9, మే 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 7

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

7

MY song has put off her adornments.
She has no pride of dress and decoration.
Ornaments would mar our union ;
they would come between thee and me;
their jingling would drown thy whispers.

My poet's vanity dies in shame before thy sight.
O master poet, I have sat down at thy feet.
Only let me make my life simple and straight,
like a flute of reed for thee to fill with music.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

క్రిందికిం దింపివైచె నా గీత మిద్ది
తన యలంకారములను మొత్తముగ స్వామి!
వలువలం గయిసేయు గర్వమ్ము గూడ
సడలిపోయినదోయి నీ సముఖమందు ||

తొడవు లివి నీకు నాకును నడుమఁ జేరి
నిండు కలయిక కడ్డము నిలుచు నోయి!
గలగలని మ్రోగు వాని పేరులివులోన
మరుగుపడు నోయి నీ మృదు మధురవాణి ||

సిగ్గునన్ మ్రగ్గునోయి నీ దృష్టిముందు
నా కవిత్వగర్వంబు మహాకవీంద్ర!
శరణు సొచ్చితి నీ దివ్యచరణములను ||

నీవె కావింపు మోయి నా జీవనమ్ము
సరళ సరళముగాగ నీ మురళి పోల్కి!
అమ్మురళిలోని యెల్ల రంధ్రమ్ములందు
నీదు గీతస్వరమ్ములు నింపుమోయి! ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి