8, మే 2012, మంగళవారం

సమస్యాపూరణం - 698 (అయ్యవారినిఁ గని నవ్వె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

ఈ సమస్యను పంపిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

12 కామెంట్‌లు:

  1. చేయి వణకించి దానంబు చేయబోక
    మాయమాటలు పల్కుచు మమత జూపు
    నట్టి పిసినారి తనమున దిట్టయైన
    అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

    రిప్లయితొలగించండి
  2. బంటు యజమాని తోనిట్లు పలుకుచుండె
    రచ్చబండకు పెద్దలు వచ్చినారు
    సాయ మొకకొంత వీనికి చేయబోకు
    డయ్య! వారినిఁ గని నవ్వె యాచకుండు.

    రిప్లయితొలగించండి
  3. పూర్వ జన్మంబునందున పుణ్య మింత
    చేయ నందున నేనిట్లు చేయి చాపి
    అడుగు చుంటిని భిక్షంబు ననుచు పిసిని
    అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. చిన్న పిల్లల తోడన చెడుగు డాడు
    అయ్యవారిని గని నవ్వె, యాచకుండు
    వీధి వీధులు దిరుగుచు వేడు కొనెను
    పట్టె డ న్నము బెట్టియు పైస లిండు.

    రిప్లయితొలగించండి
  6. @గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ
    "పూర్వ జన్మంబునందున పుణ్య మింత
    చేయ నందున నేనిట్లు చేయి చాపి

    బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. బిచ్చ మెత్తగ నింటికి వచ్చు వాని
    నిచట గాదని పొమ్మన నింత లోన
    గృహిణి దెచ్చెను బోనముఁ గృపకు మెచ్చి
    అయ్యవారిని గని నవ్వె యాచకుండు.

    రిప్లయితొలగించండి
  8. సీత నపహరించ దలచి సిద్ధమైన
    రావణాసురు,జంగమ దేవర గని
    అట పురోహితు డాప్తుడై అడ్డు జెప్ప
    నయ్య వారిని గని నవ్వె యాచ కుండు
    బుద్ధి కర్మాను సారిణి పుడమి( గాదె ?

    రిప్లయితొలగించండి
  9. కొండ మీదను కొలువున్న బండ రాయి
    ఎదుట నిలబడి వేడిన నుదుటి వ్రాత
    ఎంత మ్రొక్కిన మార్చడు వింత గాదె ?
    అయ్యవారిని గని నవ్వె యాచ కుండు !

    రిప్లయితొలగించండి
  10. ముతక యటుకులు చంకన మూట గట్టి
    సగము చాలిన మనమున సఖుని చేరి
    పిడికెడిచ్చి బారెడు గుంజు పెద్దమనిషి
    యని తలంచునేమో యని అనఘుడా కృ
    ష్ణయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

    రిప్లయితొలగించండి
  11. సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి విరుపు, చక్కని పూరణ. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మొగుడు కాదన్న పనిని చేయడం పెళ్ళాల హక్కు కదా! చమత్కారపూరితమైన పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    యాచకుని రూపంలో ఉన్న రావణుడు పురోహితుణ్ణి చూసి నవ్వాడన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    కర్మఫలాన్ని అనుభవించే వాళ్ళు దేవుణ్ణి తూలనాడినా, పరిహసించినా లాభ మేమిటి? చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ‘పిడికె డిచ్చి బారెడు గుంజు పెద్దమనిషి’ .... ఇది నా పరిశీలనలో ఉన్న మీరు పంపిన సమస్య. దానిని నేర్పుగా ఈ సమస్యాపూరణకు వినియోగించుకున్న తీరు ప్రశంసనీయం. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ఏవిధమ్మునైనా యుప ఎన్నికగెలు
    వవలెనని వోటుగలవాని వదల ననుచు
    తనను వెతుకుచుఁవచ్చి ప్రార్ధనలుచేసి
    నయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు

    హైకమాండువారు దయతో హైద్రబాదు
    వచ్చిరని, దర్శనముఁగోరు వరుస లోనె
    వంగి నిలచి స్తోత్రములకు వంతబాడె
    డయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు

    రిప్లయితొలగించండి