20, మే 2012, ఆదివారం

ప్రత్యేక వృత్తములు - 8

స్రగ్విణి -

ఈ నాడు మంచి రాగయుక్తముగా పాడదగిన స్రగ్విణీ వృత్తము గురించి చెప్పుకొందాము.
ఇది 12 వ ఛందమైన "జగతి"లో 1171 వ వృత్తము.


లక్షణములు  : 
గణములు - ర ర ర ర 
యతి - 7వ అక్షరము
ప్రాస నియమము కలదు.


ఉదా:
శ్రీవరా! శ్రీకరా! స్నిగ్ధ హాసాకరా!
దేవలోకస్తుతా! దివ్యరూపాన్వితా!
దేవ దేవా! మహాదేవ  సంభావితా!
రావయా రావయా రామచంద్ర ప్రభూ!


చక్కగా ప్రయత్నించండి, మంచి విందులు గూర్చండి.  స్వస్తి.

పండిత రామజోగి సన్యాసి రావు

29 కామెంట్‌లు:

  1. శ్రీ సతీ సేవితా చింతలం బాపరా
    యాస దేహమ్ముపై నారదేమీ దొరా
    మోస పోచుంటిరా మోహముం బాపరా
    చేసి నన్ ముక్తునిన్ చేదుకో వేలరా

    రిప్లయితొలగించండి
  2. రామ రామా యనన్ రాదురా నాల్కపై
    కామ సర్పమ్ము నన్ కాటు వేసేను రా
    యేమి చెప్పం గల న్నిట్టి నా కర్మమున్
    భామతో గూడి కా పాడరా రాఘవా!

    రిప్లయితొలగించండి
  3. వాణి! కల్యాణి! గీర్వాణి! మా తల్లి! మా
    వాణి యందే శుభంబైన పల్కై , సదా
    పాణి జూపించి భవ్యంబుగా దీవనల్
    రాణి! మాకిచ్చినన్ రక్షయౌ భారతీ!

    రిప్లయితొలగించండి
  4. విత్తమే చిత్తమై విర్ర వీగేనురా
    మత్తులో మున్కలై మంటిలో నుంటిరా
    కత్తులన్ దూయగా కామ షట్కమ్మదే
    చిత్తు చిత్తైతిరా! శ్రీపతీ! బ్రోవరా !

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారి పద్యము 3వ పాదములో "చెప్పంగలన్నిట్టి" ప్రయోగము బాగులేదు. గలను + ఇట్టి = గలనిట్టి అగును. అందుచేత ఆ పాదమును ఇలాగ మార్చుదాము:
    "యేమి యేమందు నేనిట్టి నా కర్మమున్"

    రిప్లయితొలగించండి
  6. సరదాగా ఒక స్రగ్విణీ:

    చాల బాగున్నదే స్రగ్విణీ వృత్తమా
    రాలు నాల్గుండునా రత్నమై వెల్గునా (4 ర గణములు)
    ఏల జాగందుకొమ్మీ కలమ్మున్ బళా
    నాలుగే పంక్తులన్ వ్రాయుమా వేడ్కతో

    రిప్లయితొలగించండి
  7. శ్రీకరంబై సదా చిత్తమందుండు, ర
    త్నాకరున్ పుత్రి, రత్నమ్మునే, కోరెదన్,
    లోకమందెల్ల నే లోపమున్ లేక యా
    నాకమున్ చేయగా నన్ను దీవించుమా!

    రిప్లయితొలగించండి
  8. కోరి యా పర్వతున్ కూతువై పార్వతీ!
    శౌరి చెల్లెమ్మవై సౌరుకే సౌరువై
    చేరి యా శంకరున్ చెల్మి యర్థాంగివై
    గౌరి పాలింపుమీ! కాంత, యీ విశ్వమున్.

    రిప్లయితొలగించండి
  9. గోపికావల్లభా! కోరికల్ దీర్చుమా
    కోపమింకేలనో? కూర్మి జూపించుమా,
    పాపముల్ ద్రుంచుమా, భాగ్యముల్ పెంచుమా
    నీపదాబ్జంబులే నిత్యమర్చించెదన్.

    రిప్లయితొలగించండి
  10. నేమాని పండితార్యా ధన్యవాదములు. చక్కని సవరణ.

    చక్కగా చెప్పిరీ స్రగ్విణీ వృత్తమున్
    మిక్కుడౌ భక్తితో మీరు లక్ష్మీ! భళా
    మక్కువన్ నిల్చుతన్ మాత వాగ్దేవి మీ
    ప్రక్కనే యమ్మరో పల్కు తోడై సదా

    రిప్లయితొలగించండి
  11. పండితార్యా బలే పద్య వృత్తమ్ములన్
    మెండుగా చెప్పుచున్ మీరలుప్పొంగగా
    దండిగా కైతలే ధారలై సాగవా
    మండితంబై చనన్ మంచిగా బ్లాగహో

    రిప్లయితొలగించండి
  12. రంగుగా పల్కిరా స్రగ్విణీ వృత్తమున్
    పొంగుచున్ భక్తితో మూర్తి! మీరచ్యుతున్
    హంగుమై వేడుచున్నందముం జిందుచున్
    నింగిలో రిక్కలన్నిల్చు చంద్రుంబలెన్.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్నగారు,
    భలే ఉన్నాయి మీ వ్యాఖ్యా పద్యాలు.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! మిస్సన్న గారూ!
    మీరు మళ్ళీ అదే విధమైన (అసాధువైన) ప్రయోగము చేసేరు. మీ ఈ 3వ పాదమును పరిశీలించి సవరించండి:

    "హంగుమై వేడుచున్నందమున్ జిందుచున్"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. మీదుపద్యాలహో! మిస్సనార్యా! కవీ!
    మోదమందించె, దామోదరుండెల్లెడన్
    తా దయన్ జూపుచున్ ధన్యతం గూర్చుచున్
    మీద సత్కీర్తులన్ మీకొసంగున్ సదా

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ ఈ పాదమును చూడండి:

    "హంగుమై చేయుచున్ ప్రార్థనల్ స్తోత్రముల్"

    రిప్లయితొలగించండి
  17. శ్రీ హరి....మూర్తి గారూ! శుభాశీస్సులు.
    మీదు అనే ప్రయోగమును వీలైనంత మానివేస్తే మంచిది. "దుగామమును" నీ, నా, తన లకు మాత్రమే వాడుట మంచిది. కొందరు కవులు మీ, మా, తమలకు కూడా వాడుచున్నా - అంత ప్రయోగయుక్తము కాదు అని మేము చిన్నప్పుడు గురువులనుండి తెలుసుకొనినాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. గురుతుల్యులు శ్రీనేమాని వారికి,
    ఆర్యా!
    నమస్కారములు.
    మంచి సూచనను ఇచ్చారు. పాటించగలవాడను.
    పై పద్యం మొదటి పాదాన్ని
    "మీది సద్యత్నమో మిస్సనార్యా! కవీ!"
    అను విధంగా మారుస్తున్నాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. నేమాని పండితార్యా క్షమించండి. మీ సూచన బాగుంది.
    కానీ యతి మీద అనుమానంగా ఉంది నా చిన్న బుర్రకు.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! మిస్సన్న గారూ! హకి ప్రార్థనతో యతి కుదురుతుందా? అని మీ సందేహము. ప్ర + అర్థన అని విడదీసి చూడండి అప్పుడు చెప్పండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. సాంద్ర మందుండి సాక్షాత్తు శ్రీలక్ష్మి వై
    ఇంద్ర లోకాలు పూజించు శోభంకరీ
    చంద్ర బింబాననా చారు నీలోత్పలీ
    చంద్ర కాంతా మణీజాహ్నవీ వందనం !

    రిప్లయితొలగించండి
  22. వేద విజ్ఞానమున్ విస్తృతిన్ జేయరే
    మేదినిన్ నింపరే మేలు ధర్మంబులన్
    మోదమున్ బెంచరే మోహముల్ వీడుచున్
    వాదు లేకుండగా స్వామిఁ గీర్తింపరే

    రిప్లయితొలగించండి
  23. నేమాని పండితార్యా నమోన్నమః ధన్యవాదాలు.

    meesoochana meraku savarinchina padyam:

    రంగుగా పల్కిరా స్రగ్విణీ వృత్తమున్
    పొంగుచున్ భక్తితో మూర్తి! మీరచ్యుతున్
    హంగుమై చేయుచున్ ప్రార్థనల్ స్తోత్రముల్
    నింగిలో రిక్కలన్నిల్చు చంద్రుంబలెన్.

    రిప్లయితొలగించండి
  24. అమ్మా శ్రీమతి రాజేశ్వరి గారూ!
    మీరు స్రగ్విణీ వృత్తము వ్రాయుటకు చేసిన ప్రయత్నమునకు అభినందనలు. కానీ ఆ పద్యమును సవరించుటకు కూడా వీలు లేకుండా యున్నది. అందుచేత మరొక ప్రయత్నము చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు వందనాలు.
    సమయాభావం వల్ల నిన్నటి పద్యాలను, పూరణలను పరిశీలించలేకపోయాను. సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను ప్రకటిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారూ,
    ఈ రోజు మీలో కవితావేశం ఉప్పొంగినట్లుందే! చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు.
    నేమాని వారి సూచనలను గమనించారు కదా. సంతోషం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ మూడు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    "కోరి యా పర్వతున్" అన్నదాన్ని "కోరి శీతాద్రికిన్" అంటే బాగుంటుందేమో?
    *
    పండిత నేమాని వారూ,
    నాలుగు రాళ్ళను కలిపి రత్నాnni చేసారు. నిజంగా మీ పద్యం రత్నమే. ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    అద్బుతమైన పద్యాలను చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. నేమాని వారన్నట్టు మీ పద్యం నాకూ సవరణకు లొంగడం లేదు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. గురువు గారు, బాగున్నది. పర్వతుని కూతురు పార్వతి అని చెప్పాలని ప్రయత్నించాను కానీ. మీ సవరణ బాగున్నది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ ధన్యవాదాలు.
    కాస్త తీరిక దొరికితే కవితావేశం పొంగిపోతుందన్న మాట.
    ఆదివారం కదా. అదండీ సంగతి.

    రిప్లయితొలగించండి