ఇప్పటివరకు 4
పాఠములలో గర్భ కవిత్వమును గురించి అనేక విషయములను వివరించితిని. ఇంక
కొన్ని ఉదాహరణలను మాత్రము వ్రాస్తాను. ఔత్సాహికులైన కవి మిత్రులు ఇంక
క్రమక్రమముగ గర్భ కవిత్వమును అభ్యాసము చేయవలసి యుంటుంది.
ద్రుతవిలంబిత గర్భిత తేటగీతి:
పరమ పావన భావన భక్తితో(డ)
శరణు కోరితి సద్గుణ సాంద్ర నీ(దు)
చరణ వారిజ సన్నిధి స్వామి నన్(ను)
కరుణతో త్రిజగన్నుత కావవే(ల)
తేటగీతి చివర ఒక లఘువు తీసివేస్తే ద్రుతవిలంబితము అయినది.
కంద గర్భిత తేటగీతి:
ధాత ముఖ దేవ సన్నుత! .. ఆతత విల
యంకర!దనుజాంతక! శుభదా! .. (మహేశ!)
భూతగణనాథ! పశుపతి! .. ఖ్యాత చరిత!
సాంబ నన్ను గావుము గిరిశా! .. (దయాబ్ధి)
తేటగీతి 2, 4 పాదములలోని చివరి కుండలములలోని అక్షరములను తీసివేయగా కందము మిగిలినది కదా.
కంద, మధ్యాక్కర, తేటగీతి, ద్రుతవిలంబిత గర్భిత చంపకమాల:
శివ శివ శంకరా పురవిజేత విభో గురుమూర్తి ధీరతా
భవ భవ నాశకా పరమ భాగ్యద పావన బావ గోత్రజా
ధవ కవితాప్రియా సరస తాండవ సంభ్రమశాలి వేగ నా
స్తవ మిదె భో భవచ్చరణ సన్నిధి సత్కృతి సత్యపాలకా
కందము:
శివ శంకరా పురవిజే
తవిభో గురుమూర్తి ధీరతా భవ నా
కవితాప్రియా సరస తాం
డవ సంభ్రమశాలి వేగ నా స్తవమిదె భో
మధ్యాకర: పై చంపకమాలలోని ప్రతి పాదములో చివరి 3 అక్షరములను తీసివేస్తే మధ్యాక్కర మిగులును.
తేటగీతి: పై చంపకమాలలోని ప్రతి పాదములోని 8వ అక్షరమునుండి 20వ అక్షరము వరకు చదివినచో తేటగీతి వచ్చును.
ద్రుతవిలంబితము: పై చంపకమాలలోని ప్రతి పాదములోని 8వ అక్షరమునుండి 19 అక్షరమువరకు చదివినచో ద్రుతవిలంబితము వచ్చును.
స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువులు మన్నించాలి " చంపక మాల మూడవ పాదంలో ఒక అక్షరం తక్కువగా ఉన్నట్టు అని పిస్తోంది . పరిశీలించ గలరు
అక్కయ్యా,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. సవరించాను.