21, మే 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 19

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

19

IF thou speakest not I will fill my
heart with thy silence and endure it. I
will keep still and wait like the night
with starry vigil and its head bent low
with patience.

The morning will surely come, the
darkness will vanish, and thy voice pour
down in golden streams breaking through
the sky.

Then thy words will take wing in
songs from every one of my birds'
nests, and thy melodies will break forth
in flowers in all my forest groves. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం.....

మౌనమా! నీవు మాటాడ వేని యింక
నేను సైతము ముచ్చట మానుకొందు
నీదు నిశ్శబ్దవృత్తియె నెమ్మనమున
నింపుకొని యోర్మి గైకొని నిల్చియుందు ||

రాత్రి నిస్తబ్దముగ వినమ్రత వహించి,
రిక్కదివ్వెలు వెలిగించి, రెప్ప యిడక
యెదురు సూచుచు నిల్చున ట్లేనుగూడ
గాచుకొని యుందుఁ దాలిమి నాచిపట్టి ||

కాఁగలదు ప్రభాతమ్ము కాగలదు నిజము,
చిమ్మచీఁకటి యిది రూపుచెదరఁ గలదు,
తావకీనస్వరస్వర్ణధార పారి
నింగి చీల్చి యిలం డిగి నిండఁ గలదు ||

అపుడె మేల్కొను నా హృదయఁపుఁ బులుంగు
గూండ్లు నీ గీతికాస్వరగుంభనముల
ముమ్మరమ్మయి కిలకిల మ్రోయు లెమ్ము
స్వామి! యప్పుడె మామకారామసీమఁ
దావకస్వరమధురిమ తీవ తీవ
పూవుప్రోవులుగా విరబూచు లెమ్ము ||

1 కామెంట్‌:

  1. క్లుప్తముగా:

    రాతిరి గతించు నిక సుప్రభాతమగును
    నీ స్వర సువర్ణ ధారలు నిండు జగతి
    నపుడె మద్ధృత్పికము పాడు నాత్మలోన
    తీవ తీవకు విరబూచు పూవులగుచు
    నీదు సుమధుర గానముల్ మోదమెసగ

    రిప్లయితొలగించండి