11, మే 2012, శుక్రవారం

పద్య రచన - 19



కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. ఆర్యా!
    నమస్కారములు, చిత్రంలో ఇద్దరు మహానటులు కనిపిస్తున్నారు. ఒకరు రంగారావు, మరొకరు రామారావు.
    సీ.
    అత్యద్భుతంబైన హావభావముతోడ
    పాత్రోచితంబైన భాషతోడ
    నటనలో లీనమై నవరసభావాల
    ననయంబు చూపించు ఘనులు వారు,
    అభినయోచితమైన ఆహార్యమును దాల్చి
    పాత్రలో జీవించి భవ్యమైన
    యశమును సాధించి యఖిలాంధ్ర హృదయాల
    నుఱ్ఱూత లూగించి యున్నవారు
    తే.గీ.
    రంగ రాయుండు, తారక రామరావు
    నటుల నుత్తములేకాదు, నవ్యగతులు
    నేర్పి యుండిరి జగతికి నిష్ఠతోడ
    వారి కొసగెద నింక జోహారు లిపుడు.

    ఇక చిత్రంలో ప్రధానంగా కనిపిస్తున్న ఘటోత్కచుడు:

    ఉ.
    మేటివిరా! భళీ! యపుడు మేలొనరించగబూని యా జగ
    న్నాటక సూత్రధారి యదునందను డంప, సుయోధనాదు లా
    రాటము చెందుచుండ మధురంబగు రూపము దాల్చి యందు నీ
    పాటవ మంత జూపుచు శుభప్రదుడైతివిగా ఘటోత్కచా!

    రిప్లయితొలగించండి
  2. భీమసేనుసుతుండు వీరాధివీరుండు
    ఘనభుజుండగు ఘటోత్కచుడతండు
    అభిమన్యునకు ప్రియమౌ శశిరేఖతో
    కళ్యాణ మొనరింపగా దలంచి
    చనె సుభద్రామాత యనుపగా ద్వారకా
    పురికి సంరంభమ్ము మెరయు రీతి
    తన మాయ చేతనే గొనిపోవ నెంచెను
    శశిరేఖ నా రాత్రి సమయమందు
    అంత నచ్చోట గంపట్టె నచ్యుతుండు
    మాయ లన్నిటినిన్ దన మాయ చేత
    మాయమొనరింప గల్గిన మాధవుండు
    మందహాస ముఖాంబుజ సుందరుండు

    నల్లనివాడు సాధుల మనమ్ములలో విహరించువాడు ను
    త్ఫుల్ల సరోజ లోచనుడు భూరి కృపాళువు సుస్మితాస్యుడై
    చల్లని చూపుతో గనుచు సర్వ శుభమ్ముల నిచ్చు వేల్పు మ
    మ్మెల్లెడలందు బ్రోచునని యేను భజించెద కృష్ణు నాదృతిన్

    రిప్లయితొలగించండి
  3. ఆర్యా!
    నమస్కారములు.
    సీస పద్యం మొదటి పాదంలో "పాత్రానుగుణ్యమౌ భాషతోడ" అని చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  4. విజయావారివిచిత్ర చిత్రకథలన్ వేనోళ్ళకీర్తించి ది
    గ్విజయంబౌనని చెప్పగా విని జనాభీష్టంబుగానాకథల్
    ఋజుమార్గంబున జెప్పె పూర్వులకు సంప్రీతుల్ కలుంగన్ భళా
    నిజమీచిత్రము భక్తి భోధకము సన్మిత్రంబు లోకంబునన్.

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణ మూర్తి గారూ.
    ఎస్విఆర్, ఎన్టీఆర్ లను గురించి, ఘాటోత్కచుని గురించి చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఘటోత్కచుని గురించి వివరిస్తూ శశిరేఖా పరిణయం కథను చక్కగా చెప్పారు. పనిలో పనిగా శ్రీకృష్ణుని లీలలు వర్ణించారు. ప్రశస్తంగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘మాయాబజారు’ పోస్టరును మీరొక్కరే చక్కగా పరిశీలించారనుకుంటాను. సంతోషం.
    కళాఖండాలన దగ్గ చిత్రాలను నిర్మించిన విజయా సంస్థను గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మాయ లోకము సృష్టించి మహిమ జూపి
    మాయ శశిరేఖయై తాను మత్తు గొలిపి
    వింత వంటకములు వండి విందు జేసి
    కయ్య మేరీతి లేకుండ వియ్య మంద
    భీమ సేనుని తనయుడు వీరు డనగ !

    రిప్లయితొలగించండి
  7. భళి భళీ యని చాటె భగవంతు లీలలు
    మాయ సుందరి దివ్య మహిమ జూపె
    అసమ తసమ దీయు లనుచు భాషను నేర్పె
    వీరతాళ్ళు మెడను వేసి మెచ్చె
    పుష్టిగాను వివాహ భోజనంబును బెట్టె
    విరహమందు సుఖపు విలువ జెప్పె
    ఓహొహో జగమును లాహిరీ యని యూపె
    ఓంశాంతి శాంతనె నుచిత రీతి

    మదిని నిలచి మనల మహ మాయబజారు
    తెలుగు నాట వెలసి వెలుగు చుండె
    యస్వి,యంటియారు అక్కినేన్రేలంగి
    సహజ నటిని గూడి సరసముగను

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘మాయాబజారు’లోని పాటలు, హాస్య సన్నివేశాలు, మహా నటుల నటనా ప్రావీణ్యం అన్నింటినీ ప్రస్తావించిన మీ పద్యం గత స్మృతుల నెన్నో ఉద్దీపింపజేసింది. మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి