7, మే 2012, సోమవారం

పద్య రచన - 16


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. పతి ప్రాణంబులు దీసి యేగు యమునిన్ బ్రార్థించి యుక్తిన్ పతి
    వ్రత మాహాత్మ్యము వెల్గ తత్కరుణచే భర్తాసువుల్ భద్రమౌ
    గతి సాధించి కృతార్థయయ్యె స్థిర సంకల్పంబుతో దీక్షతో
    క్షితి సావిత్రి పతివ్రతామణికివే జేజేల నర్పించెదన్

    రిప్లయితొలగించండి
  2. .



    సత్య వంతుని ప్రాణాలు సమసి పోయె
    సాధ్వి సావిత్రి పలుమార్లు సముని కోర
    తీ సి కొనుమంచు ప్రాణాలు తిరిగి యిచ్చె
    సంత సించెను సావిత్రి సత్య జూచి

    రిప్లయితొలగించండి
  3. సమవర్తికి ధర్మము తీయుట ప్రాణముల్
    సమముగ తీసుకొనిపోగ సత్యవంతుని, ఆ
    యమ సావిత్రి నిలువరించె, నా పతి ప్రా
    ణముల కిపుడె నిండెనా నూరేళ్ళనుచున్

    రిప్లయితొలగించండి
  4. సీ.
    జనకున కలనాడు జగదంబ గూర్చిన
    వరదాన మహిమచే భవమునంది,
    ఆటపాటలతోడ నలరించి మురిపించి
    అన్నింట సంతసం బందజేసి,
    భర్త కాబోయెడి వానికాయువు జూడ
    చిరము గాదను పల్కు లెరిగియుండి,
    పరిణయం బాడి యా పతిసేవ జేయుటే
    వ్రతముగా బూనిన పరమసాధ్వి
    తే.గీ.
    అపుడు సద్భక్తి జూపించి యముని నుండి
    పతికి పూర్ణాయు వందించి (వునుబొంది), సుతులగాంచి
    మహిని యతివలకు మేటియై బహుళయశము
    బడయు సావిత్రి! నీకివె ప్రణతులమ్మ!.
    చం.
    వరమహిళాశిరోమణికి, భర్తకు నెల్లెడ తోడునీడయై
    ధరపయి మృత్యుదేవతకు తన్మయతన్ గలిగించి, స్వామికిన్
    సురుచిరమైన జీవనము చూపిన సాధ్వికి దివ్యశక్తికిన్
    పరమపతివ్రతాసతికి(మణికి) భక్తిగ జేతు ప్రణామముల్ మదిన్.

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా!
    నమస్కారములు.
    సీసం-మూడవపాదంలో "భర్త కాబోయెడి"- అనుదానికి బదులు "భర్తగా దలచిన" అని చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  6. యముని వెంబడి పోరాడి నయము గాను
    పతిని బ్రతికించు కొనగను పరమ సాద్వ్హి
    సీత సావిత్రులను గన్న సీమ మనది
    సాటి లేదిల మనకంటె మేటి ఏది ?

    రిప్లయితొలగించండి
  7. కాలము దీరిన పతికే
    కాలునితోబోరి బ్రతుకు కాలము నిచ్చే
    శీలము గలిగిన మాతా
    కాలమ్మే మోకరిల్లె గద సావిత్రీ!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సత్య జూచి’ని ‘స్వామిఁ జూచి’ అంటే బాగుంటుందని నా సూచన.
    *
    పురాణపండ ఫణి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని అది ఏ ఛందమో అర్థం కాలేదు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    త్వరలోనే మీరొక ఖండకావ్య సంపుటిని వెలువరించవచ్చు. అంత చక్కగా ఉంటున్నాయి మీ పద్యాలు. అభినందనలు.
    ‘మహిని యతివలకు’ అన్నచో గణదోషం. ‘మహి నతివలకు’ అంటే సరి!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    మొదటి పాదంలో యతిదోషం. మూడవ పాదంలో అన్వయక్లేశం. నా సవరణ....
    యముని వెంబడి పోరాడి యద్భుతముగ
    పతిని బ్రతికించు కొన్నట్టి పరమ సాధు
    శీల సావిత్రిఁ గన్నట్టి సీమ మనది
    సాటి లేదిల మనకంటె మేటి యెవరు ?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నాథు పంచప్రాణంబుల నపహరింప
    కట్టెదుట భీకరాకారు కాలు జూచి,
    సాధ్వి సావిత్రి యెదిరించె జంకులేక
    తీర్చి రవివర్మ చిత్రాన దిద్దె కథను.

    రిప్లయితొలగించండి
  10. కమనీయం గారూ,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
    అది రవివర్మ చిత్రం అని మీరు చెప్పేదాకా గుర్తించలేదు. ఏదో గూగుల్‌లో దొరికింది, డౌన్‌లోడ్ చేసాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి