12, మే 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 10

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

10

HERE is thy footstool and there rest
thy feet where live the poorest,
and lowliest, and lost.

When I try to bow to thee,
my obeisance cannot reach
down to the depth where thy feet rest
among the
poorest, and lowliest, and lost

Pride can never approach to where
thou walkest in the clothes of the
humble among the poorest,
and lowliest, and lost.

My heart can never find its way to
where thou keepest company with the
companionless among the poorest,
the lowliest, and the lost. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

*అధిప! నీచాతినీచ దీనాతిదీన
సకలధనహీన మానవ చయము నడుమ
నందరికి వెన్క, నందరిక్రింది చోట
నలరుచుండుఁ గదోయి నీ యడుగుదోయి ||

నేను నీకుఁ బ్రణామము నెరపువేళ
నద్ది నడుచక్కి నెచటనొ యాగిపోవు
నా శిరమ్మిది యెంత వినమ్రమయ్యు
నవమతుల కెల్లఁ గ్రిందఁ బొల్పారు నీదు
చరణపీఠము నందుకోఁ జాలదోయి! ||

అందరికి వెన్క, నందరి క్రిందిచోట,
సకలధనహీన మానవచయములోన
నలరుచుండుఁ గదోయి నీ యడుగుదోయి ||

సొమ్ము లెఱుఁగని దీనజనమ్ము నడుమ
సంచరించెదు పేద వేసమున నీవు
చేర నేరదు నా యహంకార మటకు ||

నేను ధనమాన సంపన్న మానవాళి
నడుమ నిను గను పేరాస విడువకుందుఁ
గాని మఱియెట్టి సహచరుల్ కానరాని
దీనజనులను వెన్నంటి తిరిగె దీవు ||

అందరికి వెన్క, నందరి క్రిందిచోట,
సకలధనహీన మానవ చయములోన
నలరుచుండుఁ గదోయి నీ యడుగుదోయి ||   

3 కామెంట్‌లు:

 1. ఒక పద్యమునకు నా అనుకరణ:

  దీనులు దుఃఖభాజనులు దిక్కును మొక్కును లేనివారు కా
  సేనియు లేనివారు నివసించెడు తావున వారి వెంక నెం
  తేనియు ప్రేమతో నలరు దేవ భవత్పద పీఠి యయ్యు నా
  మానసమందు నే వెదుక మాన నొనర్తు నిరీక్షణల్ సదా

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారూ,
  వృత్తంలో మీ అనుసరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.
  ‘వెన్క’ టైపాటు వల్ల ‘వెంక’ అయినట్టుంది.

  రిప్లయితొలగించండి
 3. అయ్యా! నమస్సులు.
  ఈ లేఖిని లిపిలో టైపింగులో కొన్ని లోపాలు తప్పుట లేదు. నా ప్రయత్నము చేస్తున్నా కొన్ని కొన్ని లోపాలు అలాగే ఉంటాయి. నేనేమీ చేయలేకున్నాను. అది లిపిలో సదుపాయము లేకపోవుటే కాని నా ప్రయత్నము లేకపోవుట మాత్రము కాదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి