13, మే 2012, ఆదివారం

సమస్యాపూరణం - 703 (సినిమాలను జూచువాఁడు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

సినిమాలను  జూచువాఁడు  శ్రీమంతుఁ డగున్.


ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. వనమాలి యిచ్చె లక్ష్మికి
    వినూత్నమగు మాల నొకటి ప్రేముడి మీరన్
    వినతుల నిడుచు కమలవా
    సిని మాలను జూచువాడు శ్రీమంతుడగున్

    రిప్లయితొలగించండి
  2. దినదినము నీ రసించును
    సినిమాలను జూచు వాడు , శ్రీ మంతు డగున్
    సినిమాల జోలి పోవక
    వినయముగా వేంకటేశు వేడిన యెడ లన్

    రిప్లయితొలగించండి
  3. కనుమీ వనితల భక్తిని
    మనమున ధ్యానించి భవుని మానస పూజల్ !
    వినయముగ ప్రణతు లిడుసువా
    సిని మాలను జూచు వాడు శ్రీ మంతుడగున్ !
    -------------------------
    మాల = పంక్తి, వరుస

    రిప్లయితొలగించండి
  4. సినిమాలు తీయ నాంగ్లపు
    సినిమాలను జూచు, వాఁడు శ్రీమంతుఁ డగున్
    సినిమాను మార్చి మరి కా
    సిని మాసాలాలజల్లి చిత్రము దీయన్.

    రిప్లయితొలగించండి
  5. అనయము భక్తిపరుండై
    ఘనముగ జగదంబఁదలచి కంజాన్వితమౌ
    మునిజనహృదయాంతర్వా
    సిని మాలను జూచువాడు శ్రీమంతుడగున్.

    రిప్లయితొలగించండి
  6. కూతురి పెళ్ళిచూపులకు ముందు "మాల" తండ్రి:

    అనుమానము వల దింతీ
    కనుగొంటిని వివరములఁ గలగినవారల్
    కనుక పిలిచితి, మనోవా
    సిని! మాలను జూచువాడు శ్రీమంతుడగున్.

    రిప్లయితొలగించండి
  7. ఘనమగునెనిమిదిరూపము
    లనుదాల్చినదైన యష్టలక్ష్మీదేవిన్,
    ఘనతర సుందర ధరహా
    సిని,"మా" లను జూచువాడు శ్రీమంతుడగున్.

    " మా" అంటే లక్ష్మి దేవి యని ఏకాక్షర నిఘంటువులో ఉందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  8. మనపౌరాణిక కథలను
    ఘనముగనిర్మించినారు గతమునద్రష్టల్
    మనముప్పొంగున్నేడా
    సినిమాలను జూచువాడు శ్రీమంతుడగున్!!!

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని పూరణ. అభినందనలు.
    కాకుంటే మూడవ పాదంలో గణం తప్పింది. ‘వినయముగ నతు లిడు సువా...’ అంటే సరి!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇంగ్లీషు సినిమా చూసి ఆ కథకు కాస్త మసాలా కలిపి సినిమాలు తీసి హిట్లు కొట్టి శ్రీమంతులైనవారు చాలామంది ఉన్నారు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని ‘మసాలా’ మాసాలా అయిందే?
    ‘కా/సిని ఘటనల జేర్చి క్రొత్త చిత్రము దీయన్’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘మునిజన హృదయాంతర్వాసిని’ అన్న మీ పూరణ ‘కవి జన గణ హృదయోల్లాసిని’గా ఉంది. అద్భుతమైన పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    మాల తండ్రి అంత ఎక్కువ కట్నం ఇస్తున్నాడా? బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    లక్ష్మీదేవి అష్టమూర్తులను ‘మాలు’ చేసిన మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    నిజమే. గతంలో వచ్చిన పౌరాణిక చిత్రాలు భక్తి భావాన్ని పెంపొందించేవిగా ఉండేవి. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మనసు కదిలించు కథలతొ
    సునిసిత "హాస్య",కళ" గలియ చూడవలయు తా
    ధనమును పొదుపుగ వాడన్
    సినిమాలను జూచు వాడు, శ్రీమంతుండగున్!
    (క్రమాలంకారం)

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు.యెక్కువ మసాలాలు అనుటకు "మస్సాలాలజల్లి " అంటే యెలా ఉంటుందంటారు..

    రిప్లయితొలగించండి
  12. సినిమాలకు వ్యాఖ్యలు వ్రా
    యు నతడు చూడ౦గ వలయు నొక చిత్రంబై
    నను నిత్యము కాన బోలెడు
    సినిమాలను జూచు-- వాడు శ్రీమంతుడగున్!
    చిన్నమాట: కాఫీ త్రాగుతూ, మా వాడికి ఈ సమస్య చదివి వినిపించినపుడు, "అవును, సినిమాలకి రివ్యూలు వ్రాసేవాడికి డబ్బులు ఇస్తారు గదా, కాబట్టి ఎన్ని సినిమాలు చూస్తే అంత డబ్బు అన్నాడు, కూల్ గా". అదే నా పూరణ.
    మనవి: "బోలెడు" గ్రాంధికం కాదు కానీ పూరణ సబ్జెక్టు అలాంటిది కాబట్టి కొంచెం తేలిక పదమే వాడాను.

    రిప్లయితొలగించండి
  13. అనయము క్షుద్రమ్ము లయిన
    చెనటి సినీమాల జూచి చెడిపోవచ్చున్
    ఘనమైన కళాత్మకమౌ
    సినిమాలను జూచు వాడు శ్రీమంతుడగున్.

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    క్రమాలంకార పద్దతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదం చివర ‘తొ’ అన్నారు. దానిని ‘తో’ అనే ప్రయోగించాలి.
    ‘మన మలరించు కథలతో’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘మసాలా’ మన పదం కాదు. అధికమైన మసాలా అనే అర్థంలో ‘మస్సాలాలు’ అనడమూ సమంజసం కాదు.
    *
    ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మంచి పట్టే పట్టారు. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. బహుశా ‘కన’ కు ‘కాన’ టైపాటు కావచ్చు..... ‘నను నిత్యము కన బోలెడు’
    ‘బోలెడు’ శబ్దం గ్రాంధికమే. దానికి శబ్దార్థ చంద్రిక ‘లెక్కపెట్టలేనన్ని’ అనే అర్థాన్ని ఇచ్చింది.
    *
    కమనీయం గారూ,
    సదసచ్చిత్రాల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. సీరియళ్ళు చూసు వాడు డైరెక్టరగున్
    పత్రికలు చదువు వాడు ఎడిటరగున్
    బ్లాగులు చదువు వాడు బాగు పడున్
    సినిమాలను జూచువాడు శ్రీమంతుడగున్!


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  16. మాస్టారూ, టైపాటు దిద్దినందులకు ధన్యవాదాలు. మరింకేం బోలెడు చోట్ల బోలెడు వాడవచ్చు :-)

    రిప్లయితొలగించండి
  17. కనుమా! "ఆకలి రాజ్యం"!
    ఘనముగ "శ్రీ శ్రీ" రచించ గారాబముతో
    ననువుగ "శ్రీ దేవి" నటిగ
    సినిమాలను జూచువాఁడు "శ్రీమంతుఁ" డగున్

    రిప్లయితొలగించండి
  18. తినుటకు తిండియు లేకయె
    పనిపాటులు లేక మెండు వ్రాయుచు కథలన్
    ధనమును కోరుచు కలలో
    సినిమాలను జూచువాఁడు శ్రీమంతుఁ డగున్

    రిప్లయితొలగించండి


  19. అనుమానమేల కవిరాట్
    చనిరా మద్రాసునగర చట్టసభలకే
    పని లేని పిల్ల గాండ్రే
    సినిమాలను జూచువాఁడు శ్రీమంతుఁ డగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి