24, మే 2012, గురువారం

ప్రత్యేక వృత్తము - 12

స్వాగతము.
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 443వ వృత్తము.
రథోద్ధతమునకు దీనికి ఒక అక్షరము మాత్రమే తేడా. 


లక్షణము -
గణములు: ర న భ గగ
యతి : 7వ అక్షరము
ప్రాస నియమము కలదు.
 
ఉదా:
మౌనివర్య! జనమాన్య చరిత్రా!
జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
మాననీయ గుణ! మంగళదాతా!
పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!


(పై పద్యములో 3వ పాదమును చూడండి
- మాననీయ గుణ! మంగళదాతా! (స్వాగత వృత్తము)
 చివరిలో ఒక్క అక్షరమును ఇలా మార్చితే రథోద్ధతము అవుతుంది:
- మాననీయ గుణ! మంగళాన్వితా! (రథోద్ధత వృత్తము)  
స్వస్తి!


పండిత నేమాని రామజోగి సన్యాసిరావు

16 కామెంట్‌లు:

  1. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాభినందనలు.
    పాదప వృత్తమును చూచేము కదా. దానికీ ఈ స్వాగత వృత్తమునకు ఒక అక్షరము మాత్రమే తేడా. ఉదాహరణలో ఇచ్చిన పద్యములోని 1వ పాదమును చూడండి:
    మౌనివర్య జనమాన్య చరిత్రా! (స్వాగత వృత్తము)
    దానిని కొంచెము మార్చి చూడండి
    మౌనివరా జనమాన్య చరిత్రా! (పాదప వృత్తము)

    రిప్లయితొలగించండి
  2. మాటలో కురియు మంచితనమ్ముల్
    పాటలో మధుర భావనలుండున్.
    తోటలో కుసుమ తోరణయట్లే
    మీటె నా మనము మెల్లగ తానే.

    కొత్తవృత్తాలను పరిచయం చేస్తూ, అభ్యాసం చేయిస్తూ ఉన్న మీ ఋణం తీర్చుకోలేనిది.
    ధన్యులమయినాము. ప్రణమిల్లుతున్నాము.

    రిప్లయితొలగించండి
  3. శ్రీమతి లక్ష్మీ దేవీ!
    నే ముదమందితిని కూర్తు నివె దీవెనలన్
    శ్రీమంతము సౌభాగ్య
    శ్రీమంతమునొంది కనుమ చిరజీవితమున్

    రిప్లయితొలగించండి
  4. మంచివారలయి మానవులిందున్
    పెంచి ప్రేమమును పేదలయందున్
    పంచగావలయు భాగ్యము లెందున్
    సంచితార్థములు సత్ఫలమందన్

    రిప్లయితొలగించండి
  5. సాటివారికిల సాయము చేయన్
    కోటిసంపదలు కూడును గాదా!
    ఓటలేక విపులోర్విని తానే
    కూటయౌచు సిరి గోరుట మేలా?

    రిప్లయితొలగించండి
  6. ఓటు కోసమని ఉర్విజనాలన్
    పూటపూటగని పూజలతోడన్
    నోటుజూపెదరు నోరు నింపెదరు
    నేటి కాలమున నేతలు జూడన్

    రిప్లయితొలగించండి
  7. చేయు బాసలవి చిత్తపథంబున్
    వాయు వేగమున వైదొలగంగా
    మేయుచుండుటయె మేలని వారల్
    హాయినుందురిక అద్భుతరీతిన్.

    రిప్లయితొలగించండి
  8. ఆర్యా!
    నమస్కారములు.
    మూడవపద్యం(ఓటుకోసమని) మూడవపాదాన్ని క్రింది విధంగా చదువవలసినదిగా ప్రార్థన్.
    "నోటుజూపెదరు నూరును వేలున్"

    రిప్లయితొలగించండి
  9. రాజకీయముల రంగులనింకన్
    భూజనుల్! తమరు పోల్చగ మేలౌ
    మోజులో పడక, మోహము వీడన్
    తేజరిల్లు భువి దివ్యత నందున్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా! శుభాభినందనలు.
    శ్రీమతి లక్ష్మీ దేవి గారు, శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు, శ్రీ మిస్సన్న గారు నిత్యము ఈ ప్రత్యేక వృత్తాలను వ్రాయుట అలవరచుకొను చున్నారు. మరి కొందరు (శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీ గోలి వారు, డా. కమనీయం గారు, తమ్ముడు డా. నరసింహమూర్తి మొ.వారు) అప్పుడప్పుడు వ్రాయుచున్నారు. అందరూ కూడా ఈ అభ్యాసమును అనునిత్యము చేయ గలరని ఆశించు చున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శంకరార్య ప్రియ సంస్థకు రారే
    శంకరాభరణ సౌధమునన్ సా
    లంకృతాఛ్ఛ కృతులన్ వరివస్యల్
    పంకజాతభవు పత్నికొనర్పన్

    రిప్లయితొలగించండి
  12. అంతమే కనఁగ నైతిని కష్టా
    లంతకంతకు భయావహమై నా
    కింత శాంతియు లభించదు నాపై
    సుంతయైన దయఁ జూపుము దేవా!

    రిప్లయితొలగించండి
  13. ఎన్ని కష్టముల కేని మహాత్మా!
    యున్నదౌ వెరవు నొక్కటె యోర్పే
    చెన్నుగా విభుని సేవలె మేలౌ
    సన్నయాన మది శాంతిని గూర్చున్`

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    ప్రత్యేక వృత్తాలను పరిచయం చేస్తూ, వాటికి మంచి లక్ష్యాలను ఇస్తూ, మిత్రులను ప్రోత్సహిస్తూ, గుణదోషాలను పరిశీలిస్తూ, సముచిత సవరణలను, సూచనలను ఇస్తున్న మీకు ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    క్రమం తప్పకుండా ఈ శీర్షికలో పద్యాలు వ్రాస్తున్నారు. సంతోషం. ఈనాటి పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ప్రతిదినం ఈ శీర్షికలో అద్భుతమైన పద్యాలు వ్రాస్తూ ఆనందాన్ని కలిగిస్తున్నారు. ధన్యవాదాలు. ఈనాటి మీ ఐదు పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి