22, మే 2012, మంగళవారం

ప్రత్యేక వృత్తము - 10

వనమయూరము -
దీనినే కొందరు లాక్షణికులు ‘ఇందువదన’ అన్నారు. 
ఇది 14వ ఛందమైన ‘శక్వరి’లో 2806వ వృత్తం.

లక్షణములు:
గణములు - భ జ స న గగ.
యతి - 9వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


ఉదా:
నీవె ధృతి నీవె గతి నీవె మతి రామా!
నీవె సకలంబవని నే దలచు చుందున్
పోవలదు వీడి నను పోవలదు తండ్రీ!
పోవలదు రామ! గుణ భూషణ! యటంచున్


ఈ లయతో చక్కని జోల పాటలు వ్రాస్తే బాగుగ నుంటాయి.  స్వస్తి!


పండిత రామజోగి సన్యాసి రావు

20 కామెంట్‌లు:

  1. రార, కమలాహృదయరంజనకళాఢ్యా!
    రార, సకలాఘహరరమ్యశుభనామా!
    రార, సుజనావన! పరాత్పర! ముకుందా!
    రార, నిను వేడితిని, రక్షింపుమయ్యా!

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారు మంచి స్ఫూర్తితో ప్రయత్నము చేసేరు. 4వ పాదమును చూసి సరిచేసికొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. నేమాని వారూ,
    ధన్యవాదాలు. సవరించిన పద్యం.....

    రార, కమలాహృదయరంజనకళాఢ్యా!
    రార, సకలాఘహరరమ్యశుభనామా!
    రార, సుజనావన! పరాత్పర! ముకుందా!
    రార, నిను వేడితిని రక్ష నిడవయ్యా!

    రిప్లయితొలగించండి
  4. ఇందువదనా! త్రిభువనేశి! జగదంబా!
    కుందరదనా! త్రిదశకోటి నుత లీలా!
    మందగమనా! సకల మంగళ నిధానా!
    వందనము నీకు శివ భామిని మదంబా!

    రిప్లయితొలగించండి
  5. అయ్యా శంకరయ్య గారూ!
    నేను అదే పదాలను సూచించుదా మనుకొన్నాను. కానీ ఆ బాధ్యత మీకే వదలివేసేను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా! మీరు నో 'రార 'చెప్పిన పద్యము బాగున్నది.
    శ్రీ నేమాని వారు పల్కిన 'ఇందువదన, కుందరదన, మందగమన ... మధురవచన ' ములు బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  7. నిద్దుర సుఖమ్ముగను నిన్నువరియింపా.....
    పెద్దలిడు దీవనలు పేర్మి కలిగింపా....
    మిద్దెలును మేడలును మేల్మి గను కట్టే.....
    సుద్దులవి నాకెపుడు జోరు మదినింపా......

    జో లాలి జోలాలి జో లాలి తండ్రీ!
    చిన్నారి నవ్వులా చిట్టి మా తండ్రీ!

    రిప్లయితొలగించండి
  8. లేరె ఘనదైవములు లెక్కలకు జూడన్
    రారు దయజూపుటకు రమ్యమగు రీతిన్
    చేరి నినుగొల్చెదము సిద్ధముగ రామా!
    రార!మము గావగను రమ్యగుణధామా!

    రిప్లయితొలగించండి
  9. మంచి మనసున్న సిరి మాలకుమి దెచ్చీ....
    యెంచి సిరులన్ని మరి యింపొసగ నిచ్చీ....
    కంచి సరిగంచు వెల కాన్కలను పంచీ....
    చెంచుమహలక్ష్మి యిల చింతలను దీర్చూ....

    జో......జో....

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! శ్రీ లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    "సిరి మా లకుమి" శ్రీ మహాలక్ష్మికి వికృతి రూపము చాల బాగుగ ప్రయోగించేరు.
    లకుమి అని కన్నడ భాషలో ప్రయోగిస్తారు. లంబోదర! లకుమికర! అనే ప్రసిద్ధమైన గీతము ఉంది కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. ధన్యవాదాలండీ. మీరు చెప్పినది నిజమే.
    ఇక్కడ మంచి మనసున్న శ్రీలక్ష్మి వంటి మంచి భార్యని దేవి ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నట్టుగా వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  12. ఈ వనమయూరమన నెంత సులభంబో
    శ్రీ వెలయు రీతి విరచించి రతిప్రీతిన్
    భావ రసపుష్ఠిగల పద్యకృతులా వా
    గ్దేవి కృపనొంది శుభదీప్తు లెసగంగా

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    లక్ష్యంగా వ్రాసిన రామస్తుతి, తరువాత అందించిన అంబాస్తుతి, చివరగా వ్రాసిన వృత్తగంధి మూడూ రసగుళికల్లా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ లాలిపాటగా వ్రాసిన పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    జోలపాట కనుక పాదాంతంలో వ్యావహారిక రూపాలైన దీర్ఘాలు ఆమోదయోగ్యాలే.
    చెంచులక్ష్మిపై మీ రెండవ పద్యం చాలా బాగుంది. నాకిష్టమైన సినిమాను గుర్తుకు తెచ్చారు. నా దగ్గర ఆ చిత్రం సి.డి. ఉంది. వీలైతే ఈరాత్రికి చూడాలి!

    రిప్లయితొలగించండి
  14. జోయనుచు పాడుదును జో వరద జోజో
    ఊయెలను నెమ్మదిగ నూపుచును జోజో
    శ్రేయములు గూర్చు హరి చిద్విభవ జోజో
    హాయిమెయి పండుకొనుమా శుభద జోజో

    రిప్లయితొలగించండి
  15. నీ పద సరోజముల నీడయె భవానీ
    ఆపదల బాపి యిడు హాయిని శివానీ
    కోపమును బూనకుము క్రూరులని మాపై
    పాపలము తల్లి యెడ బాయకుము నీవై.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ మిస్సన్న గారూ!
    శివా అంటేనే పార్వతీదేవి. సంస్కృతములో శివా అనే శబ్దము చివరి దీర్ఘము తొలగగా తెలుగులో శివ అవుతుంది. అంటే శివ అనే పదము శివ పార్వతులకు ఇద్దరికీ అన్వయించును. శివానీ అనే ప్రయోగము సాధువు కాదు. మృడానీ, రుద్రాణీ, బ్రహ్మాణీ, ఇంద్రాణీ అనే పదములు సాధువులే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
    అభినందనలు.
    మీ పద్యము ముకుందుని రమ్మని వేడుకొనుచూ చాలా బాగుగ నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. నేమాని పండితార్యా మీ సూచన మేరకు సవరించిన నా పద్యం
    ధన్యవాదములతో


    నీ పద సరోజముల నీడయె భవానీ
    ఆపదల బాపి యిడు హాయిని మృడానీ
    కోపమును బూనకుము క్రూరులని మాపై
    పాపలము తల్లి యెడ బాయకుము నీవై.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారు,
    ధన్యవాదాలండీ.
    చెంచులక్ష్మి చూశారా మరి?

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారూ,
    మీ ‘జోల’ పాట రూపంలో ఉన్న పద్యం రమణీయంగా ఉంది. అభినందనలు.
    ‘శివాని’ శబ్దం సాధుప్రయోగం కాదన్నారు. శివుడు శబ్దానికి ‘సాధువుల హృదయమున శయనించువాడు, మంగళప్రదుడు’ అనే వ్యుత్పత్త్యర్థాలున్నాయి. ఆవిధంగా శివ శబ్దానికి సాధువుల హృదయమున శయనించునది, మంగళప్రద’ అని అర్థం చేసికొన వచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ‘శివాని’ శబ్దానికి శివుని భార్య, పార్వతి అని అర్థాలిచ్చింది. పర్యాయపద నిఘంటువులో పార్వతికి శివ, శివాని రెండు పదాలూ ఇచ్చింది.
    *
    లక్ష్మీదేవి గారూ,
    అస్వస్థత కారణంగా చూడలేదండి. అందువల్లనే ఈనాటి పోస్టింగులూ ఆలస్యమయ్యాయి.

    రిప్లయితొలగించండి