12, మే 2012, శనివారం

సమస్యాపూరణం - 702 (అధిక రక్తపు పోటు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.

29 కామెంట్‌లు:

  1. రక్త పోటది మొండిది రాని వారు
    లేరు శాశ్వత వైద్యము లేదు చూడ
    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు
    వైద్యునకు మందు లమ్మెడి వార్కి సతము.

    రిప్లయితొలగించండి
  2. క్రోధ మనియెడి శత్రువు కువలయమున
    కీర్తి నడగించు, కలిగించు నార్తి మరియు
    నధిక రక్తపుపోటు, సౌఖ్యమ్ము గూర్చు
    శాంత గుణమది చూడగ జనుల కెపుడు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు. రక్తపోటు అనే సమాసము సాధువు కాదు. పరిశీలించి సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. కఠిన చిత్తము , గోపము కలుగ జేయు
    అధిక రక్తపు పోటు, సౌఖ్యమ్ము గూర్చు
    శాంతి సహనముల్మ రియును సాను భూతు
    లాయు రారోగ్య సంపద లన్ని యిచ్చు .

    రిప్లయితొలగించండి
  5. అధిక రక్తపు పోటు, సౌఖ్యమ్ము గూర్చు
    శ్రమ విహీన జీవనములు , రక్త మందు
    హెచ్చు చక్కెర , క్రొవ్వులు మెచ్చ రెచట
    వైద్య బృంద మాలింపరే ! వాదు లేల !!

    వ్యాయామము చేయడము , రక్తపు పోటు, చక్కెర, ఖొలెష్టరాలను అదుపులో పెట్టడము , ధూమ పానము చేయక పోవడము శరీరానికి మంచివి. శ్రమ లేకుండా హాయిగా కుర్చీలో యెల్లవేళల కూర్చోవడము మంచిది కాదు .

    రిప్లయితొలగించండి
  6. అధిక రక్తపు పోటు సౌఖ్యంబు గూర్చునే?
    యను పాదమున మృగ్యమయ్యెను యతి
    అధిక రక్తపు పోటు వ్యాధియై మేనికి
    తలపగ రాని బాధలను గూర్చు
    అధిక రక్తపు పోటు స్వాంతమ్మునకు జిచ్చు
    వలె కోపతాపాల ప్రబలజేయు
    అధిక రక్తపు పోటు హరియించు తేజమున్
    పరిణమించు ప్రబలవైరి యట్లు
    అట్టి వ్యాధి రాకుండెడి యట్టి రీతి
    తగిన వ్యాయాయములను నిత్యమును జేయు
    చుండుడీ కోపతాపాల జోలికి జన
    కుండుడీ శాంతి సౌఖ్యాల నొంద గలరు

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నేమాని మహాశయులకు నమస్సులు. పద్య పాదంలో "అ" కి "ఖ్య" లో య కి యతి కుదిరినట్లేగా? కాదంటారా" మీ పూరణలోని క్రింది పాదములే నా ప్రశ్నకు మూలము.
    "అధిక రక్తపు పోటు సౌఖ్యంబు గూర్చునే?
    యను పాదమున మృగ్యమయ్యెను యతి"

    రిప్లయితొలగించండి
  8. అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు
    నరచి పబ్బము గడుపుకొన్నారమనుచు
    విర్ర వీగు యన్నలకును వీరువార
    లంచు తారతమ్యము లేని అక్కలకును!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
    అధిక లోని అ కు సౌఖ్యంబులో సౌ కి యతి కుదురదు అనే నేను నా సీస పద్య పాదములో యతిలేకుండా వ్రాసి ఆ భావముతో ఆ పాదమును నింపేను. సమస్యగా నిచ్చిన తేటగీతి పాదములో యతికి ఢోకా లేదు. గ్రహించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. సీ.
    అణచివేయును శక్తులధిక రక్తపు పోటు
    సౌఖ్యమ్ము గూర్చునా? జగతిలోన?
    జవసత్వములు ద్రుంచి సారహీనుని జేయు
    నంతర్గత వివేక మణచివేయు
    వ్యాధులెన్నింటినో వరుసన బుట్టించి
    కుప్పగూల్చును దేహ, మప్పటికిని
    తృప్తి చెందగలేక దీప్తులు హరియించి
    జీవచ్ఛవంబుగా జేయు నరుని
    తే.గీ.
    బహువిధంబులుగానిట్లు పలుకనేల,
    దాని మించిన పోటొండు ధరణిలోన
    కానరాబోదు మరి పగవానికైన
    నధిక రక్తపు పోటెప్పు డంటరాదు.

    రిప్లయితొలగించండి
  11. రక్త నాళా ల తలపులె రగిలి పార
    పోటుగామారిమనిషిని కాటు వేయు
    ధ్యాన మన్నది మనసు నోదార్చ, తగ్గు
    అధిక రక్త పోటు, సౌఖ్యమ్ము గూర్చు

    రిప్లయితొలగించండి
  12. వంట రుచులను పెట్టరు వంక లేమి
    విసరి కసరరు రోగమ్ము పెరుగు ననుచు
    మగువ కెప్పుడు చూడగా మగని కున్న
    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.

    రిప్లయితొలగించండి
  13. వంట లందున రుచులకు కంట గించు
    ఉరగాయలు కుదరవు కోరి తినగ
    ఉప్పు కారము వీడుము చప్పి డనుచు
    ఆడ వారికి పనిదప్పె హాయి గాను
    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు !

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా మీ సూచనకు ధన్యవాదములు.
    కానీ మీరు మీ సీసపద్యంలో అద్భుతమైన మెలిక పెట్టేరు.
    నేను కూడా మీ సీసం చదివి చంద్రశేఖరుల మాదిరే అభిప్రాయపడ్డాను.
    మీవ్యాఖ్య చదివేక అర్థం అయింది దెబ్బ తిన్నానని!

    సవరించిన నా పద్యం:

    లేరు రక్తపు పోటిల లేని వారు
    నేడు, శాశ్వత వైద్యము నిజము లేదు
    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు
    వైద్యునకు మందు లమ్మెడి వార్కి సతము.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ పూరణ బాగుంది. "రుచులను" బదులు "రుచులకు" అంటే నాకు ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తోంది.

    "వంట రుచులను పెట్టరు వంక లేమి
    విసరి కసరరు రోగమ్ము పెరుగు ననుచు

    రిప్లయితొలగించండి
  16. కవి మిత్రులకు నమస్కృతులు.
    ఈనాటి సమస్యకు నేపథ్యం నిన్నటి నా అస్వస్థత. అసలే లోబీపీ. నిన్న మధ్యాహ్నం మరింత దిగజారి పూర్తిగా నిస్సత్తువ ఆవహించింది. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని చమత్కారంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘వార్కి సతము’ కంటే ‘వారి కెపుడు’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    సత్య నారాయణ మూర్తి గారూ,
    మీ మొదటి పూరణలో ‘కలిగించు నార్తి మరియు/నధిక రక్తపుపోటు’ అన్వయం కుదరలేదనిపిస్తున్నది.
    మీ రెండవ పూరణలో ‘అధిక రక్తపు పోటు’ గురించిన వివరాలన్నీ చక్కగా పొందుపరచబడ్డాయి. అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అచ్చమైన డాక్టరుగా స్పందించి చక్కని పూరణ చెప్పారు. సమస్య విరుపు ప్రశంసనీయం. అభినందనలు.
    నాకేమో చాలా కాలంగా ‘లోబీపీ’. ఎవరో ఎప్పుడో సలహా యిచ్చారు “లోబీపీ ఉన్నవాళ్లు ఉప్పు, కారం, మసాలా దినుసులు ఎక్కువగా వాడాలి” అని. దానితో ఉప్పు ఎక్కువగా వాడడం మొదలు పెట్టాను. ఇప్పుడది వ్యసనంగా మారింది. బీపీ ఎట్లా ఉన్నా ఉప్పు అధికంగా వాడడం మంచిది కాదని డాక్టర్లు చెపుతున్నా అలవాటు మానలేక పోతున్నాను.
    *
    పండిత నేమాని వారూ,
    మీ సీదపద్యం మొదటి పాదం చూచి క్షణకాలం నేను కూడా అయోమయంలో పడ్డాను సుమా! వెంటనే విషయం అర్థమయి హాయిగా నవ్వుకున్నాను.
    చాలా మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మన్నించాలి. మీ పూరణను అవగాహన చేసికొనలేకపోతున్నాను. బహుశా నా అనారోగ్యం కారణం కావచ్చు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బీపీ రోగుల తిండి విషయం ఎవరూ ప్రస్తావించలేదేమిటా అనుకుంటుంటే మీ పూరణ ఆ లోటు తీర్చింది. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    రకరకాల వంటలు వండే శ్రమ ఆడవారికి తప్పిందని సంతోషిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    మంచి పట్టే పట్టారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ధన్యవాదములు.
    లక్కరాజు గారూ! ధన్యవాదములు. చక్కని సూచనకు ధన్యవాదములు..సవరణతో...

    వంట రుచులకు పెట్టరు వంక లేమి
    విసరి కసరరు రోగమ్ము పెరుగు ననుచు
    మగువ కెప్పుడు చూడగా మగని కున్న
    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.

    రిప్లయితొలగించండి
  18. ఒక్కొక్క సారి అతి మూమూలు చిన్న పదాలు కూడా తట్టవు. సరస్వతీ కటాక్షం సరిపోక. గురువుగారూ ధన్యవాదాలు మీ సూచనకు.
    మీ ఆరోగ్యమే మా మహా భాగ్యం అన్న విషయాన్ని మర్చి పోవద్దు.

    రిప్లయితొలగించండి
  19. నా దేశమున పూర్వ నాగరికత జూడ -
    నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
    నా దేశ సంస్కృతి నాణ్యమ్ము నెరుగగా -
    నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
    నా దేశ మహనీయ నాయకులను గాంచ -
    నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
    నా దేశ సంస్కార మాదర్శము లెరుంగ -
    నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!

    నాదు జన్మ భూమి ఘన సౌందర్య దీప్తి,
    నాదు దేశ పతాక ఔన్నత్యము గన -
    నిజము! మేనిపై రోమాలు నిక్క బొడుచు!
    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు!

    రిప్లయితొలగించండి
  20. డా. ఫణీంద్ర గారి సీస మద్భుతము.

    ' నాదు దేశ పతాక ఔన్నత్యము గన -' ఇక్కడ పతాకౌన్నత్యము గన అని వృధ్ధి సంధి రావా లేమో కదండీ

    గురువు గారూ ఎక్కువ ఉప్పు వాడుక మంచిది కాదు. నా రక్త పీడనము కూడా తక్కువే. ఉప్పు ,కారము నేనూ ఎక్కువ గానే తింటాను. తగ్గించడము నాకూ కష్టమే ! నాకు కోప మెప్పుడూ రాదని నాతో పని చేసే ' ఉపచారికలు ' చెప్పి నన్నుబ్బ చేస్తూంటారు.

    రిప్లయితొలగించండి
  21. గురువు గారూ ! మీకు కోపము వస్తే గురువమ్మ గారు వంటకాలలో ఉప్పు కారా లెక్కువగా వేసి మిమ్ములని ' శాంత ' పరుస్తారేమో కదా ! :)

    రిప్లయితొలగించండి
  22. నరసింహ మూర్తి గారు!
    పతాక, ఔన్నత్యము .. రెండూ తత్సమాలయ్యాక ఇక సంస్కృత సంధి రాకుండా కూడా ప్రయోగించవచ్చు. ఇది మొన్నటి చర్చలో 'లక్ష్మి వల్లభుడు' లాంటిదే!

    రిప్లయితొలగించండి
  23. డా. ఆచార్య ఫణీంద్రుల వారికి ధన్యవాదములు. అప్పుడప్పుడు తరగతు లెగ్గొట్టడము వలన కలిగిన అనుమానమును తీర్చారు.

    రిప్లయితొలగించండి
  24. మాస్టారూ, మీ లోపం కాదు, నేను కూడా రెండు ముందు మాటలు వ్రాసి పద్యం పోస్టు చేద్దామనుకొన్నాను, కానీ సమయాభావం వల్ల కుదరలేదు. నేపధ్యం ఏమిటంటే - నిన్న మొన్నటి నా భారత దేశ పర్యటనలో కొందరు వ్యక్తులని చూశాను వారి ప్రవృత్తిని సన్నిహితంగా గమనించే అవకాశమూ దొరికింది. కొందరు ఎదుటివారి మీద అరచి వారి పబ్బం గడుపుకొనేవాళ్లైతే, మరికొందరు తారతమ్యం చూడకుండా అందరినీ సూటిపోటి మాటలనే వాళ్ళు. అటువంటి అన్నలకూ, అక్కలకూ రక్తపోటు సౌఖ్యదాయకమే అని గమనించాను. వారికి దానిని కంట్రోల్ చేసుకోవాలని కూడా లేదు. లోకోభిన్న రుచి: వారికిదే మంత్రం - శాంతి రస్తు, పుష్టి రస్తు.

    రిప్లయితొలగించండి
  25. అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు
    నరచి పబ్బము గడుపుకొన్నారమనుచు
    విర్ర వీగు యన్నలకును వీరువార
    లనెడి తారతమ్యము లేని అక్కలకును!

    రిప్లయితొలగించండి
  26. ఆర్యా!
    నమస్కారములు. నా పూరణలో "కీర్తి నణచుట,ఆర్తి మరియు అధికరక్తపు పోటులను కల్గించుట" అనునవి క్రోధగుణములుగా భావించి చెప్పటానికి ప్రయత్నం చేశాను. అన్వయం కుదరలేదన్నారు. మరోలా ప్రయత్నిస్తాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీపతిశాస్త్రిఆదివారం, మే 13, 2012 6:49:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.
    ననుచు వైద్యము మానుట న్యాయమగునె
    వైద్యు డొసగెడు గుళికలి వాడినంత
    ఉపశమీంచుచు నారోగ్య మొసగు నిజము.

    రిప్లయితొలగించండి
  28. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మన దేశ సర్వతోముఖ ఔన్నత్యాన్ని గురించిన మీ పద్యం చదివినప్పుడు నరనరాల్లో రక్తం ఉప్పొంగింది. ధన్యవాదాలు.
    *
    నరసింహ మూర్తి గారూ,
    మా ఆవిడకు హైబీపీ. కూరల్లో ఉప్పూ కారమూ తక్కువే! అయితే నాకు వడ్డించినప్పుడు తప్పకుండా ఉప్పు డబ్బా ముందు పెట్టి ‘ఇక కుమ్మరించుకో’ అంటుంది!
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ వివరణ చూసాక పద్యభావం అవగత మయింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి