21, మే 2012, సోమవారం

ప్రత్యేక వృత్తములు - 9

భుజంగప్రయాతము.

ఇది 12 వ ఛందమైన "జగతి"లో 586 వ వృత్తము.
"శివం శంకరం శంభు మీశానమీడే" అను స్తోత్రము, "వినా వేంకటేశం ననాథో ననాథః" అను స్తోత్రము మనలో చాలమందికి తెలుసును కదా.  ఈ పాదములు భుజంగప్రయాతము అనే ఛందస్సే.


లక్షణములు -
గణములు - య య య య 
యతిస్థానము - 8వ అక్షరము 
ప్రాసనియమము కలదు.


ఉదా:
మహానంద వారాశి, మాయావిలోలున్
మహర్షివ్రజ స్తూయమాన ప్రభావున్
మహీజా హృదంభోజ మార్తాండు, రామున్
మహీశాధినాథున్ క్షమాపూర్ణు గొల్తున్.


          మంచి వేగముతో నడిచేది ఈ వృత్తము.  సంస్కృత సమాసములు పడితే చాలా హాయిగా నడుస్తుంది.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు 

14 కామెంట్‌లు:

  1. భవానీపతీ! నీ శుభాశీస్సు లున్నన్,
    నివారింపమా ఘోరనేరమ్ములీశా!
    శివా!శంకరా! సర్వసిద్ధిప్రదాతా!
    భవా!నిర్వికారా! కృపన్ జూపరావా!

    రిప్లయితొలగించండి
  2. పరాకేలనయ్యా! కృపాపూర్ణ! దేవా!
    వరాలిచ్చి మమ్మింక పాలించవయ్యా!
    పరంధామ! శ్రీరామ!భాగ్యాబ్ధి వంచున్
    నిరూపించవయ్యా! మునీంద్రైకగమ్యా!

    రిప్లయితొలగించండి
  3. శరీరంబు వెల్గొందు సత్వంబు హెచ్చున్
    వరీయత్వభాగ్యంబు, వైదుష్య మబ్బున్
    చిరానందసౌఖ్యంబు సిద్ధించు మీదన్
    మురారిన్ భజింపంగ మోక్షంబు గల్గున్.

    రిప్లయితొలగించండి
  4. హవమ్మందు వ్రేల్చే హవిస్సై జగమ్మే
    దివమ్మందు కాలంగ దేవా! దినేశా!
    రవీ! చాలు చాలయ్య ! రక్షించుమింకన్.
    తవాంఘ్రీయుగమ్మున్ సదా నమ్ము వారన్.

    రిప్లయితొలగించండి
  5. అమ్మా శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీ పద్యాలు బాగున్నవి. "తవాంఘ్రీ యుగమ్మున్" అన్నారు కదా. తవాంఘ్రి ద్వయమ్మున్" అని సవరించండి. బాగుంటుంది. శుభాభినందనలు.

    అయ్యా శ్రీ హరి వారూ బాగున్నవి మీ పద్యాలు. శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రమాకాంత! గోవింద! రాజీవనేత్రా!
    క్షమాపూర్ణ!దైత్యారి!శ్యామాభ్రవర్ణా!
    ఉమేశాదిముఖ్యామరోద్ధారధుర్యా!
    నమస్సర్వలోకైకనాథా!నమస్తే.

    రిప్లయితొలగించండి
  7. మహారాఙ్ఞి! మాతా! ఉమాదేవి! గౌరీ!
    మహాపద్మపీఠా! కుమారీ! భవానీ
    మహాదేవపత్నీ! రమావాణిసేవ్యా!
    మహాయోగిపూజ్యా! నమస్తే! నమస్తే!

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం మొదటి పాదంలో యతి తప్పింది.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ముచ్చటైన మీ మూడు పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    మనోజ్ఞమైన పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా!
    మీ మీ సూచనల ప్రకారము సవరించిన పద్యము.

    హవమ్మందు వ్రేల్చేటి హవ్యమ్ము వోలెన్
    భువీనాడు వేగెన్ ప్రభో! దివ్యతేజా!
    రవీ! చాలు చాలయ్య ! రక్షించుమింకన్.
    తవాంఘ్రిద్వయమ్మున్ సదా నమ్మువారన్.

    అనేక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. మారెళ్ళ వామన కుమార్మంగళవారం, మే 22, 2012 12:28:00 AM

    భవేద్రామ జోగీశ,వాగీశ మిత్రం,
    భవేద్సత్యమూర్తిం,సుభాష్యం,సుమిత్రం,
    భవేద్శంకరాఖ్యం,భవేద్దేవి లక్ష్మిం,
    నవీనఖ్య బంధుం,భవేద్సాధు సాధుం.

    రిప్లయితొలగించండి
  12. వామన కుమార్ గారూ,
    చక్కని శ్లోకం చెప్పారు. అభినందనలు.
    ప్రాస, మొదటి రెండు పాదాల్లో యతిని పాటించారు. కాని చివరి రెండు పాదాల్లో యతిని వదలివేసారు. శ్లోకం కదా అది దోషం కాదు. సంధిగత దోషాలు కొన్ని ఉన్నాయి.

    రిప్లయితొలగించండి