలుగును సుఖముల్ !
    ------------------------------------------
    విరిసిన వలపులు మది
    మురిపింతురు చెంత జేరి ముదితలు వింతన్ !
    మరువక మాధవు డైనను
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్ !

    రిప్లయితొలగించండి
  18. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "తరుమూలజ్ఞా బుధ" కంటె "తరుమూలజ్ఞులు బుధ" బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    బాగుంది. సిరులకు హరుడు, మోక్షానికి హరి పేటెంట్ హక్కుదారు లన్నమాట!
    మంచి పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మంద పీతాంబర్ గారూ,
    మంచి పద్యం చెప్పారు. ఈ పద్యంతో మీరూ సద్గుణశేఖరు లయ్యారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలూ ఉదత్తంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పద్యంలో "భూసుర"శబ్దం అక్కడ పొసగదు. అది "భాసుర" అయితే బాగుంటుంది. "భరవన" శబ్దం కొన్ని క్షణాలు నన్ను అయోమయావస్థకు గురి చేసింది. తరువాత ఓకే అనిపించింది. "సుందర శ్రీనివాసు" అన్నప్పుడు సమాసాంతర్గతమై "ర" గురువై గణదోషం ఏర్పడింది.
    వరద కటి హస్తుఁడగు భా
    సుర సుందర వేంకటేశు సుక్షేత్రమునన్ ........

    రిప్లయితొలగించండి
  22. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అజ్ఞాత మీద మీ పద్యం చాలా బాగుంది. నా అభిప్రాయం కూడ అదే. మిగిలిన కవి మిత్రుల పూరణలు మీకు నచ్చుతున్నందుకు, వారిని ప్రశంసించినందుకు సంతోషం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరి గారూ,
    మీ మొదటి పద్యం రెండవ పాదం చివర "పరితుష్టి నొసంగన్" అన్నప్పుడు గణదోషం ఉంది. "పరితుష్టి నిడన్" అంటే సరిపోతుంది. "హరి ఖర పదముల" అన్నప్పుడు "ఖర" శబ్దానికి "వాడియైన" అనే అర్థాన్ని తీసుకున్నారా?
    రెండవ పద్యం మొదటి పాదంలో గణదోషం ఉంది. "మది" "మదిలో" అయితే సరిపోతుంది. "మాధవుఁ డైనను ఖర పదముల మ్రొక్కి" అంటే అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  24. మాష్టారు గారు,
    చక్కటి మెరుగులు దిద్దుతూ మాకు చెప్పకనే మంచి పాఠాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు. ఈ రకంగా నేర్చుకోగలగటం మా అదృష్ట౦గా భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  25. విజ్ఞానార్జన లక్ష్యము,
    అజ్ఞాన తమిస్ర భావనాథః కరణ
    మ్మే జ్ఞేయమైన వాడను
    అజ్ఞాతను - నా నమస్సులందరికివియే!!!!
    ..
    గన్నవరపు కవికి ఘన నమోవాకాలు!!!!


    సంపాదక మహాశయులకూ.....ఇతరేతర కవి బృందానికీ..... సాధు వాదాలు.....

    రిప్లయితొలగించండి
  26. చెఱసాల నుండి వెలువడి
    స్వరముల గగ్గోలు వినగ శరణమ్మనుచున్
    వెఱచిన వసుదేవుని వలె
    ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్

    రిప్లయితొలగించండి