13, మే 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 11

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

11

LEAVE this chanting and singing and
telling of beads ! Whom dost thou
worship in this lonely dark corner of a
temple with doors all shut ? Open
thine eyes and see thy God is not before
thee!

He is there where the tiller is tilling
the hard ground and where the path-
maker is breaking stones. He is with
them in sun and in shower, and his
garment is covered with dust. Put off
thy holy mantle and even like him come
down on the dusty soil !

Deliverance ? Where is this deliver-
ance to be found ? Our master himself
has joyfully taken upon him the bonds
of creation ; he is bound with us all for
ever.

Come out of thy meditations and
leave aside thy flowers and incense !
What harm is there if thy clothes
become tattered and stained ? Meet
him and stand by him in toil and in
sweat of thy brow.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...


భజన గాన జపమ్ములు వదలు మోయి;
ద్వారముల నెల్ల మూసి యెవ్వారు లేని
యాలయములోని చీఁకటి మూల జేరి
యెవరిఁ బూజింపుచుంటి వోయి! కనువిప్పి
చూడు, దేవుఁడు నీముందు లేఁడు సుమ్ము ||

కలఁ డతండు కృషీవలుల్ కరకు నేల
చీలికల్ పడ దున్ని కష్టించుచోట,
కలఁడు కార్మిక జనులు బాటలు రచింప
గట్టి బండలు ముక్కలు గొట్టు చోట,
ఎండ వానల వారితో నుండు నతని
కట్టుపుట్టము దుమ్మునఁ గ్రమ్మెనోయి!
ఆవలంబెట్టి మడిబట్ట లీవుగూడ
మురికి నేలకు నాతని కరణి దిగుము ||

ముక్తియా? అరే! యక్కడ ముక్తి దొరుకు?
తనకుఁ దానయి ముదమున మన ప్రభుండె
సృష్టిబంధములందునఁ జిక్కుకొనియె
నెల్ల మనతోడఁ గూడి వసించి యతఁడు
తనకుఁ దాఁ జిరకాలబంధనము పూనె ||

లెమ్ము ధ్యానమునుండి, పుష్పమ్ము లేల?
ధూప మేమిటి? కవి యటు ద్రోసి రమ్ము
చిరుగు లైనను, మన్నంటి మరకలైన
బట్టలకుఁ జింత సుంతయు పెట్టుకొనకు
కర్మయోగివై యతనితోఁ గలిసి నిలిచి
చెమ్మటం బ్రవహిల్లఁగ నిమ్ము నుదుట ||

5 కామెంట్‌లు:

  1. మా పద్యమును తిలకించండి:

    పరమేశుండు సృజించి లోకములు తా భక్తాళితో జేరు, నం
    దరి డెందమ్ములలో వసించు బెంచుకొను బంధాలన్ గదా మోక్షమె
    వ్వరి కోయీ కను మాతనిన్ మనమునన్ భావించి యింకేల నీ
    వరివస్యల్ భజనాదులున్ విడువుమా భద్రాత్మ! ధీశేవధీ!

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    కవిత మొత్తం భావాన్ని ఒకే వృత్తంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం స్తవనీయం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిఆదివారం, మే 13, 2012 8:46:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకవి గ్రంథమునకు శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులవారి ఆంధ్రానువాదము అత్యద్భుతము. శ్రీ పండిత నేమానివారి పద్యములు మధురమనోహరములు.

    గీతాంజలిని చదువగలిగిన అదృష్టం కలిగించిన శ్రీ శంకరయ్యగారు ధన్యులు.

    తేనెలూరెడి తెలుగున తియ్యనైన
    పనస తొళయేను సత్కవి పద్యమనిన
    ఆమ్రరసములు కలసిన అమృతమదియె
    ఆరగించగ రారండి యాంధ్రులార !

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    " రవీం ద్రుని గీతాంజలి " అంటే ఆ గ్రంధం లొ ఏముంటుందో అనుకునే దాన్ని ఈ చర మాంకంలో నైనా చదవ గలిగిన అదృష్టం కలిగి నందుకు ఛాలా ఆనందం గా ఉంది. నాకింత మంచి అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించిన గురువులకు పాదాభి వందనములు. ఏమీ తెలియని నేను ఈ బ్లాగు లొ ఎన్నో తెలుసుకో గలగడం నా జన్మ సుకృతం . కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతి శాస్త్రి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ......... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి