18, అక్టోబర్ 2010, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - 13

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా!

9 కామెంట్‌లు:

రవి చెప్పారు...

సీతాలచ్చికి ముద్దుబావ యతఁడే చిన్నారి ప్రాయమ్ముచే
రైతాయెన్ తనువృత్తిధర్మమమరన్, రాణించె తాఁ మిన్నగాఁ.
ప్రీతింబొంది వరించె సీత తమితో విద్యావిహీనుండయున్
సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా!

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

త్రేతా కాలము నందు రాక్షసుల మర్దింపంగ, శ్రీరామునిన్
బ్రీతిన్ గోరిరి భక్త యోగి గణముల్ "వేరొండు జన్మంబులోఁ
జేతున్ మీకు మనోభిరామ ఫలమున్ స్త్రీలవ్వఁ" దాఁ బల్కె, యో
సీతా! మానస చోరుఁడెవ్వడనినన్ శ్రీకృష్ణ మూర్తే గదా !

మిస్సన్న చెప్పారు...

మాతా! రుక్మిణి! లక్ష్మివై కృతమునన్ మమ్మేలవే! సీతవై
త్రేతంబందున పొందవే ధరణి సత్కీర్తిన్! యనన్, నారదా!
సీతామానస చోరుడెవ్వడనినన్, శ్రీ కృష్ణమూర్తే గదా!
ప్రీతిన్ రాఘవ మూర్తియై శివుని పెన్విల్ద్రుంచె నీకై యనెన్.

కంది శంకరయ్య చెప్పారు...

రవి గారూ,
పూరణ చాలా బాగుంది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.

మంద పీతాంబర్ చెప్పారు...

మాతాజానకి నిన్ను నే ను గొలుతున్ మాపాలి దైవంబుగా

నాతో డె ప్పుడు వీడ కుండుము సదా నా భాగ్య సంధాయినీ

నీతో జెప్పెద జాంబవంతుని సుతన్ నీ రాము తో జెప్పవే

సీతా !మానస చోరు డెవ్వడనినన్ శ్రీ కృష్ణ మూర్తే గదా !

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మూతల్ బెట్టిన కుండలన్ని కదిపెన్ మ్రుచ్చిల్లినా రయ్యయో !
ప్రీతిన్ మీగడ పాలు వెన్నలెవరో ? రేయంత కాపాడినన్!
చేతన్ బట్టగ నింత లేదు యిదుగో చెప్పమ్మ ఓ రాధికా !
సీతా !మానస ! చోరుఁ డెవ్వఁ డనినన్: "శ్రీకృష్ణమూర్తే కదా!"

కంది శంకరయ్య చెప్పారు...

మంద పీతాంబర్ గారూ,
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

భ్రాతన్ గూడుచు రావణాసురుని నిర్బంధించి చెండాడుటన్
కోతుల్ మూకను దెచ్చి పోరిడిన శ్రీ కోదండ రాముండెపో
సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్;..శ్రీకృష్ణమూర్తే కదా
ఖ్యాతింజెందిన గీత నుడ్వి నరునిన్ కవ్వించి పోరించెగా :)