9, మే 2012, బుధవారం

పద్య రచన - 17


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. ముత్యాల సరాలు:

  విజయనగరపు వెలుగులందున
  విపుల తేజము వెలయు జ్యోతిగ
  విజ్ఞుడౌ గురజాడ తనరెను
  విమల చరితుండై

  కన్నెలకు శుల్కముల గొనుచును
  చిన్న పిల్లలకున్ వివాహము
  లెన్న ముసలులతో నొనర్చుచు
  నున్న ఘటనలనూ

  పలు దురాచారముల గుండెల
  పగులజేసెడు రీతులుండగ
  ప్రజలలో చైతన్య దీప్తులు
  వరల జేయుచునూ

  దేశమంటే మట్టికాదోయ్
  దేశమంటే మనుజులోయని
  దేశభక్తిని చాటి చెప్పిన
  ధీనిధానుడునూ

  అప్పరావు మహామనీషిగ
  నలరె నీ ముత్యాల సరముల
  నా మహాత్ము నలంకరించుచు
  నంజలింతు నిదే

  రిప్లయితొలగించండి
 2. శ్రీ సరస్వత్యై నమః:

  అయ్యా! నమస్కారములు.
  ఈ రోజు పద్య రచన శ్రీ గురజాడ వారి గూర్చి కావున నేను ముత్యాల సరాలు వ్రాసి పంపేను. ఔత్సాహికులైన కవులు ముత్యాల సరాలు వ్రాయుటకు వీలుగా దాని చందస్సు లక్షణములను వ్రాయుచున్నాను.

  ముత్యాల సరాలు: మాత్రాచందస్సు వాడవలెను: 1 2 3 పాదములలో వరుసగా 3,4,3,4 మాత్రలతో గణములు 4వ పాదములో 3,4,2 మాత్రల గణములు ఉండవలెను. యతి ప్రాస నియమములు లేవు కాని అందముగా ఉండుటకు ప్రతి మొదటి అక్షరము ఒకే వర్ణము నుంచ వచ్చును లేక ప్రాసను వేసుకొనవచ్చును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. గేయ రచన

  గురజాడ మహాశయా !
  వందనములు
  అన్నావు నీవు..........
  దేశ మంటే మనుషులని
  మాన వత్వాన్ని చాటి చెప్పావు
  కన్యా శుల్కాన్ని , దురాచారాలను
  రూపు మాపావు
  దేశ భక్తిని ప్రజలలో
  ప్రోత్సహించావు
  నిను కన్న విజయ నగరము
  ధన్యము
  మీ కివియే మా జోహార్లు .


  0 comments:

  రిప్లయితొలగించండి
 4. శా.
  శ్రీమంతంబగు తెల్గునేల కిలలో శ్రేయంబులందించు హే
  ధీమన్! శ్రీ గురజాడవంశతిలకా! దివ్యాంశసంభూత! యీ
  భూమిన్నిల్చు త్వదీయనిర్మలయశ:పుంజంబు సంస్కారరూ
  పా!మాన్యా! కొనుమంజలుల్ శతములప్పారాయ విద్వన్మణీ!
  సీ.
  దేశాన్ని ప్రేమించు, దీప్తులెల్లెడ చాటు
  జగతిలో శ్రేష్ఠంబు జన్మభూమి,
  దేశానికర్థంబు దేశవాసులెగాని
  మట్టికాదను మాట మదిని నిల్పి
  సొంతలాభంబింక కొంతైన మానుచు
  నరుడ! తోడ్పడవోయి పొరుగులకును
  అన్నదమ్ములవోలె యఖిలాంధ్రజనులార!
  మతభేదములు మాని మసలుకొనుడు
  ఆ.వె.
  దేశవాసులార! యాశాలతను బూని
  కలసి మెలసి యుండు డిలనటంచు
  సోదరత్వబోధ లాదరంబుగ జేసె
  సకలజగతికి గురజాడ నాడు.
  కం.
  కన్యాశుల్కము మాన్పగ
  నన్యాయము ద్రుంచఁ బూని యద్భుత కృతులన్
  ధన్యుండై యొనరించెను
  మాన్యుడు, గురజాడ చూడ మహితాత్ముడిలన్.
  కం.
  గురజాడకు నరయంగా
  సరిసము లెవ్వారు లేరు సకలజగాలన్
  నిరతము సంఘంబున సం
  స్కరణమునన్ మగ్నుడైన ఘను డాతండున్.
  ఆ.వె.
  సార్థకంబొనర్చె సంఘసేవను జన్మ
  ధన్యజీవి యతడు ధరణిలోన
  స్మరణ యోగ్యమింక సకలాంధ్రజగతికి
  నా మహానుభావు నామ మెపుడు.

  ముత్యాల సరాలు:

  నేడు మిక్కిలి భక్తితో గుర
  జాడ కంజలి చేసి నిల్తును
  తోడు నీడై సంఘ మంతకు
  నాడు నిల్చెను తాన్.

  స్వార్థ భావన విడిచి పెట్టుట,
  సంఘసేవకు నడుము కట్టుట
  నిజముగా గురజాడ కంజలి
  సత్య మియ్యదియే.

  రిప్లయితొలగించండి
 5. విజయ నగరపు వెలుగవు వీ ర పురుష !
  దేశ భక్తిని చాటిన ధీ యుతుండ!
  అప్ప రావు మ హా శ య ! యందు కొనుము
  నాదు జోహార్ల శతమును నవ్య చరిత !

  రిప్లయితొలగించండి
 6. స్వాతి ముత్తెపు సరములకవికి
  లేత కొమ్మల పాలిభవునకు
  జోత లనెదను జోతలనెదను
  భక్తిభావమొదువ

  రిప్లయితొలగించండి
 7. శ్రీ హరి.....మూర్తి గారూ!
  శుభాశీస్సులు. మీ రచనలు చాలా చక్కగా ఉంటున్నవి. మంచి భావములు, పద్య ధార, సరళ పదజాలము వెరసి .. .. సెహబాస్

  రిప్లయితొలగించండి
 8. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
  ఆర్యా!
  ధన్యవాదములు మరియు నమస్కారములు.

  రిప్లయితొలగించండి
 9. గురుతుల్యులైన పెద్దలకు నమస్కారములు.
  ఆర్యా!
  కందపద్యంలో "ప్రాసయతి" సమ్మతమేనా? దయచేసి తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 10. కందపద్యంలో "ప్రాసయతి" సమ్మతం కాదండీ.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా శ్రీ హరి గారూ!
  ప్రాస నియమము లేని పద్యములలోనే ప్రాసయతిని వేసుకొనవచ్చును. కంద పద్యమునకు ప్రాస నియమము కలదు కాబట్టి ప్రాసయతి వేయరాదు. శ్రీ శ్యామలరావు గారికి మీకు అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,

  మాన్యుడౌ గురజాడ జాడను
  మంచి మాటలతోడ చాటిన
  రామజోగి సన్యాసి రావుకు
  రక్తి నంజ లిడుదున్.

  లలితముగ ముత్యాల సరముల
  లక్షణము వివరించి మించిన
  పండితున కఖండ యశ సం
  ప్రాప్తి చేకుఱుతన్.
  *
  సుబ్బారావు గారూ,
  గురజాడపై మీ వచన కవిత్వం, పద్యం బాగున్నాయి. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  ఎప్పుడూ మీ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. మీ పద్యాలు, ముత్యాల సరాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  చక్కని ముత్యాలసరం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. చిరుత ప్రాయపు పాపల
  పరువము సడలిన ముదుసలి బాపల తోడన్
  పరిణయముల ఖండించిన
  పరశువు గురజాడ యనుట పాడియు గాదే

  సరసుల మనసులు దోచియి
  కరమగు ఖ్యాతిని బడసిన కన్యా శుల్కం
  విరచించచె మన మహాకవి
  గురజాడను నే నుతింతు గురు భావముతో

  రిప్లయితొలగించండి
 14. పంతుల గోపాల కృష్ణారావు గారూ,
  గురుజాడపై మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘చిరుత ప్రాయపు’ అన్నప్పుడు ‘త’ గురువు కాదు. ‘చిరు ప్రాయము గల పాపల’ అందాం.
  రెండవ పద్యంలో ‘శుల్కం’ అని వ్యావహారిక పదం వేసారు. దీని గురించి మీ అభిప్రాయం తెలిపారు కూడా. అయినా ఎందుకో మనస్సు ఒప్పుకోదు :-)
  ‘కన్యాశుల్క / మ్ము రచించె’ అందామా?
  ‘విరచించె’లో ఒక ‘చ’ అదనంగా టైపాటు వల్ల చేరంది...

  రిప్లయితొలగించండి
 15. శంకరయ్య గారూ, మీ వంటి పండిత కవుల మాట నాకు అవశ్యమూ శిరోధార్యమే.అయతే చిరుత ప్రాయపు.. అన్నప్పుడు త ఎందుకు గురువౌతుందని భావించి వ్రాసేనో చెప్పాలి కదా? నా వద్దనున్న (శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారిచే పరిష్కరింపబడి ప్రచురింప బడిన) ఛందఃపదకోశ మనే గ్రంథంలో- సాంస్కృతిక సాధ్య సమాసమందు మిశ్ర సమాస మందు పూర్వ పదాంత లఘువు పాక్షికము గా గురువగును అని ఉంది.ఉదాహరణములుగా యదుపతి స్తవము,( సాం. సా.స.), ముదుసలి వ్యాఘ్రము ( మి.స) ఇవ్వబడినవి ఈ రెండిటిలో పూర్వ పదాంత లఘువులు(తి,లి) పాక్షికముగా గురువులు. అనగా వాటిని తేల్చి పల్కి లఘువులుగా, ఊది పలికి గురువులుగా కూడ ప్రయోగించ వచ్చును అని ఉన్నది. మిశ్ర సమాసమయిన చిరుత ప్రాయము లో త ను గురువుగా కూడప్రయోగించ వచ్చుననే భావన తోనే నేను ఆ ప్రయోగము చేసాను.కన్యాశుల్కం అనే వ్యావహారిక పదం మీరు వద్దన్నారు కనుక మాని వేసే వాడినే. కాని ఇక్కడ దాని వ్యావహారిక పదం గా భావించి వేయ లేదు.ఆ నాటకం " కన్యా శుల్కం" అనే నామధేయం తోనే ప్రాచుర్యం పొందింది. ముఖ పత్రం మీద అలాగే ఉంటుంది. ఈ కారణం చేతనే అలాగే వాడేను.అది వద్దనుకుంటే మీరు సూచించినట్లుగా కన్యాశుల్కమ్ము రచించె అన్నా అందం గానే ఉంటుంది. విరచించే అనే పదం మధ్యలో ఒక చ అదనంగా పడడం టైపు లో పొరపాటే.మీకు నా ధన్య వాదాలు.

  రిప్లయితొలగించండి