కవిమిత్రులారా,
సమస్యా పూరణల సంఖ్య ఏడు వందలకు చేరింది.
సమస్యా పూరణల సంఖ్య ఏడు వందలకు చేరింది.
దీనికి మీ అందరి భాగస్వామ్యం, స్నేహం, సౌహార్దాలే ముఖ్య కారణం.
అందరికీ ఆనందంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీ సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
ఏడు వంద లనిన నెక్కు వగున?
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
ఏడు వంద లనిన నెక్కు వగున?
శ్రీ శంకరార్యులకు శుభాభినందనలు. ఒక నియమముగా మీకు సమస్య లెన్ని యెదురైనా తప్పించు కొనక మాకు సమస్యలనిచ్చి ఒక గుర్తింపును రచనాఙ్ఞానమును పెంపొందించుచున్న మీ(మా)బ్లాగు శంకరాభరణం అనే కల్పవృక్షముపై శ్రీవాణీ కృపచే మరిన్ని కవికోకిలలు చేరి తమ కవితా గానములను వినిపించు గాక.
రిప్లయితొలగించండిఇందరేసి కవులు వందలుగా పద్య
సుమము లిచ్చు చుండ చూడగాను
వేలు మించ గలవు వ్రేలెత్తి చూపక
ఏడు వంద లనిన నెక్కు వగున?
సీ.
రిప్లయితొలగించండిశంకరాభరణంబు సాహిత్యదీప్తికై
చేయుచుండెను గాదె సేవలెపుడు
దాని నిర్వాహకుల్ ధన్యులీ శంకరుల్
పూరణల్ నిత్యంబు గోరుచుండి
పద్యపాదము లెన్నొ ప్రతిరోజు ప్రకటించి
రచనలన్నింటికి రాత్రి పగలు
మార్గదర్శన చేసి మమతతో జ్ఞానంబు
పంచి పెట్టుచునుండ బహువిధాల
ఆ.వె.
పద్యరచన చేయు పద్ధతుల్ మెలకువల్
నేర్వగల్గినాము, నిత్యమిట్లె
సాగుచుండవలెను సాహితీవ్యాసంగ
మేడు వందలనిన నెక్కువగున?
శంక లేమి రావు శంకరాభరణాన
రిప్లయితొలగించండివంక బెట్టలేము వంక జూచి
పద్య రచన సాగు హృద్యమై పెడుదును
వంద మించి నట్టి వందనములు.
గురువు గారికి అభినందనలు. నా బోటి వారలు మధ్య మధ్యలో కనిపించినా నిత్యము పూరణలు చేసే మిత్రులకు పెద్దలకు ,పూజ్యనీయులు అన్నయ్య గారికి ,సోదరీ మణులకు అభినందనలు.
రిప్లయితొలగించండిఅయ్యవారి తోడ నారంభ దీక్షులై
శిష్య చయము చెప్ప శీఘ్ర గతిని
సప్తగిరి నివాసి సహకార మొసగంగ
నేడు వంద లనిన నెక్కు వగున?
ఉత్సాహ:
రిప్లయితొలగించండిశ్రీమదంబుజాసనుసతి చిల్కరింప ప్రక్రియల్
ప్రేమసుధలతో కవిత్వ రీతులొప్పు వేనవేల్
రామణీయకముగ శంకరాభరణమునన్ బళా
ఏమి యేడు వందలనిన నెక్కువగున మిత్రమా?
శ్రీ శంకరయ్య గురువుగారికి పాదాభివందనాలు.
రిప్లయితొలగించండిఈ బ్లాగు ద్వారా ఎందరో ఔత్సాహికులకు కవిత్వము మీద / పద్య రచన మీద ప్రేరణ కలిగిస్తూ ఎన్నో మెళకువలను, జ్ఞానాన్ని ప్రసాదిస్తూన్న మీకు సహస్రాధిక వందన సుమాలనర్పిస్తున్నాను.
సీతజాడనెఱుగనేతెంచిహనుమ యా
లంకకసురసేన వంకజూచి,
సంహరించదలచి సింహనాదముజేసె
నేడువందలనిన నెక్కువగున?
ఏడు వంద లనిన నెక్కు వగున మాకు ?
రిప్లయితొలగించండిఎన్ని వంద లైన నీ య దగును
పద్య రచన వలన పదు నౌను బుఱ్ఱలు
వంద నంబు మీ కు కంది తిలక !
"హాలసార్వభౌము" డలనాడు ప్రచురించు
రిప్లయితొలగించండిసప్తశతములైన సత్కథలను
చదువు వార లెంతొ సంతోషమందరే?
యేడు వందలనినఁ నెక్కువగున?
వేంక టేశుఁ జూడ వీనుల విందుగ
రిప్లయితొలగించండిఏడుకొండలనిన నెక్కువగున?
ముద్దుగా తెలుగున పూరించను సమస్య
లేడు వంద లనిన నెక్కు వగున?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసప్త స్వరపు ఝరుల సంగమ మలరించ
రిప్లయితొలగించండిసప్త పదులు నడువ జంట కుదుర
సప్త శిఖరి జేర స్వామిదర్శన మిచ్చు
శంకరాభరణపు సప్త శతులు
కవుల ఆర్తి దీర్చక నడక సాగించ
ఏడు వందలనిన ఎక్కువగున?
అయ్యా శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో 1వ పాదములో సప్త స్వరపు అన్న చోట 2వ అక్షరము ప్త తరువాత స్వ ఉన్నది కాబట్టి ప్త గురువు అగును - అందుచేత గణభంగము - కాస్త సరిచేయండి. స్వస్తి.
క్షమించాలి .ఊరికే ఒక ప్రయత్నం
రిప్లయితొలగించండిఉత్సాహ
పద్య రచన జేయుట కని పరమ ప్రీతి నొందు చున్
హృద్యమ ముగ వ్రాయ గోరి హర్ష మందు మిత్రులే
పద్య లతల నల్లు కొనుచు పరవ శమ్ము చెంద గా
పద్య మేడు వంద లనిన పెక్కు వగున సోద రా ?
ఏడు వందలనిన నేక్కువేమి మనకు
రిప్లయితొలగించండిఏడు వేలు లక్షలు యేడు కోట్లు
ఏడేడు భువనాల నేకమై విరియంగ
ఏడు వంద లనిన నెక్కు వగున ?
కవి మిత్రులకు సప్తశత వందనాలు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యా పూరణం దాదాపుగా ‘శంకరాభరణం’పై కేంద్రీకృత మయింది. నిజానికి పాదపూరణమే కాని సమస్యా పూరణం కాదు. అందరి పద్యాలు నాలో ఉత్సాహాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ పెంచాయి. తమ తమ అందమైన పద్యాలతో నన్ను ప్రోత్సహించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సత్యనారాయణ మూర్తి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
పండిత నేమాని వారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
సహదేవుడు గారికి
ధన్యవాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారు,
సత్యనారాయణ మూర్తి గారు
వైవిధ్యంగా పూరణలు చెప్పారు. వారికి అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యంలో మొదటి పాదాన్ని ఇలా సవరిద్దామా?
‘ఏడు స్వరముల ఝరు లేకమై యలరించ....’
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివేల పద్యములను విజ్ఞులు వ్రాయంగ
ఏడు వంద లనిన నెక్కు వగున?
శంకరాభరణము శాశ్వతమై నిల్చు
కంది శంకరార్య వందనములు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఆర్యా,
తమరి సలలిత సవరణ సమ్మతమే.
ధన్యవాదములు
కంది శంకరయ్య గారికి, *****నా వ్యాఖ్యలోని మొదటి భాగం*****
రిప్లయితొలగించండిఅయ్యా నమస్తే, అనుకోకుండా ఈనాడు సమస్యాపూరణం చూడటం తటస్థ పడింది. మీరు చేస్తున్న క్రృషికి, పద్యం పట్ల మీకున్న అభిమానానికి నాకు చాలా ఆనందంవేసింది. ముందుగా నా పరిచయం చేసుకుంటాను.
నాపేరు చింతలపాటి బుచ్చి వేంకట రామకృష్ణ శర్మ, నేను 1970 లో భాషాప్రవీణ పాసయ్యాను, మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారికి, జమ్మలమడక మాధవరామ శర్మగారికి, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారికి నేను చాలా ప్రియమైన శిష్యుడను, మల్లంపాల్లి వారిద్వారా పద్య రచనలో కలం మోపాను. 1977 లో MA పాసయ్యాను. ప్రస్తుతం అరబ్బీ పారశీ ఉర్దూ భాషలను నేర్చుకుని, అరబీ భాషలో ఉన్న ఖురాన్ ను అధ్యయనం చేస్తూ ఉమర్ ఖయాం రుబాయత్ లకు ఆధారాలు, ఖురాన్ లో యే యే ప్రాంతాలలో/యే యే శూరాలలో కలవో పరిశోధన చేస్తున్నాను.
రుబాయత్ లపై, సూఫీ సాహిత్యముపై ప్రామాణికమైన పరిశోధనాత్మక గ్రంధం వెలువరించాలన్నది నా జీవిత కాంక్ష. "శ్రీ జనాబ్ సర్" అన్న పేరుతో హిందూ క్రైస్తవ మహమ్మదీయ మూడు మతాల గ్రంధాలలోని సారూప్య ఘట్టాలను పద్యాలుగా ఒక ఖండ కావ్యాన్ని రచించాను. వివిధ పత్రికలలో వివిధ అంశాలపి వ్రాసిన వ్యాస సంపుటిని అనుభూతులు అనుపేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించాను. "రాజలింగ తారావళి" అనుపేరుతో సీసపద్యాల గ్రంధాన్ని, రాజమండ్రిలోని 'వెలుగు ' అన్న పేరుగల ప్రాంతీయ దినపత్రికకు సంపాదకునిగా వ్రాసిన సంపాదకీయాలను, భువన విజయము అను సంకలిత నాటకమును, శ్రీనాధ విజయము అను సంకలిత నాటకమును ఇంకనూ ముద్రింప వలసి ఉన్నవి.
పద్యమనిన నాకు ప్రాణము, భాష అనిన మిక్కిలి అభిమానము, పద్యరచనలలో లోపాలున్నా వార్తాపత్రికలలోని భాషలో లోపాలున్నా తత్సంబంధికులకు తెలపడం నా బాధ్యతగా భావిస్తాను.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కనున్న దివాన్ చెరువు అనే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ప్రధమశ్రేణి తెలుగు పండితునిగా ప్రారంభించి అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ పొందాను. 2005లో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం గారి శాస్త్రీయ హస్తాలద్వారా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నాను. డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ గరికిపాటి నరసింహారావు, శ్రీ కడిమెళ్ళ, శ్రీ కోట వెంకట లక్ష్మీ నరసింహం, శ్రీ గుబ్బల మాధవమూర్తి మొదలగు లబ్ధ ప్రతిష్టులతో కలసి ఇంచుమించు ఒక వంద భువనవిజయ ప్రదర్శనలను ఇచ్చాను.
నేను కృష్ణ దేవరాయలుగా శ్రీ బేతవోలువారు తిమ్మరుసుగా శ్రీ గరికిపాటి తెనాలి రామకృష్ణునిగా శ్రీ కడిమెళ్ళ నంది తిమ్మనగా మొదలుగు లబ్ధ ప్రతిష్టులతో కలసి ఢిల్లీలో భువనవిజయ ప్రదర్శనమిచ్చి ఆనాటి కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారి మూర్తిగారి ద్వారా సన్మానింపబడ్డాను.
ప్రస్తుతము నేను ఆంధ్రపద్య కవితా సదస్సు తూర్పుగోదావరి జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శిగా ప్రతినెలా పద్యం అన్న పేరుతో ఒక సభను నిర్వహిస్తూ అందు ఒక ప్రధాన అంశముపై పద్య గ్రంధం ఆధారముగా లబ్ధప్రతిష్టులైన వక్తలను ఆహ్వానించి ఉపాన్యాసాలిప్పిస్తూ అదే అంశంపై పద్యకవిసమ్మేళనం నిర్వహిస్తూ ఆ కవిసమ్మేళనములోని రచనలను డీటీపీ చేయించి పేర్లు లేకుండా ఒక లబ్ధప్రతిస్టుడైన కవికి పంపి ఆయనచే ప్రధమ ద్వితీయ తృతీయ విజేతలని నిర్ణయింప చేసి ఆ విజేతలకు తదుపరినెలలో బహుమతులను ఇప్పించుచున్నాను. అంతేకాక ప్రతీఆదివారమూ పఠన లేఖన రచనలలో పద్య శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాను అందు 60 యేళ్ళు పైబడిని భాషా పద్య అభిమానులు హాజరై శిక్షణ పొందుతున్నారు. శ్రీ ఎస్ వీ హెచ్ అలీ, శ్రీ నిష్టల కామేశ్వర రావు అను ఇద్దరు పెద్దలు వేర్వేరు రంగములలో వృత్తిని నిర్వహించి విశ్రాంతిని పొంది ఈ తరగతుల కారణంగా పధ్య రచన చేయగలుగుతున్నారు.
నా వ్యాఖ్యలోని రెండవ భాగం
రిప్లయితొలగించండిఇక ప్రస్తుత విషయానికొస్తాను.
మీ సమస్యా పూరణము బ్లాగును బొంబాయిలో ఈరోజు నాకుమారుని ఇంట చూడటం జరిగింది. మీ కృషి సర్వథా ప్రశంశనీయం, ఇందు దొరలిన రెండు నెఱసులను తమ దృష్టికి తెచ్చు సాహసం చేస్తున్నాను.
ఒకటి- శ్రీ సహదేవుడు గారి పద్యం, 'సప్తస్వరములు ' అనుపదంలో గల గణ భంగాన్ని పండిత నేమానిగారు ముచ్చటించారు. అది చాల నిజము, పద్యం వ్రాసేటప్పుడు, పద్యానికి గల నియమ నిబంధనల పట్ల, అవగాహన కలిగి ఉండటమే కాకుండా, వ్యాకరణ శాస్త్ర, శబ్ద స్వరూపముల యందు అభినివేశం కలిగి ఉండాలి. ఇందు మొదటగా నా ఆరోపణము. ఆటవెలది మాలిక కాదు, నాలుగు లైనులకి మాత్రమే పరిమితం చేయాలి. ఎందుకంటే ఆటవెలదిలో తేటగీతి వలే, నాలుగు లైన్లూ ఒకే గణ సంపుటి కలిగినవి కావు. కనుక మాలిక వ్రాయుటకు వలనుపడదు.
ఇహ రెండవది
పద్యమునకుగల చందోబద్ధ నియమనిబంధనలపై పూర్తి అధికారము కలిగి ఉండాలి. మరొక విచారణీయ అంశమేమనగా సహదేవుడు గారి వాక్యమును మీరు సవరించిన విధానము కూడా తప్పే అని నా భావన. ఎట్లనగా 'ఏడు స్వరములూ' అనునది అనిష్ట సమాసము, ఒక ఆచ్చిక పదముతో తత్సమ పదమును సమసించుట వ్యాకరణ రీత్యా చెల్లుతుందంటారా? 'ఝరుల కూటమలర సప్తస్వరాలతో' అని సవరిస్తే బాగుంటుందేమో దయతో ఆలోచించండి.
శ్రీమతి రాజేశ్వరి నేదునూరిగారి పద్యంలో ' ఏడువేలు లక్షలు యేడుకోట్లు" అను వాక్యంలో యడాగమము అనవసరం కదా? ఉత్సంధి నిత్యం కదా? " ఏడువేలు లక్షలేడుకోట్లు" అని ఉండాలికదా? ఆ పద్యంలో భావసమన్వయం కుదురుతున్నదా? దయతో ఆలోచించండి.
మీరిచ్చిన సమస్య ఆటవెలది నాల్గవపాదం కాగా, అదే పాదాన్ని 'ఉత్సాహ ' లో అనుసంధించడం అత్యద్భుతం. ఇచ్చిన సమస్యను వాక్య స్వరూపాన్ని మార్చకుండా, వాక్యంలోని అక్షరాలను మార్చకుండా, యథా తథంగా వేరొక పద్యపాదంగా, సమన్వయ పరచడం ప్రతిభకు తార్కాణం, అంతటి ఉత్సాహ వంతులైన 'ఉత్సాహ ' రచయితలకు ప్రొత్సాహక అభినందనలను తెల్పండి. విమర్శనం సహృదయంతో తీసుకొనండి, దోషాలు లేని పద్యాలను మాత్రమే స్వీకరించమని అభ్యర్ధన. ఎందుకంటే దోష భూయిష్టపద్యాలు ఔత్సాహికులకు మార్గ దర్శకాలై వారలను పెడత్రోవలను పట్టిస్తాయేమోనని నా భయం, పట్టీంచకుండా ఉండాలని నా కాంక్ష.
నా ఈ-చిరునామా: cbvrk@yahoo.com
గురువర్యులకు(CBVRK శర్మగారు) నమశ్శతములు.
రిప్లయితొలగించండిఈ రోజు అనుకోకుండా శంకరాభరణం బ్లాగులో మీ మార్గదర్శన వాక్యాలు చదివే మహద్భాగ్యం లభించింది. గత కొంతకాలంగా ఈ శంకరాభరణంతో పరిచయ భాగ్యం వల్ల పద్యరచన, సమస్యాపూరణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. శంకరాభరణానికి మీ మార్గదర్శన ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
నమస్కారములతో
మీ
అన్తేవాసి
హరి వేంకట సత్యనారాయణమూర్తి.
