17, మే 2012, గురువారం

శ్రీ వైష్ణవీ మాత


శ్రీ వైష్ణవీ మాత

శ్రీమాతా! కమనీయ రూపసహితా! సిద్ధిప్రదా! బుద్ధిదా!
శ్రీమత్పావనదివ్యభవ్య చరితా! చిద్రూపిణీ! శ్రీమయీ!
మామా పాపములన్ హరించి మదిలో మాకిన్ని సద్భావముల్
నీమంబుల్ గలిగించి కావుము సదా, నీకంజలుల్ వైష్ణవీ!  1.


శ్రేయంబుల్ గలిగించ "జమ్ము యను కాశ్మీర"ప్రదేశంబునన్
హాయిం గొల్పగ వాసముంటివి గదా, అంబా! జగన్మోహినీ!
నీయందెవ్వరు భక్తిఁజూపి సతమున్ నీనామ సంకీర్తనల్
చేయం జూతురు వారి కబ్బు నిలలో శ్రీ లెప్పుడున్ వైష్ణవీ!  2.


మాతా! శాంకరి! జ్ఞానశూన్యుడ నికన్ మందుండ నీ కేవిధిన్
చేతంబుల్లసిలంగ గూర్చగలనో శ్రీసూక్తులందంబుగా
రీతుల్ ఛందము రానివాడనుగదా, రేయింబవల్ నిత్యమున్
జోతల్ చేసెద భక్తితోడ కరుణన్ జూపించుమా వైష్ణవీ!   3.


నీచారిత్రము మాధురీభరమహో! నీసత్కథాలాపముల్
వాచాలత్వము ద్రుంచివేసి ఘనతన్ వాగ్వైభవాన్వీతమౌ
వీచీ పంక్తుల నందజేసి క్రమతన్ విజ్ఞాన మందించుచున్
ప్రాచీనత్వము కట్టబెట్టును గదా, వాగీశ్వరీ! వైష్ణవీ!  4.


నీవే సర్వఫలప్రదాత్రివిగదా, నీనుండియే సృష్టులున్
గావింపంబడు, వృద్ధినొందు, లయమౌ కైవల్యసంధాయినీ!
ఆవైకుంఠుడు, సృష్టికర్త, శివుడాహా! నీ పదచ్ఛాయనే
భావింతుర్ తమ మార్గదర్శకముగా  భాగ్యప్రదా!  వైష్ణవీ!  5.


జమ్మూప్రాంత సమీపమందు ఘనమౌ సద్గోత్రవర్గంబుపై
అమ్మా! యీశ్వరి! లోకరక్షణకునై యాశ్చర్యముం గొల్పుచున్
సమ్మోదంబున నిల్చినావు జననీ! సన్మార్గముం జూపుచున్
మమ్మెట్లైనను గావగా వలయు నోమాహేశ్వరీ! వైష్ణవీ!  6.


తల్లుల్ దండ్రులు బంధువర్గమనుచున్ తాదాత్మ్యతం జెంది యో
తల్లీ! మానవుడెల్లెడం దిరుగుచున్ దైన్యత్వముం బొందుచున్
కల్లోలంబులఁ జిక్కుచుండె కనుమా, కారుణ్యముం జూపి మా
కెల్లన్ నీపదకంజదర్శనసుఖం బీయం దగున్ వైష్ణవీ!  7.


ధన్యుండై వెలుగొందు వాడు ఘనుడై త్వద్భక్తు డీ సృష్టిలో
నన్యం బొండు తలంచబోక సతతం బార్ద్రాత్ముడై నీకథల్
మాన్యత్వంబున చెప్పుచున్న, వినినన్ మాతా! దయాంభోనిధీ!
దైన్యత్వంబు నశించి సత్వయుతుడౌ  తత్త్వాత్మికా! వైష్ణవీ!  8.


నిన్నున్ నమ్మితి నీపదాబ్జములకున్ నిత్యాభిషేకంబులన్
మన్నింపందగునమ్మ! పూజలెరుగన్, మందుండ నజ్ఞుండనై
యున్నాడన్ కను, నీ సుతుండ నిదిగో, ఓయమ్మ! ధన్యాత్ముగా
నన్నేరీతి యనుగ్రహింపగలవో, నారాయణీ! వైష్ణవీ!  9.


దేవీ! నీ చరణామృతాబ్ధిలహరుల్ తీర్థంబులై దేహమం
దావేశించిన కల్మషంబులను స్వాహాచేసి దివ్యత్వమున్
సేవాభావము గల్గజేసి జనులన్ శ్రీమంతులన్ జేయు, నా
కేవేళన్ భవదీయసంస్తవసుఖం(చరణాంబుసేవనసుఖం) 
బిప్పించుమా వైష్ణవీ!  10.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

14 కామెంట్‌లు:

 1. శ్రీ మూర్తి గారూ!
  వైష్ణవీ మాత దర్శనముతో మీలో కవిత్వము ఉప్పొంగినది. ధన్యులు. శుభాభినందనలు.
  మళ్ళీ తీరికగా వ్రాస్తాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  వైష్ణవీ దర్శన భాగ్యం కలిగిన మీరెంతో పుణ్యభాగ్యం కలిగిన వారు.
  దేవి వాహనమైన శార్దూల వృత్తం లో దేవి ని కీర్తించి ధన్యులైనారు.
  ఏడవ పద్యం లో జగత్తులో మాయలో పడి ఉండే ప్రాణి గురించి చెప్పినారు. ఆ స్థితి నుంచి బయటకు రావాలని తెలిసినా బయటకు రాలేక ఆత్మ తపిస్తుంటుంది.
  మీకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ సరస్వత్యై నమః:
  శ్రీ హరి....మూర్తి గారూ!
  శుభాశీస్సులు. మీ వైష్ణవీ స్తోత్రము పద్యములు చాల బాగున్నవి. అక్కడక్కడ కొన్ని సవరణలు సూచించు చున్నాను - పరిశీలించండి.

  (1) 1వ పద్యములో 1వ పాదములో కమనీయ రూప అంటూ 2వ పాదములో చిద్రూపిణీ అన్నారు కదా. 2 రూపాలుగా ఒకే పద్యములో చెప్పే కన్నా ఒకే విధముగా చెప్పితే బాగుంటుంది కదా.

  (2) 2వ పద్యము 4వ పాదములో చేయంజూతురు కి బదులుగా చేయం బూనునొ అని మారిస్తే బాగుంటుందేమో.

  (3) 5వ పద్యము 4వ పాదములో భావింతుర్ తమ అనే ప్రయోగము బాగులేదు. భావింపందగు అంటే బాగుంతుందేమో.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. గురుతుల్యులు శ్రీ నేమానిపండితులవారికి ధన్యవాదములు.
  ఉదయమే మీ అభినందనలను చూశాను. స్పందించుదామనుకున్నాను. కానీ మీ సూచనలు, దోషసవరణలకోసం ఎదురుచూస్తున్నాను. ఎంతో ఓపికతోను, వాత్సల్యంతోను సర్వదా మీరు దోషసవరణ చేస్తూ సూచనలిస్తున్నందుకు మరోమారు నమ్రతతో ధన్యవాదాలు, నమస్కారాలు సమర్పించుకుంటున్నాను.
  మీ సూచనల ప్రకారం మొదటి పద్యంలో "కమనీయరూపసహితా" అనేదానిని "సకలాగమైకవినుతా" అని, 5 వ పద్యంలో "భావింతుర్"కు బదులుగా "భావింపందగు" అనియు మారుస్తున్నాను. అయితే 2వ పద్యంలో బహువచనంలో చెప్పటం జరిగింది కనుక రెండు మరియు మూడు పాదాలను ఈ క్రింది విధంగా మారుస్తున్నాను.
  "నీయందెవ్వడు భక్తిఁజూపి సతమున్ నీనామసంకీర్తనల్
  చేయం బూనునొ వానికబ్బు నిలలో శ్రీలెప్పుడున్ వైష్ణవీ!"
  మీ సూచనలు, ఆశీస్సులు సదా ఇలాగే అందుతుండాలని కాంక్షిస్తూ
  నమస్కారాలతో
  మూర్తి.

  రిప్లయితొలగించండి
 5. లక్ష్మీదేవి గారికి,
  అమ్మా! నమస్కారములు.
  మీ అభినందనలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! శుభాశీస్సులు.
  మీ స్తోత్రము 1వ పద్యము 1వ పాదములో "నిగమస్తుతా! భగవతీ!" అని మార్చండి. సకలాగమైకవినుతా అంటే అన్ని వేదములచేత స్తోత్రము చేయబడేది ఆ తల్లి యొక్కతే అనే అర్థము వస్తుంది కదా.

  రిప్లయితొలగించండి
 7. ఆర్యా!
  ధన్యవాదములు,
  మీరు సూచించిన ప్రకారమే మారుస్తాను.

  రిప్లయితొలగించండి
 8. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ , మీ వైష్ణవీమాత స్తుతి అద్భుతము. మీకు హృదయపూర్వక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. సత్యనారాయణ మూర్తి గారి ‘శ్రీ వైష్ణవీ మాత’ భక్తి రస ప్రపూర్ణమై చక్కని ధారతో నిత్యపారాయణార్హమై మనోహరంగా ఉంది. వారికి అభినందనలు, ధన్యవాదాలు.
  స్పందించిన పండిత నేమాని వారికి, లక్ష్మీదేవి గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. సత్యనారాయణ మూర్తి గారూ,
  మా వరంగల్లులోని ‘ఆంధ్ర విద్యాభివర్ధినీ ఉన్నత పాఠశాల’లో హరి రాధాకృష్ణమూర్తి గారు తెలుగు పండితులుగా పనిచేసారు. వారి కుమారుడు హరి శివకుమార్ కూడా తెలుగు ప్రొఫెసర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసారు. వారు మీకు బంధువులా?

  రిప్లయితొలగించండి
 11. శ్రీయుతులు నరసింహమూర్తి గారికి,
  ఆర్యా! కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 12. స్తుతియించిరి శ్రీ వైష్ణవి
  నతి భక్తిని మనము పొంగ హరి కవి వర్యా !
  సతతమ్మా జనయిత్రి య-
  మిత శుభము లనిచ్చి బ్రోచు మిమ్ముల నార్యా!

  రిప్లయితొలగించండి
 13. గురుతుల్యులు శ్రీ శంకరయ్యగారికి,
  ఆర్యా!
  నమస్కారములు.
  మీ అభినందనలకు, పెద్దమనస్సుతో "శంకరాభరణంలో" పద్యాలు ప్రచురించినందుకు, తద్వారా పండితుల సూచనలమేరకు దోషాలను తెలుకొని దిద్దుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.
  ఇక వరంగల్లులో పనిచేసిన హరివారిని గురించి నాకంతగా తెలియదు.
  నమస్కారములతో
  విధేయుడు,
  మూర్తి.

  రిప్లయితొలగించండి