25, మే 2012, శుక్రవారం

ప్రత్యేక వృత్తము - 13

మణిరంగము -
ఇది 10వ ఛందమైన ‘పంక్తి’లో 219వ వృత్తము.
లక్షణములు -
గణములు - ర స స గ 
యతి - 6వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


మామూలుగా పాదమునకు 10 అక్షరములు దాటిన పద్యములకే యతి నియమము చెప్పబడును.  అయినా కొన్ని వృత్తములకీ యతి పాటించు చుండుటయు కలదు


ఉదా:
శర్వసన్నుత సద్గుణ ధామా!
సర్వ భాగ్యద! శత్రువిరామా!
నిర్వికార! వినీల సుగాత్రా!
సర్వ రక్షక! సారసనేత్రా!


పాదప వృత్తమునకు దీనికి ఒక చిన్న తేడా మాత్రమే కలదు.  అది మీరు గమనించ గలరు.  స్వస్తి!
పండిత నేమాని సన్యాసి రావు
               

8 కామెంట్‌లు:

 1. నీలికన్నుల నీడలలోనే
  వాలుచూపుల పానుపుపైనే
  తేలిపోవుచు, తీయని రాగ
  మాలపించె, మదీయ మనమ్మే.

  గురువు గారు, ఈ పదాలతో పాత పాట ఏదో ఉన్నట్టుంది కదండీ!

  పాదప వృత్తము = భభభ గగ
  మణిరంగము = రససగ
  మొదటి గురువు తర్వాత ఒక లఘువు వుంచిన, మణిరంగమును పాదపముగా మార్చవచ్చును.
  నీలపు కన్నుల నీడలలోనే

  రిప్లయితొలగించండి
 2. అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! బాగున్నది ఈ విశ్లేషణ. అభినందనలు. 4వ పాదములో యతి వేయలేదు. ఇలా మార్చుదాము.
  "మాలపించె మదాత్మ సుమమ్మే"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. అయ్యో , అవునండీ.
  పవర్ పోతూ ఉండటంతో చివరి లైన్ హడావిడిగా మార్చేసే ప్రయత్నం లో యతి చూసుకోలేదు. సూచనకు ధన్యవాదములు.

  నీలికన్నుల నీడలలోనే
  వాలుచూపుల పానుపుపైనే
  తేలిపోవుచు, తీయని రాగ
  మ్మాలపించెద, నందగ రావా!

  రిప్లయితొలగించండి
 4. లక్ష్మీదేవిగారూ,
  మీరు గుర్తు చేసిన పాతపాట 1964లో వచ్చిన గుడిగంటలు సినిమాలో పి.బి.శ్రీనివాస్ & పి. సుశీల గానం చేసినది.

  నీలికన్నుల నీడలలోనా
  దోరవలపుల దారులలోనా
  కరగిపోయే తరుణమాయే
  అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
  నీలికన్నుల నీడలలోనా
  దోరవలపుల దారులలోనా
  కరగిపోయే తరుణమేదో
  ఉందిలే ముందుందిలే ఉందిలే ముందుందిలే
  ....
  ....

  ఈ పాట వ్రాసింది సి.నా.రె.గారు.

  దీన్ని చూడాలీ + వినాలంటే http://raji-oldisgoldsongs.blogspot.in/2011/05/blog-post_24.html చూడండి.

  రిప్లయితొలగించండి
 5. పార్వతీపతి! పాపవిదారా!
  సర్వరక్షక! సౌఖ్యవిధాతా!
  శర్వ! ధూర్జటి! శంకర! దేవా!
  గర్వనాశక! కామిత మీవా.

  రక్షకుండవు రాజువు నీవై
  దీక్షబూనుచు దివ్యజగాలన్
  మోక్షదాయక! ముచ్చట గొల్పన్
  శిక్ష చేయగ శీఘ్రము రావా.

  కాలకంఠుడ! కాంక్షలు దీర్చన్
  ఫాలలోచన! భాగ్యములీయన్
  శూలపాణిగ శోభనమొప్పన్
  నేలపైకిక నిత్యము రావా.

  నాగభూషణ నాకికపైనన్
  యోగశక్తిని యోగ్యత నిమ్మా,
  భోగదాయక! భూజనులందున్
  వేగమీయవె విజ్ఞత నీవున్.

  రిప్లయితొలగించండి
 6. శ్యామలరావు గారు,
  నిజమే.ఈ పదాలు రాయగానే రేడియో లో విన్నట్టు గుర్తువచ్చాయి.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. నిండు పున్నమి నీడల లోనా
  పండు వెన్నెల పానుపు పైనా
  గండు కోయిల గానము వింటూ
  గుండె నిండెను కూరిమి తోనే !

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మీదేవి గారూ,
  ఆపాతమధురమైన పాటను గుర్తుకు తెచ్చిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  శ్యామలీయం గారూ,
  ధన్యవాదాలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  విజ్ఞతను ప్రసాదించమను శివుణ్ణి కోరిన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పాటలాగా శోభిల్లుతున్న మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి