28, మే 2012, సోమవారం

విశేషఛ్ఛందము - 16

ఇంద్రవజ్ర -
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 357వ వృత్తము.

లక్షణము
గణములు - త త జ గగ 
యతి స్థానము - 8వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


ఉదా:
శ్యామాభిరామా! నయనాభిరామా!
భూమీశ వంశాంబుధి పూర్ణచంద్రా!
సోమాననా! దేవ! విశుద్ధ తత్త్వా!
రామా! సురారాతి విరామ! భీమా!


చూచేరు కదా.  ప్రయత్నించండి.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

8 కామెంట్‌లు:

  1. శ్రీరామ! రామా! యని చిత్తమందున్
    ధీరాత్ముడౌ రాముని దేవదేవున్
    నీరేజతుల్యాక్షుని నీలవర్ణున్
    ధారాధరాభాంగుని దల్తు నెందున్. 1.

    శ్రీజానకీసుందరచిత్తచోరా!
    రాజేంద్ర! దైత్యాంతక! రాఘవేంద్రా!
    జేజేల నర్పించెద శీఘ్రమింకన్
    రా జెల్లు రక్షింపగ రామచంద్రా! 2.

    నీవేజగత్త్రాతవు నీవె మాకున్
    భావింప సర్వంబయి భక్తకోటిన్
    శ్రీవైభవం బిచ్చి విశిష్టశక్తిన్
    కావంగ రమ్మింక సుఖంబు లీయన్. 3.

    మాతండ్రివై భ్రాతవు మాతవౌచున్
    సీతాపతీ! రావలె చిత్స్వరూపా!
    చేతంబు శుద్ధమ్ముగ జేసి మాకున్
    నీతిం బ్రసాదించుచు నిల్చి కావన్. 4.

    రామా! శుభాంగా! రణరంగభీమా!
    స్వామీ జగత్పాలకచక్రవర్తీ!
    నామార్చనంబెప్పుడు నమ్మి నీకున్
    నీమంబునం జేసెద నిష్ఠతోడన్. 5.

    రిప్లయితొలగించండి
  2. శ్రీరామచంద్రుండు సుశీలుడమ్మా
    మా రామభద్రుండు క్షమాగుణుండూ
    ధీరోత్తతన్ దాను విదేహపుత్రిన్,
    శ్రీరమ్యయౌ దేవిని చేరెనమ్మా.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ సరస్వత్యై నమః :

    శ్రీమతి లక్ష్మీ దేవి గారూ & శ్రీ హ.వె.స.నా.మూర్తి గారూ!
    శుభాభినందనలు.

    ఏ పద్యమైనా కనుడీ యటంచున్
    చూపించుచున్ బోడిమి చొక్కు రీతిన్
    రూపింతురే సజ్జనలోక వంద్యుల్
    దీపింప మీ కీర్తి ప్రతిష్ఠ లుర్విన్

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. ఇంద్రవజ్ర గర్భిత వసంతతిలక.....

    సీతాపతీ! వరద! శ్రీకర! శేషతల్పా!
    శ్రీరాఘవా! శుభద! జిష్ణు! సుషేణ! శార్ఙ్గీ!
    నారాయణా! విరజ! నందకి! నారదాప్తా!
    రారా! దయారసవిరాజిత! రక్ష సేయన్.

    గర్భిత ఇంద్రవజ్ర .....

    సీతాపతీ! శ్రీకర! శేషతల్పా!
    శ్రీరాఘవా! జిష్ణు! సుషేణ! శార్ఙ్గీ!
    నారాయణా! నందకి! నారదాప్తా!
    రారా! దయారాజిత! రక్ష సేయన్.

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణ మూర్తి గారూ,
    ఇంద్రుని వజ్రం ఒక్కటే! మీరేమో ఐదు వజ్రాలు కానుకగా ఇచ్చారు. ధన్యోస్మి! అభినందనలు, ధన్యవాదాలు!
    *
    లక్ష్మీదేవి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
    ‘ధీరోత్తతన్ దాను’ అన్నదాన్ని ‘ధీరోత్తముం డయ్యు’ అంటే బాగుంటుందేమో!
    *
    నేమాని వంశ వార్నిధి
    సోమా! సన్యాసిరావు శుభనామా! నే
    నేమని నుతింతు తవ స
    మ్మానిత కవితా విలాస మాధుర్యమ్మున్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సరస్వత్యై నమః :
    అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
    మీరు గర్భ కవిత్వములో ప్రవేశించడము ముదావహము. బాగున్నది మీ పద్యము. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి