12, మే 2012, శనివారం

పద్య రచన - 20


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. రామ యీనాతి గౌతమురామ వినుము
    సుర విభుని దుష్ట చేష్టకు స్రుక్కు చుండి
    యుగములుగ ధూళిలో బడి యున్న దీమె
    యాశ్ర మంబున నీరాక కాశ పడుచు.

    పతిత కాదీమె నీదగు పావనాంఘ్రి
    రజము తలదాల్చి నాతియై రహి వహించె
    పతిత పావన నామ సన్నుతులు గొనుము
    సాధ్వి పతిజేర సెలవిమ్ము సంతసముగ.

    రిప్లయితొలగించండి
  2. అమరేంద్ర వశయై యహల్య శాపమునొంది
    పడియుండి యొక రాతిబండ వోలె
    పరితాపమొందుచు వందల వేలేండ్లు
    తపము చేయుచు నామె ధన్య యయ్యె
    శ్రీరామచంద్రుని చేత శాపము బాసి
    యా సాధ్వి సమ్ముదితాత్మ యగుచు
    ప్రార్థించి శ్రీరాము పాదపూజలు చేసి
    యతిభక్తి తోడ ప్రస్తుతి నొనర్చి
    భగవదాశీర్వచనముల బడసి నంత
    భర్తృ సమ్మోదమును బొంది స్వాంతమలర
    శాంతి సౌఖ్యమ్ములొంది నిరంతరమ్ము
    చెలగె నాదృతి నాదర్శ జీవితమున

    జయము జయము రామా! సర్వలోకాభిరామా!
    జయము జయము శ్యామా! శాశ్వతానందధామా!
    జయము జయము శౌరీ! సాధు చేతో విహారీ!
    జయము జయము నేతా! సర్వ సౌఖ్యప్రదాతా!

    రిప్లయితొలగించండి
  3. I can't write Telugu because I am not a poet.
    I can read Telugu because I am telugu

    రిప్లయితొలగించండి
  4. రామ పాదము దగిలిన రాయి మారె
    సాధ్వి గౌతము భార్యగ ,సచ్చరిత్ర
    యాయ హల్య రా ముపదము పైబ డియ నె
    మోక్ష మీ యుము రామయ్య ! మోక రింతు .

    రిప్లయితొలగించండి
  5. సీ.
    గౌతమార్యునిపత్ని యీతన్వి శ్రీరామ!
    జంభారి కల్మష చర్యవలన
    భర్తృశాపము నంది పాషాణరూపాన
    జవసత్వములు పోయి చట్టుబడియె
    నీపాదధూళిచే నిజరూపమును దాల్చి
    అవనతయై యున్న దంజలించి
    మగువగా రాతిని మార్చిన నీకీర్తి
    జగతిలో వెలుగొందు శాశ్వతముగ
    ఆ.వె.
    అనుచు మౌనివర్యు డాయహల్యను జూపి
    రామచంద్రుతోడ రమ్యముగను
    పలికి యామె గాంచి కలకంఠి శుభములు
    గల్గుగాత! యనియె గాధిసుతుడు.
    కం.
    శ్యామా! పరమదయాగుణ
    ధామా! రఘువంశసోమ! దశరథరామా!
    మా మా సన్నుతులందుచు
    కామితముల దీర్చి మమ్ము కాపాడుమయా!

    రిప్లయితొలగించండి
  6. శిలరూపంబున వేచియుంటిని భవత్చిద్రూపపాదంబు నా
    తలపై మ్రోయగ పాపముల్ విడివడెన్ ధన్యాత్మురాలైతి, భ
    క్తులకైంకర్యములందగా దివిజలోకుండైన సర్వాత్ము, భూ
    తలమున్ వచ్చిన నీకు మ్రొక్కెదను నిత్యంబున్ విలోకింపుమా.

    రిప్లయితొలగించండి
  7. ఇంద్ర సందిట కులికిన బంధ కనుచు
    కఱకు దూషణ లాడిన గౌత ముండు
    శిలవు కమ్మని కోపించి శాప మిడగ
    నీదు పాదము సోకగ నెలత యయ్యె !

    రిప్లయితొలగించండి
  8. రాతిని నాతి జేసితివి రాఘవ యీమె యహల్య పత్నియౌ
    గౌతమ సంయమీంద్రునకు కాల గతమ్మున శాపఘాతయై
    చేతము వ్రయ్యలై యిటు లచేతన రూపము నొందె నేటికిన్
    ఖ్యాతి గడించితీవు పతితావన మూర్తిగ ధన్యులెల్లరున్.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మనోజ్ఞమైన పద్యాలు వ్రాసి మనోల్లాసాన్ని కల్గించారు. ముఖ్యంగా అంత్యానుప్రాసతో మీ మాలినీవృత్తం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    అజ్ఞాత గారూ,
    సంతోషం! ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. దానికి నా సవరణ...
    ‘యా యహల్య రాముపదము లంది యనెను’
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ కందం ఆనందాన్ని కల్గించింది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయతం ప్రశంసార్హం.
    1,3 పాదాల్లో యతి తప్పింది. కొన్ని భాషాదోషాలూ ఉన్నాయి. మీ పద్యానికి నా సవరణ....
    ఇంద్రు సందిట కులికిన దీమె యనుచు
    కఱకు మాటల నాడిన గౌత ముండు
    శిలవు కమ్మని శపియింప శివకరమగు
    నీదు పాదము సోకగ నెలత యయ్యె !

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    మీ లేటెస్ట్ పద్యం నిజంగా సర్వోత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతిశాస్త్రిఆదివారం, మే 13, 2012 12:12:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    గురువుగారూ పద్యరచన కొరకు మీరు బ్లాగులో పెడుతున్న చిత్రాలు చాలావరకు కొంత బాగము మాత్రమే కనబడుతున్నది. నా ఇంటర్నెట్ స్లో అయినందువలన అలా కనబడుతున్నదనుకుంటాను. నేటి చిత్రం అహల్యా మాతకు సంబంధించునదని మిత్రుల పద్యముల ద్వారా తెలిసినది. నా చిన్న ప్రయత్నమును పరిశీలించ ప్రార్థన(చిత్రమును పూర్తిగా చూడలేదు. కనుక తప్పులను మన్నింప మనవి.

    సన్ముని పత్నినై మిగుల చంచలనైతిని దేవనాథుడే
    మన్మథ బాణముల్ విడువ మానసమందున క్షోభనొందితిన్
    చిన్మయ రూపుడౌ సుగుణశీలుని పాదము సోకె నిప్పుడీ
    జన్మము ధన్యమయ్యె కద శ్యామల మూర్తికి నంజలించెదన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పట్టుదలకు జోహార్లు. చిత్రం పూర్తిగా కనిపించకున్నా కచ్చితంగా దానికి సరిపోయే పద్యాన్ని వ్రాసారు. ఇది పద్యరచన పట్లు మీ ఆసక్తిని, ఉత్సాహాన్ని తెలియజేసున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతి శాస్త్రి గారూ నేను ఎపిక్ బ్రౌజర్ ఎక్కువగా వాడుతాను. ఒక్కొక్కసారి మీరన్నట్లు కొన్ని బొమ్మలు కనపడటం లేదు. అప్పుడు ఎక్స్ ప్లోరర్ లోకి వెళ్లి బొమ్మను చూస్తూంటాను.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిఆదివారం, మే 13, 2012 7:51:00 PM

    మిస్సన్నగారికి నమస్సులు. మీరుచెప్పినట్లుగా ఎక్స్ ప్లోరర్ లో పిక్చర్ పూర్తిగా కనబడుతున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిఆదివారం, మే 13, 2012 8:06:00 PM

    గురువుగారూ నమస్సులు. ఇటీవల ఏకాగ్రత కుదరక సరిగా వ్రాయలేక పోతున్నాను. మీ ఆశీస్సులు నాలో రచనా శక్తిని కలిగిస్తున్నది. చాలా చాలా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి