26, మే 2012, శనివారం

ప్రత్యేక పద్యము - 14

మధ్యాక్కర - 

అక్కరలు దేశిచ్ఛందోజాతములు. ఉపగణములతో (సూర్యేంద్రచంద్ర గణములతో) నిర్మితములు. ఇవి కన్నడములోను గలవు. మధ్యాక్కరను కన్నడమున ‘దొరెయక్కర’ అన్నారు.
లక్షణములు -
గణములు - ఇం ఇం సూ ఇం ఇం సూ 

(2 ఇం.గ.-1 సూ.గ.- 2 ఇం.గ.-1 సూ.గ.)
యతి -  4వ గణము తొలి అక్షరము (నన్నయ్య 5వ గణము తొలి అక్షరమును ఎన్నుకొనెను. అంతకుముందు యుద్దమల్లుని శాసనములోను ఇదే విధముగ నున్నది. కాని తరువాతి కవులు, లాక్షణికులందరు చతుర్థ గణాద్యక్షర యతిని పాటించిరి)
ప్రాస నియమము కలదు


ఉదా:
చని రాజ మందిరమ్మునకు జననాథు సన్నిధి జేరి
వినయమ్ము మీర మ్రొక్కులిడి విజయ శబ్దము చేసినంత
మనుజేశ్వరుం డడిగెను సుమంత్రుని యాత్రముతోడ
జనుదెంచితే మంత్రివర్య! సవివరముగ తెల్పుమయ్య!


మీరూ ప్రయత్నించండి.  స్వస్తి!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

8 కామెంట్‌లు:

  1. మాయామయమగుజగమిది మర్మము నెఱుగుట ఘనత
    సాయము రాదిక ధనము సౌభాగ్యసంపదదెల్ల
    కాయము వీడి చనుతఱి కర్మము వెంట వచ్చునట
    జాయలు భర్తలనియెడు చాపల్యమిక వీడుమోయి!

    రిప్లయితొలగించండి
  2. అయ్యా,
    శీర్షికను "ప్రత్యేక పద్యాలు" అని పేర్కొన్నారు. కాని దీని కన్న "విశేష పద్యాలు" అంటే బాగుంటుందేమో! ప్రాచీన కవులు, లాక్షణికులు, ఆధునిక విమర్శకులు ఇటువంటి పద్యాలను విశేష వృత్తాలుగా పరిగణించారు. అక్కరలు మొదలైనవి వృత్తాలు కావు కనుక ఈ శీర్షికను "విశేష పద్యాలు" అనడం సబబు అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  3. కరుణాత్మకుండంచు ఘనత గాంచెను రామచంద్రుండు
    ధరనేలె ప్రజను సంతతిగ దలచుచు తండ్రియై తాను
    నరుల కాదర్శమై వెలుగు నవ్యమార్గములను జూపె
    సురపూజితుండా ప్రభునకు సుందరాంగున కివె నతులు.

    రిప్లయితొలగించండి
  4. కన్నులున్నవి మూడు కాలకంఠుడు తానింక ఘనుడు
    మిన్నేరు జటలలోనుంచె మెడను పాములుజుట్టె వినుడు
    అన్నులమిన్నయౌ గౌరి కర్థదేహము నిచ్చె కనుడు
    సన్నుతులొనరించి నరులు! సౌభాగ్యవంతులై మనుడు.

    రిప్లయితొలగించండి
  5. నాలుగు మోముల సామి, నానావిధంబుగా జంతు
    జాలము సృష్టించుచుండు, చదువులతల్లిని సర్వ
    కాలము దాల్చెడి విభుడు, కామితార్థదుడింక లోక
    పాలకుడౌ బ్రహ్మ కొరకు ప్రణతులర్పించగా వలయు.

    రిప్లయితొలగించండి
  6. ఆషా మాషీగా:

    చూడుడీ మధ్యాక్కరలను సొంపారు చందంబులందు
    పాడుడీ విందైన రీతి భావమ్ము రాగమ్ము నొలుక
    ఆడుచు పాడుచు వ్రాసి అందాల పద్యాలు కూర్చి
    వేడుక లొందుడీ చాల వెల్గుడీ కవితా వనాన

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    స్వాగతం!
    మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    త్రిమూర్తులపై మీ మూడు పద్యాలు ముచ్చటగా, మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    కవితావనంలో పద్యసుమాలను పూయించమన్న మీ పద్యం ఆషామాషీగా వ్రాసినట్టు లేదు. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి