4, మే 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 694 (భర్త యనుకొని దొంగను)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

భర్త యనుకొని దొంగను బాఁదె నతివ.


ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు. 

17 కామెంట్‌లు:

  1. చోరు డొకరాత్రి ఇంటను దూరినపుడు
    మగడు లేకుంట, తానేమొ మగువ యగుట
    శక్తిగా మారి "శంకర! సకలభువన
    భర్త!"యనుకొని, దొంగను బాదె నతివ

    రిప్లయితొలగించండి
  2. మోకులమ్మకు లోకువ మొగుడెపుడును
    చోరు డొక రాత్రి యింటిలో చొరబడగను
    భర్త యనుకొని దొంగను బాఁదె నతివ
    చావు తప్పగ నాతడు బావురుమనె

    రిప్లయితొలగించండి
  3. దొంగిలించిన పడతికి తోడుదొంగ
    భర్త యనుకొని దొంగను బాఁదె నతివ.
    దొంగ దంపతులిరువురు దోచుకున్న
    సొమ్మునెల్ల సమర్పించి సొమ్మసిలిరి.

    రిప్లయితొలగించండి
  4. రేయిపవలను భేదమ్ము లేక సకల
    కష్టములకోర్చి జేర్చిన కలిమి యంత
    చోరుడపహరణముజేయ దూరు తనను
    భర్త, యనుకొని దొంగను బాదె వనిత.

    దూరు = దుర్భాషలాడు, నిందజేయు, నిందించు,

    రిప్లయితొలగించండి
  5. భర్త రక్షక భటుడు, భార్య నాడు
    ఒంటి నుండగ చోరుడా యింట దూరె
    లాఠి బట్టుక వాడిని లాగి తానె
    భర్త యనుకొని దొంగను బాఁదె నతివ.

    రిప్లయితొలగించండి
  6. పాక గేహము నాఁకొని వీక తోడ
    మంచు పెట్టెను సారించ మధ్య రాత్రి
    పథ్య మెన్నడుఁ బాటింప బాటు పడని
    భర్త యనుకొని దొంగను బాఁదె నతివ !

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ___________________________________


    పరమ ధార్మిక వర్తనా - పరుడు గాన
    పట్టుబడినట్టి దొంగను - తిట్టకుండ
    వదలి వేయును సొమ్ముతో - పరమ కరుణ
    భర్త యనుకొని; దొంగను - బాఁదె నతివ !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  8. ప్రేమ మీ రగ సిగ్గున బిలువ సాగె
    భర్త యనుకొని దొంగను , బాదె నతివ
    దొంగ గాజేయ నగలన్ని , దుడ్డు తోడ
    తప్పు జేసిన దండమే తగిన శిక్ష .

    రిప్లయితొలగించండి
  9. అలికిడేమిటి నడిరేయి యనుచు భార్య
    పతిని లేపియు గదిదాట, బైట దొంగ
    కంటఁబడి పారిపోజూడ,వెంట గలడు
    భర్త యనుకొని దొంగను బాదె నతివ

    రిప్లయితొలగించండి
  10. భార్యా బాధితుడనైన నా సొంత గొడవ:
    భర్త యనుకొని దొంగను బాఁదె నతివ
    కాదనితెలిసి విలపించె కలహకంఠి
    ఇట్టె చేజారె “ఛాన్స౦”చు పట్టు బట్టి
    గట్టిగా బాదె నామగని కట్టె విరుగ!
    మనవి: మూర్తి మిత్రులు మా ఇంట్లో చెప్పకుండుగాక!

    రిప్లయితొలగించండి
  11. భర్త యనుకొని దొంగను బాదె నతివ
    ఒక్క దినమైన దొరికెను దిక్కు పతికి
    కక్ష గట్టిన యాదొంగ తక్ష ణమ్ము
    భర్త నేనౌత జూడుము పంక జాక్షి
    ఉలికి పడి దెబ్బనయ మనె కలికి భర్త !

    రిప్లయితొలగించండి
  12. గణ దోష సవరణతో...
    తనను తానే భర్తగా (పోలీసుగా)ఊహించుకున్నదని నా భావం.

    భర్త రక్షక భటుడేను భార్య నాడు
    ఒంటి నుండగ చోరుడా యింట దూరె
    లాఠి బట్టుక వాడిని లాగి తానె
    భర్త యనుకొని దొంగను బాఁదె నతివ.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు చంద్రశేఖర్ గారూ ! పురాణ పురుషులకే తప్పలేదు. మానవమాత్రులము ! కోపాగారములో విషయములను కోపాగారములోనే ఉనికి చేయడ ముత్తమము !

    జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
    ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిర మచ్చో వామ పాదంబునం
    దొలఁగం ద్రోచె లతాంగి ; యట్ల యగు నాథు ల్నేరము ల్సేయఁ బే
    రలుకం జెందిన కాంత లెందు నుచిత వ్యాపారముల్ నెర్తురే !

    ముక్కు తిమ్మనలు, మూర్తి మిత్రులకు చెప్పవలసిన విషయాలు కావివి.

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్సులు.
    ఈనాటి సమస్యను వైవిధ్యంగా ఎన్నో రకాలుగా పూరించడానికి అవకాశం ఉంది. అందరూ నేనూహించినట్లే చక్కని పూరణలిచ్చారు. అందరికీ ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘సకలభువనభర్త’ను స్మరించిన అతివను గురించి చెప్పారు. బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    భార్యాబాధితుడి గురించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    తోడుదొంగ అయిన చోరిణి భర్తను కొట్టిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి విరుపుతో చమత్కారాన్ని సాధించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అపర భర్తగా మారిన భార్య గురించిన మీ పూరణ (సవరణతో) చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ డాక్టర్లతో ఎప్పుడూ ఈ పథ్యాల గోల.... :-)
    మంచి చమత్కారంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    భర్త కరుణామయిడైతే భార్యను కఠినురాలిని చేసారు. బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పొరపాటును గ్రహించిన అతివ ప్రతిక్రియను చక్కగా వర్ణించారు. చక్కని పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాది విలపించి మళ్ళీ బాదింది. చమత్కారంతో మీరు మమ్మల్ని బాదారు. చక్కని పూరణ. అభినందనలు.
    ఎంతకాలానికి పునర్దర్శనం? సంతోషం!
    ‘భార్యా బాధితుడ’ అన్నప్పుడు గణదోషం (యతిదోషం కూడా!). ‘భార్యచే బాధితుడను నా స్వానుభవము’ అందామా? :-)
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    నిర్దోషంగా చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదాలు, మాస్టారూ. "భార్యా బాధితుడనైన నా సొంత గొడవ:" అన్న మాటలు పద్యంలో భాగం కాదు. ముందుగా చెబుదామనుకొన్న మాటలు మాత్రమే.

    రిప్లయితొలగించండి
  16. డా. మూర్తి మిత్రమా! మంచి పద్యం చెప్పారు. గురుతుల్యులు, దుర్భిణి వేసి మరీ చూడగల సమర్థులు. అందుచే ముందే ఒక నమస్కారబాణం విసిరాను:-)

    రిప్లయితొలగించండి
  17. చంద్రశేఖర్ గారూ,
    అదీ పద్యంలో భాగమే అనుకున్నాను సుమీ! మీరు ఆ లైను తరువాత ఒక లైన్ ఎడం ఉంచితే పొరబడడానికి అవకాశం ఉండక పోయేది....

    రిప్లయితొలగించండి