రామకృష్ణ శర్మ గారూ,
రిప్లయితొలగించండి‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీవంటి పండితులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు మాకు శిరోధార్యాలు. ధన్యవాదాలు.
మీ మెయిల్‌కు వివరంగా లేఖ వ్రాసాను. పరిశీలించండి.
ప్రియమైన హరికి ఆశీశ్శులు,
రిప్లయితొలగించండినాదగ్గర చదువుకుని చాలా కాలమైనప్పటికీ ఇంకా నన్ను గుర్తుంచుకుని స్పందించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కులాసాగా ఉన్నారని తలుస్తాను.
శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కారాలు, మనిద్దరమూ సతీర్ధులమైనందుకు(సతీర్ధో ఏకగురుకహ) చాలా గర్వంగ ఉంది. వీరేశ్వరశర్మ చాలా పుస్తకాలు వ్రాశారు. అందులో ఉత్తమమనుసంభవం అను గ్రంధంలో 'తురగ వల అనుష్టుప్ " అనితరసాధ్యమైనది. ప్రపంచంలో ఇంతవరకూ ఎవరూ అంత క్లిష్టమైన అనుష్టుప్ ను వ్రాయలేదు, వ్రాయబోరు. కానీ దురదృష్టమేమంటే దానిని ఏ విధంగా ప్రదర్శించాలో ఎట్లు సమన్వయం చేయాలో మాస్టారు లిఖిత పూర్వకంగా మనకు అందించకుండానే వెళ్ళిపోయారు.
గుంటురు కళాశాలలో మాస్టారు పనిచేస్తున్నపుడు నేను వారి శిష్యుణ్ణి, ఆయన పిల్లల్లో ఒకడిగా పిన్నిగారు (భానుమతి) చేతివంట తిన్నాను. మరో దురదృష్టమేమంటే ఆమె మా కనుల ముందే వెళ్ళిపోవడం మాస్టారికి నేను వండి పెట్టాల్సి రావడం (వారి ప్రత్యేకమైన రుక్మిణీ కుక్కర్ తో) నా జీవితంలోనే ఓ విషాదకర సంఘటన
ఈ విధంగా బ్లాగు రూపంకంగా మీ పరిచయం కలగడం గర్వంగా ఉంది. కానీ నేను కవితలకు వ్యతిరేకిని భావాన్ని పద్యంలో ఇమడ్చగల ప్రతిభ ఉన్నపుడు, కవితలు చాలా పేలవంగా కనపడతాయి. మనమధ్య మరొక సారూప్యం ఉంది. నేను కూడా ప్రాధమిక దశలో వేర కమ్యూనిస్టు అభిమానిని పుచ్చలపల్లి సుందరయ్యగరి పాదసేవ చేసినవాడిని. ఎంత అభిమానమంటే 1971 ఆగస్టు 31 వతేదీన ఒక యూపీ స్కూల్ లో నాకు ఉద్యోగ నియాకమక పత్రం చేతికందితే, అక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్న ఆ పాఠశాలలో చేరక అదేరోజు రాత్రి ఒంటిగంట కి పశ్చిమ బెంగాల్ నుంచీ వస్తున్న సుందరయ్యగారు బసవపున్నయ్య గార్లతో కలిసి ఆహ్వానించి మరుసటిరోజు విజయవాడలోని ఆయన ఉపన్యాసాన్ని విని తదుపరి రోజు బందరులోని ఆయన ఉపన్యాసాన్ని విని మూడవతేదీ ఆయన్ను హౌరా మైలు ఎక్కించి సుందరయ్యగారికి నా నియామకపత్రాలు చూపించాను. సుందరయ్య గారు తిట్టి ఉద్యోగంలో జేరమని పంపించారు.
మోటూరు ఉదయం గారివద్ద దాస్ కాపిటల్ అధ్యయనం చేశాను కానీ గోర్బచేవ్ సంస్కరణలూ, చైనాలోని తియాన్మేన్ స్క్వేర్ సంఘటన కార్మిక వ్యవస్థ నియంతృత్వపు పోకడల పట్ళ అసహ్యం కలిగి విరక్తిని ఏర్పరుచుకున్నాను. నా మనస్సును కదిలించినందుకు చాలా కృతఙ్ఞుడను.
ఇప్పటికింతే ధ్యన్యవాదములతో
శర్మ
శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కారాలు, మనిద్దరమూ సతీర్ధులమైనందుకు(సతీర్ధో ఏకగురుక :) చాలా గర్వంగ ఉంది. శ్రీ వీరేశ్వరశర్మగారు చాలా పుస్తకాలు వ్రాశారు. అందులో ఉత్తమమనుసంభవం అను గ్రంధంలో 'తురగ వల్గ అనుష్టుప్ " అనితరసాధ్యమైనది. ప్రపంచంలో ఇంతవరకూ ఎవరూ అంత క్లిష్టమైన అనుష్టుప్ ను వ్రాయలేదు, వ్రాయబోరు. కానీ దురదృష్టమేమంటే దానిని ఏ విధంగా ప్రదర్శించాలో ఎట్లు సమన్వయం చేయాలో మాస్టారు లిఖిత పూర్వకంగా మనకు అందించకుండానే వెళ్ళిపోయారు.
గుంటురు కళాశాలలో మాస్టారు పనిచేస్తున్నపుడు నేను వారి శిష్యుణ్ణి, ఆయన పిల్లల్లో ఒకడిగా పిన్నిగారు (భానుమతి) చేతివంట తిన్నాను. మరో దురదృష్టమేమంటే ఆమె మా కనుల ముందే వెళ్ళిపోవడం మాస్టారికి నేను వండి పెట్టాల్సి రావడం (వారి ప్రత్యేకమైన రుక్మిణీ కుక్కర్ తో) నా జీవితంలోనే ఓ విషాదకర సంఘటన
ఈ విధంగా బ్లాగు రూపంకంగా మీ పరిచయం కలగడం గర్వంగా ఉంది. కానీ నేను కవితలకు వ్యతిరేకిని భావాన్ని పద్యంలో ఇమడ్చగల ప్రతిభ ఉన్నపుడు, కవితలు చాలా పేలవంగా కనపడతాయి. మనమధ్య మరొక సారూప్యం ఉంది. నేను కూడా ప్రాధమిక దశలో వీర కమ్యూనిస్టు అభిమానిని పుచ్చలపల్లి సుందరయ్యగారి పాదసేవ చేసినవాడిని. ఎంత అభిమానమంటే 1971 ఆగస్టు 31 వతేదీన ఒక యూపీ స్కూల్ లో నాకు ఉద్యోగ నియాకమక పత్రం చేతికందితే, అక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్న ఆ పాఠశాలలో చేరక అదేరోజు రాత్రి ఒంటిగంట కి పశ్చిమ బెంగాల్ నుంచీ వస్తున్న ప్రమోద్ దాస్ గుప్తా గారిని సుందరయ్యగారు బసవపున్నయ్య గార్లతో కలిసి ఆహ్వానించి మరుసటిరోజు విజయవాడలోని ఆయన ఉపన్యాసాన్ని విని తదుపరి రోజు బందరులోని ఆయన ఉపన్యాసాన్ని విని మూడవతేదీ ఆయన్ను హౌరా మైలు ఎక్కించి సుందరయ్యగారికి నా నియామకపత్రాలు చూపించాను. సుందరయ్య గారు తిట్టి ఉద్యోగంలో జేరమని పంపించారు.
మోటూరు ఉదయం గారివద్ద కొద్దికాలం దాస్ కాపిటల్ లోని కొన్నిభాగాలను అధ్యయనం చేశాను కానీ గోర్బచేవ్ సంస్కరణలూ, చైనాలోని తియాన్మేన్ స్క్వేర్ సంఘటన కార్మిక వ్యవస్థ నియంతృత్వపు పోకడల పట్ల అసహ్యం కలిగి విరక్తిని ఏర్పరుచుకున్నాను. నా మనస్సును కదిలించినందుకు మీకుచాలా కృతఙ్ఞుడను.
ఇప్పటికింతే... ధ్యన్యవాదములతో
శర్మ
ఏడు కొండలనిన ఎక్కువగునా
రిప్లయితొలగించండినా స్వామి ఈరేడు భువనాల రాజు
ఈ కొలువు చమక్కు తళుక్కు
ఏడు వంద లనిన నెక్కు వగున?
శుభాకాంక్షలండీ అందరికి, ఇక్కడి వారందరికీ !!
చీర్స్
జిలేబి.
ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు
రిప్లయితొలగించండి