10, మే 2012, గురువారం

పద్య రచన - 18


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

(చిత్రంలోని ‘థర్టీ బ్రాండ్ బీడీల ప్రకటనను’ పరిశీలించకుండా ఉపేక్షించండి)

21 కామెంట్‌లు:

  1. స్నేహముతో సురాసురులు క్షీరసముద్రము ద్రచ్చగా మహో
    త్సాహముతో లభించెను సుధారసమంతట నద్భుతమ్ముగా
    ద్రోహము సేయ బూనిరట దుందుడుకొప్పగ దైత్యులయ్యెడన్
    శ్రీహరి విశ్వమోహన విశేష లతాంగిగ నిల్చెనచ్చటన్

    దరహాసము నొలికించుచు
    పరవశ మొనరించు కొనెను భామ దనుజులన్
    త్వరితగతి పోసె నమృతము
    సురతతులకు విష్ణులీల శోభిలు రీతిన్

    ఈ శంకరాభరణమున
    శ్రీశా నీ లీల గాంచ చిత్తంబలరెన్
    హే శృంగార రసాద్భుత
    వైశిష్ట్యాకార! నీకు ప్రణతులు దేవా!

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    ఈ పద్య రచన శీర్షికలో మీ బాణీ కూడా వినిపించితే బాగుంటుంది కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్యగారూ, బీడీ కంపెనీ ప్రకటనను కత్తిరించి బొమ్మను పెట్టి ఉండవలసినదేమో!

    రిప్లయితొలగించండి
  4. ఉత్సాహ:
    శ్రీమదంబుజాసనుసతి చిల్కరింప ప్రక్రియల్
    ప్రేమసుధలతో కవిత్వ రీతులొప్పు వేనవేల్
    రామణీయకముగ శంకరాభరణమునన్ బళా
    ఏమి యేడు వందలనిన నెక్కువగున మిత్రమా?

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా!
    ఈ బీడీ కంపెనీ వ్రాత చూస్తే నాకు ఒక చాటువు గుర్తునకు వచ్చినది. వినండి

    ఖగపతి అమృతము తేగా
    భుగభుగమని యొక్క చుక్క భువిని పడంగా
    పొగమొక్కై జనియించెను
    పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

    రిప్లయితొలగించండి
  6. సీ.
    తొల్లి మత్స్యంబౌచు ఎల్ల వేదంబులన్
    కాపాడి యున్నట్టి ఘనుడతండు,
    సకల సురాసురుల్ సాగరంబున జేరి
    అమృతంబు కాంక్షించి యందులోన
    మంథరాద్రిని నిల్పి మహిమాన్వితుండైన
    వాసుకిన్ త్రాడుగా చేసినపుడు
    కూర్మరూపంబుతో కోరనచ్చట జేరి
    గిరిని దాల్చిన యట్టి సురవరుండు
    తే.గీ.
    సిరిని చేపట్టి యలరించు సరసుడగుచు
    దానవారులు ప్రార్థింప దయను జూపి
    అమృత మందింతు వీక్షించు డనియటంచు
    సౌరు లొలికించు నతివగా మారెనపుడు.
    కం.
    మోహినియై చూపరులకు
    మోహంబును కల్గజేసి మురహరు డనఘుం
    డాహరి యమృతపు భాండము
    నాహా! యరచేత బూని యచ్చట నిలిచెన్.
    కం.
    జేజే మోహనరూపా!
    జేజే కమలాయతాక్ష! జేజే శార్ఙీ!
    జేజే యసురనిహంతా!
    జేజే భువనైకనాథ! జేజేలు హరీ!
    కం.
    హరి! నీనామము దలచిన
    హరియించును పాపచయము లానంద మగున్.
    "హరిహరిహరి" యని యందును
    కరుణను జూపించి మమ్ముఁ గావు మనంతా!

    రిప్లయితొలగించండి
  7. దేవ దానవు లిరు వైపు తిష్ఠ వేసి
    చూడ సాగిరి మోహిని చూడ్కి వైపు
    అమృత పానంబు నందున నాతు రతన
    నెరుగ నైతిరి దానవు ల్నెలతి మాయ

    రిప్లయితొలగించండి
  8. నేమానివారూ, మీరుదహరించిన పద్యం గురజాడవారి కన్యాశుల్కంనాటకంలోనిది. గిరీశంపాత్రనోట పంతులుగారు పలికించినది. దీని అసలు పాఠం:

    కం. ఖగపతి యమృతము తేగా
    భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
    పొగచెట్టై జన్మించెను
    పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ శ్యామలరావు గారూ!
    మీరు కన్యా శుల్కములోనిది ఆ పద్యము అని గుర్తు చేసేరు. సంతోషము. పొగాకు మొక్కలుగానే ఉంటుంది, చెట్టు కాదు. అందుచేత పాఠాంతరముల వలన అలా ఆ పదము మారిఉండవచ్చు. ఇంతకూ నేను కన్యాశుల్కము పుస్తకమును ఎన్నడూ తిరగ వెయ్యలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. నేమానివారూ, పొగాకు మొక్కయేగాని చెట్టుగాదు. నిజమే, నాకు కూడా పంతులుగారు అలా యెందుకు వ్రాసారా అని సందేహం కలిగింది మొదట.

    కన్యాశుల్కం నాటకాన్ని పంతులుగారు 1897లో ప్రకటించారు. దాని ద్వితీయ పరిష్కరణం 1907లో చేసారని గుర్తు. ఈ రెండు పరిష్కరణాలూ నేడు లభ్యమే. కాబట్టి పాఠాంతరం ఉందని అనుకోనవసరం లేదు.

    గిరీశం అనేది మంచి వాక్చాతుర్యంగల ఆషాఢభూతిలాంటి పాత్రగా పంతులుగారు సృజించారు. అతడి యీ పద్యానికి శ్రోత ప్రాథమిక పాఠశాలా విధ్యార్థి వేంకటేశం అనే శిష్యుడు. పొగాకు మొక్కగురించి వేంకటేశానికి తెలియకపోవచ్చును గాని పొగత్రాగటం గురించి ఆ పిల్లవాడికి యీ గురివుగారి పుణ్యమా అని బాగా తెలుసు. గిరీశం బడాయికోసం పొగాకు చెట్టు అన్నట్లు అనుకుంటున్నాను. గిరీశం అతిశయోక్తులకు పుట్ట. అందుకే అలా అని ఉంటాడు. ఈ పద్యానికి ఒక్ ముక్తాయింపు ఉంది.
    ...... "ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో ఉంది"
    ఇదండీ అతడు దబాయించి మాట్లాడే ధోరణి.

    రిప్లయితొలగించండి
  11. ‘ఖగపతి అమృతము తేగా’ పద్యం గురజాడ సృష్టి కాదు. అది ఒక చాటు పద్యం. దానిని సందర్భానుసారం ఆయన కన్యాశుల్కంలో వాడుకున్నారు.
    చాటుపద్యం కనుక పాఠాంతరాలకు అవకాశం ఎక్కువ.
    నాకు తెలిసిన పద్యంలో ‘పొగచెట్టు’ అనే ఉంది.

    రిప్లయితొలగించండి
  12. ‘బీడీ ప్రకటనను ఉపేక్షించండి’ అని విన్నవించుకున్నా దానిమీదే చర్చ ఎక్కవయింది...

    రిప్లయితొలగించండి
  13. సురను పంచగ వచ్చెను సుంద రాంగి
    అసురు లందరు మైమరచి వెసను బడుతు
    మధువు కంటెను మత్తిల్లె మగువ సొగసు
    అసలు సంగతి మరచిరి యసురు లనగ !

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    మోహినిపై మీరు వ్రాసిన పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    నా బాణీని వినిపించ మన్నారు. సంతోషం! అయితే ఈ మధ్య అనారోగ్యం, కొన్ని అపరిష్కృత సమస్యలు, ఈతి బాధల వల్ల చిత్తశాంతి లోపించి మనస్సును కేంద్రీకరించలేక పోతున్నాను. అందువల్ల గత కొంత కాలంగా సమస్యలు పూరించడం కాని, పద్యాలు వ్రాయడం కాని చేయలేక పోతున్నాను. మరికొంత కాలం పట్టవచ్చు. నన్ను మన్నించాలి.
    *
    శ్యామలీయం గారూ,
    బొమ్మలో కొంత భాగాన్ని ఎడిట్ చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. అందుకే ఆ ప్రకటనను ఉపేక్షించ మన్నాను. అయినా దాని మీదకూడా ఆసక్తి కరమైన చర్చ జరిగింది కదా!
    *
    పండిత నేమాని వారూ,
    బీడీ కంపెనీ ప్రకటన చూడడం వల్ల కలిగిన ‘ఉత్సాహ’మా? బాగుంది.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    హరి మాహాత్మ్యము తెలిపే చక్కని పద్యఖండికను వ్రాసిన మీకు జేజేలు.
    ‘అనియటంచు’ అన్నప్పుడు పునరుక్తి ఉందని సందేహం. ‘అనుచు తెలిపి’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    ‘నెలతి’... నెలత కదా!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
    ‘మైమరచి’ అన్నప్పుడు గణదోషం.... ‘అసురు లెల్ల మైమరిచియు...’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ హరి....మూర్తి గారూ & శ్రీ శంకరయ్య గారూ!
    భక్తి భావములో పునరుక్తి దోషము కాదు. అందుచేత సవరించనక్కరలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
    ఉత్సాహము శంకరాభరణము సభ్యులకు సరస్వతీ దేవియొక్క ప్రేమజల్లు వలన అని మీరు గమనించలేదు. బీడీ కంపనీ ఇంత పని చేసింది ఏమి చెయ్య గలము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    అది సరదాగా చేసిన వ్యాఖ్య... మరోలా భావించకండి.
    క్షమించండి...

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతిశాస్త్రిగురువారం, మే 10, 2012 11:19:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కలశము జేత బట్టుకొని గానముజేయుచు నవ్వుమోముతోన్
    కులుకుచు వచ్చు భామినిని కోర్కెలు రేగగ చూచుచుండగా
    వలపులు జూపుచున్నసుర వర్గమునందున యాశరేపుచున్
    న్నొలకగజేసెనాసుధను యొప్పగ మోహిని దేవతాళికిన్

    రిప్లయితొలగించండి
  19. శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి ధారతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘సుధను + ఒప్పగ = సుధనొప్పగ’ అవుతుంది కదా!
    ‘ఒలకగ జేసె నౌర సుధ నొప్పగ....’ అందాం.

    రిప్లయితొలగించండి
  20. శ్రీపతిశాస్త్రిశనివారం, మే 12, 2012 10:00:00 PM

    గురువుగారూ ధన్యవాదము. మీరు సూచించిన సవరణ చక్కగా ఉన్నది.

    రిప్లయితొలగించండి