19, మే 2012, శనివారం

ప్రత్యేక వృత్తములు - 7

తోటకము -

ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1756వ వృత్తము.
"కమలా కుచ చూచుక కుంకుమతో" అనే శ్లోకము మనలో చాలమందికి తెలుసును కదా.  అది తోటక వృత్తమే.

లక్షణములు:
గణములు - స స స స 
యతి స్థానము - 9
ప్రాస నియమము కలదు.


ఉదా:
రమాత్మవు నీవనిక్తిమెయిన్
నిరతంబును గొల్తును నీ పదముల్
రణాగత వత్సల సారనిధీ!
రితార్థను రామ! ప్రన్న గుణా!
IUU- I I  U- I   I  U-I    I  U
 స   -    స   -     స    -     స 


మంచి లయతో గమనముతో అలరారే ఈ పద్యము ఎంతో బాగున్నది కదూ.  ప్రయత్నించండి.  స్వస్తి.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

20 కామెంట్‌లు:

  1. హరినైనను శంకరునైన ప్రభూ!
    కరుణామయ! భక్తులఁ గావుమటం
    చరుసంబున వేడుటకై భువిలో
    వరమైనది తోటక పద్యమికన్.

    రిప్లయితొలగించండి
  2. అనిలాత్మజు మ్రొక్కెద నాదరమున్
    వినయమ్మున నమ్రత వీరుడినిన్
    వనరాశిని దాటిన వానరునిన్
    ఘన భక్తిడి గొల్తును గారవమున్!

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరాచార్యుల వారిపై తోటకాష్టకము సుప్రసిద్ధము.
    సాక్షాత్తూ శివస్వరూపమైన ఆచార్యుల వారిని స్మరిస్తూ...

    దివినెల్లరు మెచ్చెడు దేవునివై
    శివదేవునివై వెలసేవిలలో,
    యవనీతలమందున నందరకున్
    భవసాగరతారణ భవ్యమగున్.

    రిప్లయితొలగించండి
  4. చలిగాలులు వీచిన సందడిలో.
    చెలి మోమున గాంచితి సిగ్గులనే, (చెలికాని పలుకులు )
    కలయో నిజమో మరి కల్పనయో,
    యిలపై దిగె చందురుడిచ్చటనే. ( చెలి పలుకులు)

    రిప్లయితొలగించండి
  5. వినయంబు సమార్జిత విద్యలకున్
    ఘనభూషణమై చిరకాలయశం
    బనయంబు సుఖంబు లనంతములౌ
    ధనరాశులనిచ్చును తథ్యమిలన్.

    రిప్లయితొలగించండి
  6. తమ్ముడు డా. నరసింహమూర్తి చేసిన ప్రయత్నము బాగున్నది. ఆతని భావమునకు అనుగుణముగా పద్యమును ఈవిధముగా సవరిస్తున్నాను.

    అనిలాత్మజు మ్రొక్కెద నాదృతితో
    వినయమ్మున వానర వీరవరున్
    వనరాశిని దాటిన భద్రమతిన్
    వినుతింతు విశేష వివేక నిధిన్

    రిప్లయితొలగించండి
  7. ఈ తోటక వృత్తమును ఎంతో హాయిగా రచించిన మిత్రులకు అందరికీ అభినందనలు. పద్యములు చాల బాగుగా వచ్చుచున్నవి. సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీమతి లక్ష్మీ దేవి గారి పద్యములో కొన్ని సవరణలు చేస్తూ ఈ విధముగా మార్చేను.

    దివినెల్లరు గొల్చెడు దేవ! మహా
    శివమూర్తివి, భూమిని జేరి దయన్
    భవ సాగర తారణ పద్ధతులన్
    వివరించిన నీకు నివే ప్రణతుల్

    రిప్లయితొలగించండి
  9. సవరణ వల్లనే నా భావం పద్యరూపం పొందింది. ముందు వచన కవిత లాగా ఉండినది. కృతజ్ఞురాలను.

    రిప్లయితొలగించండి
  10. భవసాగరమందున భక్తులకై,
    యవతారముదాల్చుచు నాదృతితో,
    భువిపై నడయాడిన పుంగవుకై,
    కవనమ్ముల పల్కుట కష్టమొకో!

    రిప్లయితొలగించండి
  11. జగదంబవు నీవని శాంకరి! హే
    యగజాత! దయాభరితాత్మికగా
    నిగమంబులు పల్కును, నీ ప్రజకున్
    సుగుణంబు లొసంగుము చూపు దయన్.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    విశేషవృత్తాలను పరిచయం చేస్తూ, మిత్రుల పద్యాలను పరిశీలిస్తూ, సవరణలను సూచిస్తున్నందుకు ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నేమాని వారు పెట్టిన మెరుగులతో మీ పద్యం సర్వాంగసుందరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ శంకరస్తుతి బాగుంది. నేమాని వారి సవరణతో మరింత అందంగా తయారయింది. ఇక మీ రెండవ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అన్నయ్య గారు సవరించిన పద్య మద్భుతంగా నుంది. ధన్యవాదములు. గురువు గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. ఇది తోటకమౌ విన నింపొసగున్
    ఇది తేలిక నేర్చుట కెల్లరకున్
    ఇది సాధన జేసిన నెంతొ ముదం
    బెద కన్న గురూత్తము నెన్నుదు నే.

    రిప్లయితొలగించండి
  15. తెలి వెన్నెల దారుల తేరుల లో
    చలి వేళల నేగితి జాబిలి తో .
    గిలి గింతల గాలులు కీరములై
    నులి వెచ్చగ తాకెను నూతన మై
    ------------------------------------------------------------------
    ఘన భక్తిని గొల్చిన కాళిక యే
    కనుపిం చును కన్నుల కాంతుల తో
    విని నంతనె నామము వేలుపు లౌ
    మన మందున ప్రీతిగ మోక్ష మిడున్ !

    రిప్లయితొలగించండి
  16. అక్కయ్య గారి పూరణ పద్యాలు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  17. తమ్ముడు గారూ అప్పుడే బాగున్నాయంటే ఎలా ? ఇప్పుడు గురువు గారు చెప్పాలి అసలు సంగతి ." ఎన్నిదోషాలు ఉన్నాయో ? "
    మీకైతే ధన్య వాదాలు చెప్పాలి మరి

    రిప్లయితొలగించండి
  18. శ్రీమతి రాజేశ్వరి గారి పద్యములో 3, 4 పాదములను ఇలా మార్చితే బాగుంటుంది:

    వినినంతనె నామము ప్రేమ మెయిన్
    జనయిత్రి విమోక్ష మొసంగు కదా!

    రిప్లయితొలగించండి
  19. గురువులు శ్రీ పండితుల వారికి కృతజ్ఞతలతో వేవేల వందనములు . అసలు వ్రాయడమే రాని నాకు ఇంతటి అదృష్టం కలిగి నందుకు భాష సరి పోవడం లేదు . ధన్య వాదములు

    రిప్లయితొలగించండి