29, మే 2012, మంగళవారం

విశేష వృత్తము - 17

ఉపేంద్రవజ్ర -
ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 358వ వృత్తము.

లక్షణము -
గణములు -  జ త జ గగ
యతిస్థానము -  8వ అక్షరము
ప్రాస నియమము కలదు.
(ఈ వృత్తమునకు ఇంద్రవజ్రకు తొలి అక్షరము మాత్రమే భిన్నముగా నుండును).


ఉదా:
నరాధిపా! శ్రీరఘునాథ! రామా!
సురాధినాథస్తుత శుద్ధ కీర్తీ!
ధరాసుతా వల్లభ! ధర్మమూర్తీ!
సరోరుహాక్షా! సుఖ శాంతిదాతా!


చూచేరు కదా ఇంక ప్రయత్నించండి.స్వస్తి!


పండిత రామజోగి సన్యాసి రావు

10 కామెంట్‌లు:

  1. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    నిన్నటి విశేష వృత్తము పేరు "ఇంద్రవజ్ర" వినుటకు బాగున్నది - ఇంద్రునికి వజ్రము ఆయుధము కాబట్టి. మరి ఉపేంద్రునికి (శ్రీకృష్ణునికి) వజ్రము ఏమిటి అంటారా! వజ్రము ఉపేంద్రునికి ఆభరణము కదా! మంచి ఆభరణములను మీరు కూడా కూర్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. ముదాకరుం డాతడు మోదకంబుల్
    సదా నివేదించుచు శంకలేకన్
    పదద్వయిం దాకుచు వక్రతుండున్
    ముదంబునం గొల్తును మోక్షకాంక్షన్. 1.

    చతుర్థినా డెంతయు శ్రద్ధతోడన్
    మతిన్ బ్రసాదించు నుమాకుమారున్
    నితాంతభక్తిన్ గరుణించమంచున్
    శ్రితార్థికామప్రదుఁ జేరి గొల్తున్. 2.

    మహోరువిఘ్నంబులు మాయమౌ నా
    మహేశపుత్రున్ మహిమప్రయుక్తున్
    మహోదరున్ సుందరమంగళాంగున్
    సహాయమర్థించుచు సన్నుతించన్. 3.

    సమస్తకార్యంబులు సాగుచుండున్
    శమించి విఘ్నంబులు సవ్యరీతిన్
    ప్రమాదముల్ గల్గవు భాగ్యమబ్బున్
    ప్రమోదముం గూడును భక్తకోటిన్. 4.

    గణేశ! లంబోదర! కామ్యదాతా!
    ప్రణామమోదేవ! శుభస్వరూపా!
    క్షణంబునం గూల్చుచు గర్వరాశిన్
    గుణాన్వితుం జేయుము కూర్మితోడన్. 5.

    రిప్లయితొలగించండి
  3. మహోగ్రతేజుండగు మల్లినాథున్
    మహాశివున్ గొల్చెదమమ్మ గౌరీ!
    సహింపశక్యమ్మొకొ, సర్పభూషున్
    సహాయమందింపవె చల్లనమ్మా!

    దవానలమ్మైన కృతమ్ములన్నీ
    నివారణల్ జేయవె నీలకంఠా!
    శివా! మహాశంకర! చిత్స్వరూపా!
    భవాబ్ధిదాటించుము పార్వతీశా!

    రిప్లయితొలగించండి
  4. ఉపేంద్రుని గూర్చి స్తోత్రము:

    ఉపేంద్ర! గోపాలక! యోగదాతా!
    కృపారసాంభోనిధి! కృష్ణమూర్తీ!
    ఉపాస్య దైవంబని యొప్పు మీరన్
    జపింతు నీ మంత్రము సారసాక్షా!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ మూర్తి గారూ
    మీ పద్యపంచకము గణపతిపై భక్తిప్రపూర్ణముగా నున్నది. సెహబాస్.

    శ్రీమతి లక్ష్మీదేవి గారూ!
    మీ ధార చక్కగా సాగుచున్నది. అభినందనలు. మహాదేవునిపై మీ పద్యములు బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా!
    ధన్యవాదములు మరియు నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  7. సత్యనారాయణ మూర్తి గారూ,
    మీరెలాగూ సుమధుర కవితా గుణాన్వితులే! సందేహం లేదు. అద్భుతమైన గణేశ పంచరత్నాలను రచించి బ్లాగును శోభాయమానం చేసారు. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    నేమాని వారి యోగ్యతాపత్రాన్ని పొందిన మీ పద్యాలను వేరే విశ్లేషించవలసిన పని లేదు. చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఉపేంద్రునిపై మీ పద్యం వజ్రంలా భాసిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మా బండి విపరీతమైన ఆలస్యంగా నడుస్తోంది. మన్నించండి.

    స్వాగతము:
    శ్రీ సతీ! లలిత! చిన్మయ రూపా !
    వాసవాది సుర వంద్య !నమస్తే!
    చేసెదన్ ప్రణతి చింతలు దీర్పన్
    దోసమెంచకుమ దుర్మతి నంచున్.

    మణిరంగము
    శ్రీ హరీ! సుర సేవిత పాదా!
    మోహవార్థిని మున్గితి రారా!
    ఈహమై వృధ యీదగ లేకన్
    దేహియంటిని దీనదయాళో!

    మధ్యాక్కర
    లలితాంబ! నీధ్యానమునను లీనమై తరియింప నీవె
    లలితాధరమ్మున పూచు రమ్యమౌ నవ్వుపూలనిడి
    లలిత దృక్కుల నను శ్యామలా! పరికింపవే కరుణ
    కలిమి నొసంగవే జనని! ఘన కిల్బిష తతులు వీడ.

    దండకము
    శ్రీ మన్మహా దేవి సీతా మాహా సాధ్వి శ్రీ జానకీ రామ పత్నీ పవిత్రీ సుగాత్రీ ధరిత్రీ సుపుత్రీ భవద్దివ్య చారిత్రమౌ భారతీయాంగనా నిత్య పారాయణం బిమ్మహిన్ నాడు నాగేటి చాలున్ లభింపంగ వైదేహ భూపాలు నింటన్ మహానంద మేపార గారాలు సేయంగ సర్వుల్ భవల్లీలలన్ జూపి చెన్నొందవే అంతరంగమ్మునన్ రామునే దల్చుచున్ భర్తగా నెంచుచున్ ప్రేమలంబంచుచున్ వాని దివ్యాగమంబున్ మదిన్ గోరుచున్నుండవే, తాటకిన్ గూల్చి యాగమ్ము రక్షించి యా కౌశికున్ గూడి యేతెంచి శ్రీ శంభు చాపంబునున్ ద్రుంచగా రామమూర్తిన్ సహర్షాతి రేకంబునన్ పెండ్లి యాడంగ నేకాలమందున్ పతిన్ వీడకన్ పుణ్య శీలంబుతో వెల్గవే అత్తలన్ మాతలన్భావనన్ దల్చవే రావణున్ ద్రుంచి ధాత్రీ భరంబార్పగా వేలుపుల్ వేడగా రాఘవున్, మంధరా వృత్తమై యాతడున్ కానకేగంగ సౌమిత్రితో గూడి ఛాయా స్వరూపంబునన్ తోడుగా నిల్చి దైత్యాన్తక ప్రేరణం బీయవే, దొంగిలింపంగ నిన్ పంక్తికంఠుండు మాయావి రూపంబునన్, భర్త నేమాత్రమున్ తూలకన్ రామచంద్రాంకిత ధ్యానివై శోకమున్ మోయవే హనూమంతు డేతెంచి నా వీపు పై నెక్క గొంపోతు నన్నన్ అమర్యాద నా నాధుకున్ కూడదంచాడవే రావణున్ వాని శౌర్యంబు రాజ్యంబు భోగంబులన్ సర్వమున్ గడ్డి పోచంచు దూషించవే నాధు డేతెంచి నిన్నగ్నిలో దూకి నీ పాతివ్రత్యమ్ము జూపింపు మన్నన్ మహా సాధ్వివై యగ్నిలో దూకవే పావకుండంత నీదౌ సతీత్వమ్ము కే పంకిలమ్మంట లేదంచు నిన్ మెచ్చడే నిండు చూలాలివై యున్న నిన్ రామభద్రుండు ఘోరాటవిన్ దించగా పూర్వ కర్మంచు చింతించుచున్ వేదనన్ క్రుంగుచున్ రాము నేమాత్రమున్ దూరకన్ మౌని వాల్మీకి యింటన్ వసింపంగ లేదే భవత్పుత్రులన్ తండ్రికిన్ దీటుగా బెంచవే వారినిన్ రాముకున్నిచ్చి నీ తల్లి గర్భమ్ముకున్ జేరవే తల్లి సాధ్వీ లలామన్న నిట్లుండగా నొప్పు నంచెల్ల వారున్ ప్రశంసింపగా మించవే యమ్మ మా నేటి కాలమ్మునన్ నీ సతీత్వమ్ము నీయోర్పు నీ నేర్పు నీ భక్తి నీ శక్తి నీ కీర్తి మాదారి జూపించు దీపమ్ముగా వెల్గదే మమ్ము నీ బిడ్డలంగా మదిన్ దల్పవే మమ్ము మన్నించవే మైథిలీ పావనీ లోకమాతా నమస్తే నమస్తే నమః.

    రిప్లయితొలగించండి
  9. మూర్తిగారూ ధన్యవాదాలు.
    మీ పద్యాలు మంచి పదగుమ్ఫనతో మనోజ్ఞంగా అలరారుతున్నాయి.

    రిప్లయితొలగించండి