15, మే 2012, మంగళవారం

ప్రత్యేక వృత్తాలు - 3

పాదపము -
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’ లో 439వ వృత్తము.
(దీనిని అనంతుడు ‘తోదక’మని, అప్పకవి ‘దోధక’మని పేర్కొన్నారు)
గణములు: భ భ భ గగ
యతి  :  7వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
శ్రీరఘునందన! చిన్మయ! రామా!
మారుతి సేవిత! మంగళధామా!
వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
క్ష్మారమణా! పర గర్వ విరామా!


చూచేరా ఎంత సరళమైన గమనముతో ఉందో ఈ పద్యము. స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

9 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    క్రమం తప్పకుండా నేను రోజుకొక చిత్రాన్ని (గూగులమ్మ దయతో) ఇవ్వడం, దానిని పరిశీలించి పద్యాన్నో, పద్యాలనో వ్రాయమని కోరడం అందరూ (లబ్ధప్రతిష్ఠులతో సహా) ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతున్నది. ఔత్సాహికులకు ఇది పద్యరచనాభ్యాసానికి తోడ్పడుతున్నది. అందరికీ ధన్యవాదాలు.
    శ్రీ నేమాని వారు ‘ప్రత్యేక వృత్తాలు’ శీర్షికను ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మన కవులు అప్పుడప్పుడు అవసరం, అవకాశం ఉన్నప్పుడో లేక అశ్వాంసాంత పద్యాలుగానో కొన్ని విశేషచ్ఛందాలలో పద్యాలు వ్రాస్తూ వచ్చారు. అటువంటి పద్యాలను పరిచయం చేస్తున్నారు శ్రీ నేమాని వారు.
    కవి మిత్రులు ఆయా ఛందాలలో ఇష్ట దేవతా స్తుతి కాని, నచ్చిన ఏదైన అంశంపై కాని పద్యాలు వ్రాసి తమ రచనా నైపుణ్యాన్ని మెరుగు పరచుకొన వలసిందిగా మనవి.
    అందువల్ల ఈ ‘పద్య రచన’ శీర్షికకు కొంతకాలం విశ్రాంతి!

    రిప్లయితొలగించండి
  2. దేవిని గొల్చితి దీవనకై నే,
    పూవుల చేసితి పూజలనెన్నో!
    పావన నైతిని, భాగ్యము లెన్నో
    జీవన మందున చేరెను నేడే!

    రిప్లయితొలగించండి
  3. మిత్రులారా!
    ఏ పద్యము యొక్క పేరును ఆ పద్యములో చేర్చుటను ముద్రాలంకారము అంటారు. ఈ పద్యములో ముద్రాలంకారమును వేయుచున్నాను - అంతేకాదు ఇందులో వర్ణింపబడినది కూడా పాదపమే (చెట్టు).

    పాదపమే మన పాలి వరంబౌ
    నాదృతితో నిడు నౌషధ రాజిన్
    మోదము నింపెడు పూవులు బండ్లున్
    మేదిని సన్మతి మేలొన గూర్చున్

    రిప్లయితొలగించండి
  4. వాతసుతా కపి వంశ విభూషా!
    సీతను జూచిన శ్రీ హనుమంతా!
    పాతక మార్పవె పావన గాత్రా!
    త్రాతవు మాకిల రాఘవ భక్తా!

    రిప్లయితొలగించండి
  5. శౌరికి మిత్రుడు శంకరుడౌనా!
    గౌరికి భర్తగు కల్లది కాదే!
    మారుని జంపిన మల్లుడు కాదా!
    దారిని జూపగ దర్శనమౌనా?

    నామది నిండిన నల్లని వాడా!
    యామిని వేళలనాశలు లేవా!
    భామను వచ్చితి పంతములేలా!
    మోమును దాచెడు ముచ్చటలేలా!

    పిల్లల సన్నిధి పెన్నిధి కాదా!
    చక్కని నవ్వుల సౌరులు, వారే
    చల్లెద రెల్లెడ చల్లని వేళా!
    కల్లలు కావివి, కల్పనలౌనా?

    పూలను దండిగ పూచిన కొమ్మా!
    మాలిక కట్టగ మక్కువటమ్మా!
    బాలను నీ కడ భక్తిగ నమ్మీ
    కేలను జాచితి క్రిందకు రమ్మా!

    రిప్లయితొలగించండి
  6. చక్కని పద్యాలు వ్రాసిన
    లక్ష్మీదేవి గారికి,
    మిస్సన్న గారికి
    ............ అభినందనలు.
    *
    ముద్రాలంకార యుక్తంగా చక్కని లక్ష్యాన్ని రచించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. నీదరి జేరితి నేనిక దేవా!
    కాదన బోకుము కౌస్తుభధారీ!
    నీదయ జూపుము నిత్యమటన్నన్
    పాదపమౌనది వాదన లేలా.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గురు బ్రహ్మము చిన్మయరూపా
    యోగి పరాత్పర యో జగధీశా
    త్యాగధనుండవు ధన్యుడవయ్యా
    సాగిలి మ్రొక్కితి సన్మతి నీ యన్!!

    రిప్లయితొలగించండి