30, మే 2012, బుధవారం

సమస్యాపూరణం - 720 (డండడ డడ డండ)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

డండడ డడ డండ డండ డండడ డండమ్
 

ఈ సమస్యను సూచించిన
నా బాల్య మిత్రుడు తాటికొండ ఓంకార్‌కు
ధన్యవాదాలు

26 కామెంట్‌లు:

  1. మెండుగ భుజించి యొక కపి
    దండిగ ముదమొంది మ్రోసె తగ నొక డోలున్
    పండుగయగు వినుడీ యని
    డండడ డడ డండ డండ డండడ డండం

    రిప్లయితొలగించండి
  2. రండో ! ఈశుని పెండ్లికి
    పండుగ యిది పార్వతమ్మ పరిణయమాడన్
    దండములిడి ధన్యులవరె
    డండడ డడ డండ డండ డండడ డండం

    రిప్లయితొలగించండి
  3. దండిగ ధనములు మెక్కిన
    గండము చేకూర గలదు కాపురుషులకున్
    దండన కోర్తురె తులువలు !!
    డండడ డడ డండ డండ డండడ డండం !!!

    రిప్లయితొలగించండి
  4. దండంబులు నమ్రతతో
    జెండా కొనరించ వలయు చేరుడు ఛాత్రుల్
    మెండుగ డోలది మ్రోగెడు
    డండడ డడ డండ డండ డండడ డండమ్.

    రిప్లయితొలగించండి
  5. అండగ కొమరుని వడుగున
    దండోరా వేయ ఢక్క తాళమ్ములతో
    నిండుగ మ్రోగించితి నిటు
    డండడ డడ డండ డండ డండడ డండమ్

    రిప్లయితొలగించండి
  6. దండమయా శివ శంకర
    దండమయా సాంబ నీకు దండము శంభో
    దండములు మీకు నెపుడును
    డం డ డ డ డ డండ డం డ డం డ డ డం డం

    రిప్లయితొలగించండి
  7. ఇది నేను చేసుకున్న సమస్య, ఈ సమస్యను ఒకప్పుడు నేను ఈ బ్లాగుకు పంపినట్లుగా గుర్తు. చాలామంది మిత్రులు పూరించేరుకూడా.
    నా పూరణలో డమరము అనే పదమును డమరువు గా పెద్దలు సవరించినట్లుకూడా గుర్తు

    పండగ పదినాళ్ళుండగ
    బండెడుగా తెచ్చుకున్న బాణాసంచా
    నెండేయగ నగ్గితగిలి
    డం...............

    గండరగండడు సాంబుడు
    ఛండంబౌ తాండవంబు సలుపగ గిరిపై
    మెండుగ మ్రోగెను డమరువు
    డం .......................

    బహుశా మరి శ్రీ ఓంకార్ గారికి కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుందా????!!!!

    రిప్లయితొలగించండి
  8. కామేశ్వర శర్మ గారూ,
    నిజమే! నిన్న మా మిత్రుడు చెప్పినప్పుడు దీనిని ఇంతకు ముందు విన్నట్టుగానే అనిపించింది. బ్లాగులో వెనక్కి వెళ్ళి వెతికే ఓపిక లేకపోయింది. అందువల్ల ఆ పొరపాటు జరిగింది. మన్నించండి!
    నిజానికి మా మిత్రుడు చెప్పింది ఉత్పలమాల పాదం..‘డాండడ డాండ డాండ డడ డాండడ డాండడ డాండ డండడమ్’ దానిని నేనే కందంలో చెప్పాను.

    రిప్లయితొలగించండి
  9. పెద్దలకు ప్రణామం!

    ఈ నాటి సమస్య “డండడడడ డండడండ డమ్మని మ్రోఁగెన్” అన్నట్లుగా –

    1. వాక్యసమాపకమైన క్రియాపదం ఒకటి చివఱను లేనందువల్ల,
    2. పద్యం తుదను “డండమ్” అని ద్రుతేతర హలంతంగా ఉండటం వల్ల –

    ఆంధ్రభాషాలక్షణవిరుద్ధంగా, సరికొత్తగా ఉంది. సంస్కృతంలో అన్వయం సాధ్యపడుతుంది కాని, తెలుగులో సాధ్యం కాదు.

    కేవలం ఒకే తీరు ధ్వన్యనుకరణసందర్భంగా తప్ప వేఱొక విధంగా పూరించటానికి వీలులేకుండా ఉన్నది.

    అందువల్ల, వైవిధ్యం కోసం ఏకాక్షరిగా పూర్తిచేశాను. సమాపకక్రియ లేని అసంతృప్తి ఉండనే ఉన్నది.

    డండడ డేడిడ డైడా
    డండా డోడౌడ డాడడాడా డాడై
    డండూడిడౌడడడడా
    డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!

    డం=డమరుకము యొక్క, డ=శివంకరమైన నాదమునందు; డ=ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా;
    డే=దాంపత్యధర్మమును అనుసరించి, డి=గౌరీదేవిని, డ=మేని సగభాగమున తాల్చిన దేవా;
    డై=వృషభము, డా=విజయధ్వజముగా కలవాఁడా;
    డం=తృతీయనేత్రమందు, డా=అగ్నిని తాల్చిన విభూ;
    డో=దుష్టుల, డౌ=సంహారమునందు, డ=రక్తివహించిన ప్రభూ;
    డా=శ్రీదేవిని, డ=వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే, డా=జయోక్తులతో, డా=సన్నుతింపబడిన దేవా;
    డా=వెన్నెల వంటి, డై=నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి, డం=పాల వంటి, డూ=ఆదిశేషుని వంటి, డి=గౌరీదేవి వంటి, డౌ=కామధేనువు వంటి, డ=శంఖము వంటి, డ=చంద్రుని వంటి, డ=అమృతము వంటి, డా=తెల్లని దరహాసము గల ఱేఁడా;
    డం=గాయనుల యొక్క, డ=స్తోత్రములచే, డ=ప్రసన్నుఁడ వగు, డ=సర్వేశ్వరుఁడవైన, డ=పరమేశ్వరా;
    డం=దుర్మతులకు, డ=త్రాసమును కలిగించు, డం= డమరువు యొక్క, డ=భీషణమైన ధ్వని కలవాఁడా;

    డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం.

    విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.

    ఈ చిత్రపూరణసదవకాశాన్ని కల్పించిన పెద్దలకు మీకు ధన్యవాదాలు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. చండీప్రియ పతితోడన్
    బండిని చనుచుండ జాఱి పడెనయ్యయ్యో!
    కుండలు దొరలెను గనుడీ,
    డండడ డడ డండ డండ డండడ డండమ్

    ఎండలు మండుచునుండగ
    మొండిగ చేయకు; పనులవి ముగియుట లేదే!
    గుండెలదురుచుండెనుగా
    డండడ డడ డండ డండ డండడ డండమ్

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! డా. మురళీధర రావు గారు! శుభాశీస్సులు. మీరు ఏకాక్షర పద్యమును బాగుగా వ్రాసేరు. ఇవి ఎందరకి అర్థమగును? మీ ప్రయత్నము ప్రశంసార్హము.

    సమస్య కాబట్టి వాక్యము అర్థవంతముగా ఉందా లేదా అనే ప్రశ్న రాదు. సమస్య సమస్యే. దానిని నింపేటప్పుడు ఆ దోషమును నిర్మూలించి అర్థవంతముగా చేయవలసిన బాధ్యత పూరించే వారిది. భోజరాజు ఇటువంటి సమస్యలు ఇచ్చినట్లు విన్నాను.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పూరణ....

    దుండగుఁ డొక కుమ్మరి యిలు
    దండిగఁ జొరబడియుఁ దాను దాగియు గదిలో
    కుండలు కూలఁగ దొరికెను
    డండం డడ డండ డండ డండడ డండమ్.

    రిప్లయితొలగించండి
  13. డకారము తో ఏకాక్షర కందము వ్రాసిన శ్రీ మురళీధర రావు గారి సంస్కృత పాండిత్యమునకు నమోవాకములు.

    దండమయా నా వోటరు!
    దండలనే నీకు వేతు దయ జూపయ్యా!
    దండిగ డప్పును గొట్టెద
    డండడ డడ డండ డండ డండడ డండమ్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురువులకు ప్రణామం!

    మీ శుభాశీస్సులకు ధన్యవాదాలు.

    కాళిదాసు పూరించినదని చెప్పబడే శ్లోకం ఇది:

    "రాజ్యాభిషేకే మదవిహ్వలాయాః
    హస్తచ్యుతో హేమఘటో యువత్యాః
    సోపానమార్గేషు కరోతి శబ్దం
    టంటంట టంటంట టటంట టంటమ్.”

    అని. సంస్కృతంలో పై శ్లోకంలో లాగా "కరోతి శబ్దం" అని ఆ మాత్రపు ధ్వన్యనుకరణనైమిత్తికత లేకుండానే ఇటువంటివి పరశ్శతంగా ఉన్నాయి. ఆ భాషలో సాధ్యం కనుక. ప్రాకృతంలోనూ సాధ్యమే.

    ఎటువంటి సమస్యకైనా పూరణ చేసిన తర్వాత - పద్యాన్ని అన్వయింపవలసిన బాధ్యత – మీరన్నట్లు పూరయితదే. ఈనాడు చేయబడిన పూరణలలో ఏ ఒక్కదానికైనా ప్రత్యక్షరం టీకా-తాత్పర్యాలను వ్రాసి చూసుకొంటే – అటువంటి అర్థాన్వయం సాధ్యం కాదని; అసలు సమస్యలోనే లక్షణయుక్తంగా పూరించేందుకు అవకాశం లేదని స్పష్టపడుతుంది.

    1. వాక్యంలో ఏదో ఒకచోట సమాపకక్రియ ఉండితీరాలి. ఆ సమాపకక్రియకు పై ధ్వన్యనుకరణ వంటి వాటితో తత్పూర్వోత్తరాలలో ఆకాంక్ష, అభిహితాన్వయం ఉండితీరాలి.
    2. “అను”కరణవిరహితంగా వాక్యనిర్మాణం తెలుగులో సాధ్యం కాదు. చూ. బాలవ్యాకరణం: సంధి. సూ. 50-54లు; వాటిపై దువ్వూరి వారి “రమణీయ” వ్యాఖ్య.
    3. “డమ్మని మ్రోగెన్”; “డమ్మని మొఱసెన్” అని పద్యాన్ని ముగింపవచ్చును. “మ్రోగెను డం డమ్” అని ఉండదు. అందుకు కవిప్రయోగాలు దొరకవు.
    4. “కులకము” అనే విశిష్టమైన ప్రయోగంలో ఎంతో అరుదుగానే తప్ప - ద్రుతేతరమైన హలంతశబ్దంతో తెలుగు పద్యం ముగింపు – అది ధ్వన్యనుకరణమైనా – ఉండదు. ఈ పద్యంలో కులకమెలా ఉంటుంది? అదీ సాధ్యం కాదు.

    ధ్వన్యనుకరణం కాక వేఱొక అవకాశం లేనందువల్లనే నేను ఏకాక్షరిని ఆశ్రయింపవలసి వచ్చిందని వ్రాశాను. భావం బోధపడదేమో అని అర్థాలు వ్రాశాను. లేని పాండిత్యపు ప్రకర్షకోసం కాదు.

    కవి వాక్యానికి ఏ విధంగానైనా స్థితగతిచింతన చేయాలనే నా మతం. తప్పుపట్టడం ఎన్నడూ కాదు. ఇంతకు మునుపటి ప్రస్తావాలలో అనేకపర్యాయాలు మీరు చూచే ఉంటారు.

    మీ వ్యాసంగానికి అడ్డురావటం సరికాదని - ఇంతకంటె ఎక్కువ వ్రాయను: అభిప్రాయభేదం లేనిపోని అపార్థాలకు తావిస్తుంది కనుక.

    పెద్దలు మన్నించాలి!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. డా.ఏల్చూరి వారికి శుభాశీస్సులు.
    మీ వినయ పూర్వకమైన వివరణ నన్ను ముగ్ధుణ్ణి చేసింది. క్లిష్టమైన సమస్యలకు మీరు పూర్వము సమస్యస్ఫూర్తితో చేసిన పూరణలనన్నీ నేను చూచేను. మీ పాండిత్య ప్రకర్షకి ఏ మాత్రము లోటులేదు. ఇది నిర్వివాదాంశము.

    ఇక మన బ్లాగులో ఎక్కువమంది సభ్యులు వాఙ్మయములో ఎంతో లోతుల లోకి వెళ్ళ గలిగిన వారు కారు. సామాన్యమైన సరళిలో రచనలను సాగించగలరు. అందుచేత ఆ స్థాయిలోనే సమస్యలను కాని ఇతర ప్రక్రియలను ఇచ్చుట కాని పూరించుట కాని జరుగుచున్నది. అందుచేత కొన్ని కొన్ని సందర్భములలో ఉదాసీనత ప్రదర్శించుటే మేలు కదా. ఆలాగునే చేయుదము గాక! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమః
    గురువుగారి మూత్రనాళాన అడ్డుపడిన రాళ్ళను ఆ పరమశివుని గాఢపు చూపులు మరియు ఢమరుక నాదరవళి ఖండించగ ప్రార్థిస్తూ :

    దండమయా శివ! మ్రొక్కెద
    ఖండించగ నాళ రాళ్ళు గాఢపుదృక్కుల్,
    డంఢమరుకనాదరవళి
    డండడ డడడం డడండ డండడ డండమ్!

    రిప్లయితొలగించండి
  17. జెండా వెలుగుల గన రా
    రండని దండోరవేసెరంగడు,విన భూ
    మండలమంతయు దండిగ
    డండడ డడడం డడండ డండడ డండమ్!

    రిప్లయితొలగించండి
  18. కరమరుదైన శాబ్దిక వికాస విలాసము ; నూత్న భావ వి
    స్ఫురణము ; మేల్కవిత్వ రసపూరిత వాగ్విభవమ్ము గంటి - ని
    ర్భర కరుణాంతరంగమున వాణి సదా మిమునోము గాక ! యే
    ల్చురి మురళీధరా ! విబుధ లోక ప్రకీర్తిత సత్కవీశ్వరా !!!

    డా. ఏల్చూరి మురళీధరరావు గారి ప్రతిభా వ్యుత్పత్తులు అసామాన్యాలు . వారికి ప్రత్యేక అభినందనలు , అభివాదములు . ఈనాటి సమస్య లోని హలంతం గురించి, సంస్కృత భాషా సహజమైన ధ్వన్యనుకరణోద్దిష్ట సమస్యా సంఘటనము గురించి వీరి వివరణ సాధికారకమైనది !

    రిప్లయితొలగించండి
  19. అద్భుత పూరణలు, సప్రమాణ వివరణలు, స్నేహపూరిత చర్చలు నాకెంతో ఆనందాన్ని, తృప్తిని (కొద్దిగా గర్వాన్ని కూడా) ఇచ్చాయి. కాని ఆ ఆనందంలో లీనం కాకుండా, నా స్పందనను తెలిపే అవకాశం ఇవ్వకుండా రాయి వలన భరింపరాని నొప్పి అడ్డుకుంటున్నది.(అది మూత్రపిండంలో కాదు మూత్రనాళంలో చిక్కుకున్నదట)వీలైతే రేపు ఉదయం నా స్పందనని తెలియజేస్తాను. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  20. శ్రీ పండిత నేమాని గురుదేవులకు; శ్రీ విద్వద్గోలి హనుమచ్ఛాస్త్రి కవివరేణ్యులకు; సౌజన్యనిధి, సత్కవయితృపంక్తిపావనులు మాన్యశ్రీ డా. విష్ణు నందన్ గారికి, మిత్రులందరికి, అలఘుశరీరాయాసాన్ని సైతం గోష్ఠీవినోదంకరణార్థం లఘూకరించి సరస్వతీచరణనిర్విరామసేవాహేవాకతత్పరులైన శ్రీ కంది శంకరయ్య గారికి,

    జ్యోతిర్మయ మగు శబ్ద
    శ్వేతారణ్యమున దారి వేఁడెడు నను సం
    గాతిగ నెద కత్తుకొనెడి
    ప్రాతర్వంద్యులకు మీకుఁ బ్రణతిశతమ్ముల్.

    పరిణతవిద్యావిభవులు
    సరస్వతీసుద్ధ్యుపాస్యసారస్వతవా
    గ్వరణీయులు మీ కరుణా
    వరణంబు కలిమిని వెలుఁగుబాటల నడతున్.

    మీ సాదరవాక్యావళికి నిండైన కృతజ్ఞతతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  21. శ్రీయుతులు ఏల్చూరి మురళీధరరావుగారికి,
    ఆర్యా!
    నమస్కారములు.
    మీ ఏకాక్షర కందం అత్యద్భుతంగా ఉంది. ఒక్క "డ"కారానికి ఎన్నో అర్థాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. మాన్యశ్రీ హరి వేంకట సత్యనారాయణమూర్తి గారికి
    ప్రాతర్వందనం!

    ఆర్యా! “పరగుణపరమాణూన్ పర్వతీకృత్య” అనిపించే మీ ఔదార్యానికి, నిండైన దీవెనకు ధన్యవాదాలు.

    విజయవాడలో “భారతీనిరుక్తి” మహాగ్రంథాన్ని నిర్మించిన పుంభావసరస్వతులు హరి సోదరులు మీ కేమవుతారో తెలియదు.

    “హరి”వంశాన్ని స్మరింపగానే నాకు నలభయేండ్ల క్రితపు వారి దర్శనభాగ్యం గుర్తుకు వచ్చి, ఇప్పటికీ నిలువెల్లా నారుపోసినట్లు గగుర్పొడుస్తుంటుంది!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. శ్రీయుత ఏల్చూరీ తమ
    ధీయుత పాండిత్య గరిమ తెలిసెను సుకవీ
    వేయి ప్రణుతులు గొనుడీ
    శ్రేయంబిడు వాణి మీకు చిర కాలమ్మున్.

    రిప్లయితొలగించండి
  24. మెండుగ డమరులు మ్రోగుచు
    మొండిగ మోడీని మోడి మోడీ యనగన్
    గుండెలు మండెను సోనియ:
    "డండడ డడ డండ డండ డండడ డండమ్"

    రిప్లయితొలగించండి