6, మే 2012, ఆదివారం

గర్భ కవిత్వములో మెలకువలు - 1

          ఒక పద్యములో మరొక పద్యమును వ్రాయుటను గర్భ కవిత్వము అంటారు.  అలాగ ఒకే పద్యములో 3, 4 పద్యములు కూడా వ్రాయవచ్చును.  ఎన్ని పద్యములైన ఒక్కొక్కటిగా చదువుకొనినపుడు దాని దాని లక్షణములు, భావము, అన్వయము చక్కగా సరిపోవలెను.  ముందుగా కొన్ని ఉదాహరణలు సూచిస్తున్నాను:

(1) సీసపద్యము/ఆటవెలది:
సీస పద్యమునకు ఆటవెలది పద్యమునకు కూడా సరిపోయే ఈ పాదములను చూడండి:

అఖిల లోకములకు నాధారభూతమై
వెలుపలయును లోన నలరుచుండు
సకల నిగమ శీర్ష సారధామ విహార
పరమపురుష రామ భవ విరామ

ఏఏ గణములు వేస్తే అలాగ సరిపోవునో అనేది జాగ్రత్తగా పరిశీలించి ఆ విధముగా ఇటువంటి పద్యములను వ్రాయవచ్చును. 

(2) తేటగీతి/ద్రుతవిలంబితము:   
ద్రుతవిలంబితమునకు గణములు న భ భ ర 7వ అక్షరము యతి.  ద్రుతవిలంబితము పాదము చివర ఒక లఘువు చేర్చితే అది తేటగీతి అవుతుంది.  యతి మాత్రము జాగ్రతగ 
వేసుకొనవలెను. ఉదా:

సరస సద్గుణ సాగర శంకరా ..   ద్రుతవిలంబితము 
సరస సద్గుణ సాగర శంకరార్య ..  తేటగీతి

మరికొన్ని ఉదాహరణలను మరొక పాఠములో నేర్చుకొనెదము. స్వస్తి!
 
నేమాని రామజోగి సన్యాసి రావు

4 కామెంట్‌లు:

  1. మెలకువల పాఠములను అందించుచున్న శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    గురువులు శ్రీ నేమాని వారికి ధన్య వాదములు.
    ముందు తేట గీతి , ద్రుత విలంబితము బాగా తెలిసాయి .సీసము పాదమునకు " మొత్తం ౮ గణములు కదా ! " యతి " ౧-౩ , ౫-౭ " అలా చూడ వలెనా ? తెలుప గలరు

    రిప్లయితొలగించండి
  3. అమ్మా శ్రీమతి రాజేస్వరి గారూ! శుభాశీస్సులు.

    సీస పద్యములోని 8 గణములను 2భాగములుగా విభజించి 4 ఇంద్రగణములు ఒక భాగముగను, 2 ఇంద్రగణములు + 2 సూర్య గణములు 2వ భాగముగను చేసి యతులు వేసుకొంటాము కదా. మీరు చెప్పినట్లు గనే 1 - 3కి, మరియు 5 - 7కి యతులు వేస్తాము.
    సీస పద్యము 1 పాదము (8 గణములు) ఆటవెలది 2 పాదములకి సరిపోయేటట్లు వ్రాయుట గురించి ఈ పాఠములో చెప్పేను. అలా అభ్యాసము చేస్తే ఒక సీస పద్యములో 2 ఆటవెలదులు ఆ క్రింద మరొక ఆటవెలది మొత్తము 3 ఆటవెలదులు వ్రాయవచ్చును.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    ఎంతో ఓర్పుతో , నేర్పుతో , చందస్సు పాఠాలు నేర్పు తున్న, గురువులు ,శ్రీ నేమాని వారికీ , శంకరయ్య గారికీ , ధన్య వాదములు + కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి