17, మే 2012, గురువారం

ప్రత్యేక వృత్తాలు - 5

సుగంధి -
ఇది 15వ ఛందమైన ‘అతిశక్వరి’ లోని వృత్తము. 
ఇది ఉత్సాహ వలెనే ఉంటుంది.

లక్షణములు:
గణములు:  7 హ గణములు 1 గురువు (లేక ర జ ర జ ర)
యతి స్థానము: 9వ అక్షరము
ప్రాస నియమము కలదు.


ఉదా:
వందనమ్ము వేదవేద్య! వాసవ ప్రపూజితా!
వందనమ్ము దేవదేవ!భక్తి పారిజాతమా!
వందనమ్ము జ్ఞానకాంతిభాసురా! పరాత్పరా!
వందనమ్ము సర్వ లోకపాల! పూరుషోత్తమా!


స్వస్తి!
 పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

8 కామెంట్‌లు:

  1. అందమైన పద్య మొక్కటైన చాలు చూడగా
    వందనీయ మౌచు వెల్గు భావయుక్త మైనచో
    నందజేయు చుండు కీర్తి హర్షదీప్తి కర్తకున్
    వందలేల? భావసౌరభంబు లేని పద్యముల్.

    రిప్లయితొలగించండి
  2. అందమైన తోటలోన నాడు నట్టి వేళలన్
    విందుభోజనమ్ముతోడ వేడ్క చేయు తోచునే,
    కొందరైన కూర్మితోడ కూడియున్న వేళలన్
    చిందుచుండు సంతసమ్ము, చెంతచేరి వింతగా.

    రిప్లయితొలగించండి
  3. వేదమేమి చెప్పుచుండె విజ్ఞులార! గాంచుడీ
    సోదరత్వభావమింత చూపఁ గల్గు సౌఖ్యముల్
    భేదమెందు గల్గియుండి ద్వేషబుద్ధి దాల్చుటల్
    కాదు మంచిదన్నచో"సుగంధి"యౌను శ్రీహరీ!

    రిప్లయితొలగించండి
  4. పండితార్య! రోజుకొక్క పద్యలక్షణంబులన్
    రండు నేర్చుకొండటంచు రమ్యమైన శైలిలో
    నిండుగా మనంబులోన నిష్ఠబూని నిత్యమున్
    దండిగా వచించు మీరు ధన్యులండి, సన్నుతుల్.

    రిప్లయితొలగించండి
  5. నిండు చంద్రుడేమొ నింగినందు నాట్య మాడగన్
    పండు వెన్నెలంత పిండి పారబోసి నట్టులే
    మెండు కాంతులీను చుండె మేటితార లన్నియున్
    రండు విందు మోదమంద రాగ రంజితమ్ముగా !

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా!
    సుగంధి అనే పేరులోనె ఉందేమో పెన్నిధి. అందరి పద్యాలు అలవోకగా సాగుతూ ఎంతో అందముగా వస్తున్నాయి కదా! అందరికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ మూడు పద్యలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘చేయు తోచునే’ అన్నదాన్ని ‘చేయుచుండగా’ అనీ, ‘చిందుచుండు’ను ‘చిందులాడు’ అని మార్చితే బాగుంటుందని నా సూచన.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. ‘నిండు చంద్రుడేమొ వెల్గి నింగి నాట్య మాడగన్’ అందాం.
    ‘రండు విందు మోదమంద’ అన్నదాన్ని ‘రండు రండు మోదమంద’ అందాం.

    రిప్లయితొలగించండి