23, మే 2012, బుధవారం

‘శివాని’ శబ్ద చర్చ

మిస్సన్న గారు చెప్పిన వనమయూరము .............

    నీ పద సరోజముల నీడయె భవానీ
    ఆపదల బాపి యిడు హాయిని శివానీ
    కోపమును బూనకుము క్రూరులని మాపై
    పాపలము తల్లి యెడ బాయకుము నీవై.

* * * * * * * * *
పండిత నేమాని గారు చెప్పారు...
    అయ్యా శ్రీ మిస్సన్న గారూ!
    శివా అంటేనే పార్వతీదేవి. సంస్కృతములో శివా అనే శబ్దము చివరి దీర్ఘము తొలగగా తెలుగులో శివ అవుతుంది. అంటే శివ అనే పదము శివ పార్వతులకు ఇద్దరికీ అన్వయించును. శివానీ అనే ప్రయోగము సాధువు కాదు. మృడానీ, రుద్రాణీ, బ్రహ్మాణీ, ఇంద్రాణీ అనే పదములు సాధువులే. స్వస్తి.

* * * * * * * * * *
కంది శంకరయ్య చెప్పారు...
    పండిత నేమాని వారూ,
    ‘శివాని’ శబ్దం సాధుప్రయోగం కాదన్నారు. శివుడు శబ్దానికి ‘సాధువుల హృదయమున శయనించువాడు, మంగళప్రదుడు’ అనే వ్యుత్పత్త్యర్థాలున్నాయి. ఆవిధంగా శివ శబ్దానికి సాధువుల హృదయమున శయనించునది, మంగళప్రద’ అని అర్థం చేసికొన వచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ‘శివాని’ శబ్దానికి శివుని భార్య, పార్వతి అని అర్థాలిచ్చింది. పర్యాయపద నిఘంటువులో పార్వతికి శివ, శివాని రెండు పదాలూ ఇచ్చింది.

* * * * * * * * * *
పండిత నేమాని గారు చెప్పారు...
అయ్యా! డా. ఏల్చూరి మురళీధర్ గారూ! శుభాశీస్సులు.
    శంకరాభరణము బ్లాగులో ఈ మధ్య మీరు కనబడుట లేదు.  మాకు ఎంతో వెలితిగా నున్నది.  మీరు అప్పుడప్పుడైనా వీలుచేసికొని బ్లాగుకి కొంత టైము కేటాయించండి. 
    ఈ బ్లాగులో శ్రీ మిస్సన్న గారు శివాని అనే పదము వాడితే నేను సాధువు కాదేమో ననే  అభిప్రాయమును వెలిబుచ్చేను. నేను పూర్వము ఆవిధముగా వినినాను. నాది కేవలము శ్రుతపాండిత్యమే.  శ్రీ శంకరయ్య గారు ఆ అభ్యంతరమును త్రోసిపుచ్చేరు.  సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు శివాని పదమును సమర్థించింది అన్నారు.  మీరు మరి కొంచెము విపులముగా మాకు తెలియజేయ గలరు. స్వస్తి! 
ఇట్లు
మీ శ్రేయోభిలాషి,
నేమాని రామజోగి సన్యాసి రావు

* * * * * * * * *
డా. ఏల్చూరి మురళీధర్ గారు చెప్పారు......
పూజ్యశ్రీ గురుదేవులకు
విహితానేకప్రణామములతో,
మీ లేఖను చదివి ఎంతో సంతోషమైంది. అత్మీయమైన మీ కుశలానుయోగానికి ధన్యవాదాలు. కోరిక ఎంత ఉన్నా తీరిక ఏ మాత్రం లభింపక ఇటీవల శ్రీ శంకరాభరణం బ్లాగును చూడటం వీలుపడలేదు. మీరు ఆదేశించినట్లు - తప్పక పాల్గొనే ప్రయత్నం చేస్తాను.
"శివానీ" శబ్దాన్ని గుఱించి బ్లాగులో శ్రీ మిస్సన్న గారు ఏమని ప్రయోగించారో నేను చూడలేదు కాని, రూపసాధన ప్రక్రియ విషయమై నా అభిప్రాయం ఇది:
స్త్రీప్రత్యయప్రకరణంలో “శివానీ” శబ్దాన్ని "శివస్య స్త్రీ" అనే అర్థంలో శివ+అన్+ఈ అని విధించి సాధింపవచ్చును. మోనియర్ విలియమ్స్, వామన శివరామ ఆప్టే, శబ్దార్థకల్పతరువు, సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి అకారాదినిఘంటువులలో శివాని = పార్వతి అని పేర్కొనబడిన మాట నిజమే.
అయితే, సంస్కృతంలో అమరకోశం, త్రికాండశేషం, వైజయంతి, విశ్వం, మేదిని, మంఖకోశం వంటి ప్రసిద్ధకోశాలేవీ “శివానీ” శబ్దాన్ని చూపలేదు. అమరకోశవ్యాఖ్యానాలలో ప్రామాణికమైన రామాశ్రమి 1. శివా 2. శివీ అన్న శబ్దాలను మాత్రం సాధించి, “శివానీ” రూపాన్ని ప్రస్తావింపలేదు.
ఈ సందర్భంలో పాణినీయం (4:1:49) "ఇన్ద్ర-వరుణ-భవ-శర్వ-రుద్ర-మృడ-హిమ-అరణ్య-యవ-యవన-మతుల-ఆచార్యాణాం అనుక్" అన్న సూత్రంలో "శివ" శబ్దాన్ని చేర్చుకోకపోవటం వల్ల మీరన్న సందేహానికి తావు కలిగి ఉంటుంది. “భవ” శబ్దం నుంచి “భవాని”; “ఇన్ద్ర” శబ్దం పైని “ఇన్ద్రాణి” ఏర్పడ్డ తర్వాత “భవా”, “ఇన్ద్రా” మొదలైన శబ్దాలు ఏర్పడలేదు. ఆ ప్రకారమే “శివా”, “శివీ” శబ్దాలేర్పడిన తర్వాత “శివాని” సాధ్యం కాదని మీరు చదివిన వ్యాసకర్త భావించారేమో!
అంతేగాక, సంస్కృతంలో ప్రసిద్ధములైన లలితా సహస్రనామ - రామాయణ - మహాభారత - శ్రీ శంకరాచార్య స్తోత్రాదులలో,  ప్రసిద్ధకావ్యాలలో ఎక్కడా శివానీ శబ్దం ప్రయుక్తమైనట్లు జ్ఞాపకానికి రావటం లేదు. ప్రసిద్ధ కవిప్రయోగాలేవీ స్ఫురింపలేదు. ప్రాచీనప్రయోగాలు మృగ్యాలేమో!  శ్రీనాథుని భీమేశ్వరపురాణంలో ప్రయుక్తమైనట్లు లేదు. కాశీఖండంలో గుర్తుకు రాలేదు. ఇంకా గుర్తుచేసుకోవాలి.
సంస్కృతవ్యాకరణము యొక్క flexibility కారణంగా ఏ పదానికి ఏ అర్థాన్నైనా సాధింపవచ్చుననేది అనేకార్థకావ్యకవులు మనకు ఉపదేశించారు. కాబట్టి - కవిప్రయోగం లేకపోయినా శివ శబ్దాన్ని ప్రాతిపదికంగా స్వీకరించి, పై సూత్రాధారాన "అనుక్" + "ఙీష్" చేర్చితే "శివానీ" అని వాడుకోవచ్చునని నా అభిప్రాయం.
మీరు, శంకరయ్య గారు, మిత్రులందఱూ క్షేమమే కదా! అందఱికీ నా నమస్కారములు.    
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు

14 కామెంట్‌లు:

  1. మిత్రులారా! శుభాభినందనలు.
    కొంత వరకు చర్చ ఉండాలి - అదే మెదడునకు పదును పెడుతుంది. శ్రీ శంకరయ్య గారు కొన్ని విషయములు చెప్పేరు. డా. ఏల్చూరి వారు విపులముగా ప్రస్తావించేరు. దేనినైన ఏదో ఒక విధముగా సమర్థించ వచ్చు అని కూడా చెప్పేరు. ఒక శతావధాన సభలో అవధాని దేవళము అనే శబ్దము సంస్కృత పదము అనుకొని సమాసము చేయగా సభ నుండి అభ్యంతరము వచ్చినది. అయ్యా దేవళము తెలుగు శబ్దముకదా సంస్కృత శబ్దముగా భావించి సమాసము ఎట్లా చేసేరు అని. అవధానికి ఏమి సమాధనము చెప్పాలో తోచలేదు. కీ.శే. డా. చెరువు సత్యనారయణ శాస్త్రి గారు సభా సంచాలకులుగా నున్నారు. వారు దేవానాం లాలయతి ఇతి దేవళం అని ఆ విధముగా సాధిస్తే దేవళము అనే పదమును సంస్కృత పదముగా వాడుకొన వచ్చును అని చెప్పేరు. అందుచేత ఇష్టము వచ్చిన వారు శివానీ శబ్దమును వాడుకొన వచ్చును. శ్రీ మిస్సన్న గారికి, శ్రీ శంకరయ్య గారికి, డా. ఏల్చూరి వారికి మరొక మారు శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. వామన్ కుమార్ గారి వ్యాఖ్య ......
    శివాని శబ్ద చర్చ చాలా అమోఘంగాను, జ్ఞాన ప్రదాతగాను అలరారినది. ఇటువంటి చర్చలు నా వంటి పామరులకు పూర్తిగా అర్ధంగాకపోయినా, copy paste చేసుకొని,దాచుకొని తరువాత మెల్లగా చదివి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటానికి అనువుగా ఈ చర్చ ఈ బ్లాగునందు జరగటం మాకు మహద్భాగ్యం. అలాగే, మరొక విషయం కూడా వీలైనప్పుడు తెలియజేయ ప్రార్ధన.
    పద్యం, శ్లోకం - ఈ రెండింటికీ గల తేడా ఏమిటి ?
    పద్యంలో తెలుగు పదాలు, సంస్కృత పదాలు రెడింటినీ వాడుతున్నాము. శ్లోకంలో సంస్కృత పదాలు మాత్రమే వాడాలా ?
    ఇంకా ఏమన్నా వివరాలు తెలియజేయ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  3. మిత్రులు శ్రీ వామన్ కుమార్ గారికి,

    ఈ రోజు మీ లేఖనూ అందుకొన్నాను. శ్రీ గురువుగారికి సమాధానం వ్రాశాక, శంకరాభరణం బ్లాగులో ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీ ప్రశ్నను చూశాను. మీ ఆత్మీయతకు, విశ్వాసానికి ధన్యవాదాలు.

    ఛందఃశాస్త్రంలో పద్యము - శ్లోకము సమానార్థకాలే. మనము "శ్లోకము" అంటున్న ప్రభేదాన్ని సంస్కృతకవులు, లాక్షణికులు "పద్యము" అనే అన్నారు. కొన్నింటిని చూడండి:

    "దివ్యపద్యగద్యమయీ, సా దమయన్తీ వాసవదత్తాదిః" - భోజుని శృఙ్గారప్రకాశం (సం.2, అధ్యా-11, పు.429).
    "గద్యపద్యమయం కావ్యం చమ్పూ రి త్యభిదీయతే" - విశ్వనాథుని సాహిత్యదర్పణం (7-336)
    "పద్యం యద్యపి విద్యతే బహుసతాం" - వేంకటాధ్వరి విశ్వగుణాదర్శం
    "హృద్యతా గద్యానుషఙ్గిణో గద్యస్య" సోడ్ఢలుని ఉదయసుందరీ కథ (పు. 13)
    "కథా జహాతి పద్యప్రచురా" ధనపాలుని తిలకమంజరి (శ్లో. 17)
    "పద్యేషు బాహుల్య మిహ ప్రబన్ధే" సమరపుంగవ దీక్షితుని తీర్థయాత్రా ప్రబంధం (శ్లో. 11)

    తెలుగు పద్యాన్ని "శ్లోకము" అన్నా తప్పు కాదు. 32 అక్షరాల "శ్లోకము" లేదా "పద్యము"ను "గ్రంథము" అని కూడా అంటారు.

    తెలుగులో అనుష్టుప్ శ్లోకాన్ని వ్రాసి, అది "శ్లోకం" కాబట్టి సంస్కృతంలో లాగా ప్రాసనియమాన్ని పాటింపని మహాకవులున్నారు.

    అయితే, భాష సంస్కృతమైతే "శ్లోకము", తెలుగయితే "పద్యము" అని వాడటం తెలుగువాళ్ళ పరిపాటి. అది రూఢ్యర్థం మాత్రమే. తత్త్వతః రెండూ ఒకటే. తేడాలు లేవు.

    తీరిక కాగానే, మీ లేఖలకూ సమాధానం వ్రాస్తాను. అందఱికీ వందనాలు.

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  4. పండిత చర్చ అంతా చదివాక నాకు అర్థమైనది;అమరం వంటి వాటిలో లేకపోయినా ఇంద్రాణి,భవాని లాగే శివాని అని కూడా వాడవచ్చునని.రెండవది ,సంస్కృతంలో ఐతే శ్లోకమని ,తెలుగులో ఐతే పద్యమనీ అనడం అలవాటు కాని నిజానికి రెంటికీ భేదం లేదని.ఈ సందర్భంలో పర్వీన్ సుల్తానా పాడిన 'శివానీ,భవానీ 'అనే పాట గుర్తుకు వస్తోంది.

    రిప్లయితొలగించండి
  5. చర్చ సుహృద్భావ వాతావరణంలో చక్కగా సాగింది.
    అందరికీ అభినందనలు!
    నా దృష్టిలో వ్యుత్పత్తి సాధ్యమైనప్పుడు ఆ శబ్దాలను ప్రయోగించడంలో తప్పు లేదు. సాధువంటే కేవలం పూర్వకవులు ప్రయోగించినదో లేక ప్రాచీన నిఘంటువులలో ఉన్నదో - అని మాత్రమే కాదు. వ్యుత్పత్తి సాధ్యమైన ప్రతి శబ్దమూ సాధువే! ఇంకా చెప్పాలంటే - ’శివాని’ శబ్దాన్ని చాల మంది గేయ కవులు ఇదివరకే ప్రయోగించారు. అలా కాకుండా ఇదివరకు ఎవరూ ప్రయోగించని సాధ్య శబ్దాలను ప్రయోగించడమే కవి అసలు సిసలు గొప్పతనంగా పండితులు భావిస్తారు. ఉదాహరణకు ’కవీట్కాండమ్ములో’ అని డా. దాశరథి తొలిసారి ప్రయోగించి పండితుల ప్రశంసలనందుకొన్నారు. అలా శబ్దవ్యాప్తిని చేయడమే భాషాభివృద్ధి అంటారు. లేకపోతే శతాబ్దులు గడచినా అవే ఇరువది వేలో... ఇరువదియైదు వేల పదాలనో పట్టుకొని వ్రేళ్ళాడుతూ ఉంటే భాష స్థబ్దమై అక్కడే పడి ఉంటుంది. అలాగని నూతన సాధు శబ్దాలను సృజించడం అందరికీ సాధ్యం కాదు. దానికి అపారమైన పాండితీ గరిమ కావాలి.

    రిప్లయితొలగించండి
  6. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ ఎవరి మనస్సునూ నొప్పించకుండా హుందాగా తమ తమ అభిప్రాయాలను తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    శివానీ శబ్దార్థం ఆన్‌లైన్ సంస్కృత నిఘంటువులలో వెదికితే లభ్యం కాలేదు. పూర్వకవుల ప్రయోగాలూ దొరకలేదు.
    ఈ చర్చ ప్రారంభమైనప్పటినుండి నా మనస్సులో నాకెంతో ఇష్టమైన ఒక పాట మాటిమాటికి గుర్తుకు వస్తున్నది. అది స్వాతికిరణం చిత్రంలో డా. సి.నారాయణ రెడ్డి గారు రాసిన ‘శివానీ - భవానీ - శర్వాణీ.... గిరినందిని, శివరంజని, భవభంజని జననీ...’

    రిప్లయితొలగించండి
  7. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా!
    శివాని అనేది సంస్కృత శబ్దమునకు సంబంధించినది. సంస్కృత వాఙ్మయములో ఎక్కడా వాడబడిన దాఖలాలు లేవని ఈ చర్చ ద్వారా తెలిసినది. అందుచేత ఇటువంటి ప్రయోగములను చేయకుండా ఉండుటే ప్రశస్తము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. సమాస చాలనంలో ’సిద్ధము’, ’సాధ్యము’ ... రెండింటినీ ఆమోదించిన పండిత నేమాని గారు శబ్ద ప్రయోగంలో మాత్రం ’సిద్ధము’ను మాత్రమే అంగీకరించి, ’సాధ్యము’ను అంగీకరించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. అయినా ఎవరి అభిప్రాయం వారిది. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. పండితులారా!
    ఇంతకు ముందు వ్యాఖ్యలో పొరబాటున ’ స్తబ్ధము’ అని టైపు చేసే బదులు ’స్థబ్దము’ అని టైపు చేసాను. క్షమించగలరు.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ మీరు చెప్పినట్లుగా శివాని శబ్దంపై అర్థవంతమైన, ఙ్ఞానదాయకమైన చర్చ జరిగింది. పెద్దలు సెలవిచ్చినట్లుగా ఒకరి
    అభిప్రాయాలను మరొకరు గౌరవించుకొంటూ ముందుకు సాగిపోతూ ఉంటే కలిగే
    ఆనందం అనుభవైకవేద్యం. ఇక ఇటువంటి చర్చలు వామనకుమార్ గారు
    చెప్పినట్లుగా మాబోటి పామరులకు అత్యంత ఉపయోగకరం.
    అందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    ఇటువంటి సంస్కారవంతమైన చర్చలు విజ్ఞానదాయకాలు. వివేకవంతమైన చర్చలకు ‘శంకరాభరణం’ ఎప్పుడూ స్వాగతిస్తుంది.

    రిప్లయితొలగించండి
  12. I am very happy to follow the discussion on Sivani sabdam. Whether it is acceptable or not as per literary standards, I feel extreme happiness and untold peace as I mouth that word. I suppose that language is intended to give shape to the feelings of a person and hence the words which give expression to fellings should be included in language. This is the opinion of a person who is not a scholar in any language. All the scholars, kindly excuse me for my statement, but Sivani should continue to be part of our language. I am sorry for expressing my opinion in English as I have not yet learnt the telugu script on the computer. My regards to all the great scholars who participated in the discussion.
    Santha Devi

    రిప్లయితొలగించండి
  13. సాహితీమూర్తులైన పెద్దలకు, మిత్రులకు నమస్సులు.

    పై చర్చ సందర్భంగా నాకు కూడా ఇటువంటిదే ఒక సందేహం. భవుడు - భవాని, శంభుడు - శాంభవి, శంకరుడు - శాంకరి వలెనే నారాయణుడు - నారాయణి కదా! అనగా, నారాయణి అంటే లక్ష్మీదేవి కదా!...... కొందరు "నారాయణి" పదమునకు నారాయణుని సోదరి - పార్వతీదేవి అని అర్థం చెప్తున్నారు. అలా ఎందుకవుతుంది?!....... అదీకాక, పార్వతి విష్ణువుకు సోదరి ఎలా అవుతుందో కూడా నాకు అర్థంకాలేదు.

    పై 2 అంశముల గురించి వివరణ కోరుతున్నాను.

    సత్యనారాయణ పిస్క.

    రిప్లయితొలగించండి