3, మే 2012, గురువారం

సమస్యాపూరణం - 693 (వారకాంతా విమోహమున్)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

19 కామెంట్‌లు:

  1. నాదు భాగ్యంపు రాశివై నావు చెలియ
    యనుచు రేయెల్ల వలపుల మునిచి తేల్చి
    యలసి నిద్రించు పతిచేష్ట దలచి తెల్ల-
    వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  2. భగవదారాధనంబును, పగలు రాత్రి
    దానధర్మాలు చేయుచు ధన్యుడగుచు
    స్వర్గసుఖములు గోరెడు భర్తృదివిజ
    వారకాంతావిమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  3. పతి చెప్పు పురాణమును సతియె వినెను
    భాగవతమున కృష్ణ భగ వాను లీల
    లందున రస రమ్యముగాను యాదవ పరి
    వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  4. పతి చెప్పు పురాణమును సతియె వినెను
    భాగవతమున నల్లరి వాసు దేవు
    కోరి కొనియాడి విహరించు గొల్లల పరి
    వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  5. తులువ పని యని భావించి త్రోసి పుచ్చె
    వార కాంతా విమోహమున్ , భార్య మెచ్చె
    మగని ఇంద్రియ నిగ్రహం బ పటిమమును
    వార కాంతల నెయ్యము వలదు వలదు

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ ‘స్వకాంతా విమోహం’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘దివిజ వారాకాంతా వ్యామోహమా?’ మీ పూరణలోని చమత్కారం అలరించింది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గోపికాలోలుని కథలను మెచ్చని దెవరు? ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    సవరించిన తర్వాత కూడా మొదటిపాదంలో గణదోషం. ‘పతి పఠించు పురాణమున్ సతియె వినెను’ అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘నిగ్రహంబ యచలమని’ అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  7. ఏమి తపములు జేసిన నేమి ఫలము
    చెలియ ప్రేమను మించిన చెలువ మేది ?
    దివిజ లోకాల తేలించు దీప్తి జాలు
    వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె !

    రిప్లయితొలగించండి
  8. పారిజాతమ్ము నీకిత్తు భామ మాను
    మలుక, దాసుని నేరము చెలియ చెల్లు
    దండమున ననె కృష్ణుడు తనకు తని-
    వార, కాంతా విమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా! గణదోషమునకు చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు.సవరణతో...

    పతి పఠించు పురాణమున్ సతియె వినెను
    భాగవతమున నల్లరి వాసు దేవు
    కోరి కొనియాడి విహరించు గొల్లల పరి
    వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  10. భార్యయొక్క అమూల్యమైన ప్రేమను పొందినానని ఒక పురుషుడు వారకాంతతో చెప్తున్నట్లుగా ........

    నిర్మలంబైన నీప్రేమ నిరతముగను
    కోరివచ్చితినన్ను చేకొనుమటంచు
    వేడగా చేరి నాకుసంప్రీతినొసగె ( తన భార్య )
    వారకాంతా! విమోహమున్ భార్య మెచ్చె.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సతీసుమతి :

    01)
    ___________________________________


    వారకాంతా విమోహమున్ - భార్య మెచ్చె
    గాన కౌశికు తలపైన - గంప లోన
    నిలిపి వారకాంతను జేర్చ - నిశ్చయించి
    కారు చీకటి వర్షమ్ము - క్రమ్ము కొనిన
    కాళరాత్రిని సుమతియె - కదలె గనుడు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలో కవితా దీప్తి జాలువారుతున్నది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘దాసుని తప్పులు దండముతో సరి’ అన్న మీ పూరణ తనివార జేస్తున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    విరుపును సంబోధనగా మార్చిన మీ నైపుణ్యం కొనియాడదగింది. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ఈ సమస్య నిస్తున్నప్పుడే అనుకున్నాను ఎవరో ఒకరు ‘సుమతి’ ప్రస్తావన తెస్తారని! ఆ పని మీరు చేసారు. ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ధన్యవాదాలు
    మూర్తి గారూ ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి