రేఫ రహిత శివధనుర్భంగము
తాడిగడప శ్యామల రావు
ద్వితీయ భాగము.
అన మెచ్చుకొని మహాముని గాధిసుతుడు
జననాథ యెనలేని ఘనచాప మిపుడు
గనకుండ మనసాగ దనుమాట నిజము
జలజాక్షు నకు దాని సత్వంబు జూడ
సభజూడ తన దైన సత్వంబు జూప
దానిని తెప్పింప దగునయ్య నీకు
నా విని జనకుడా నందంబు చెలగ
దైవదత్తంబైన నావింటి నంత
సభకు తెండని బంపె సమధిక బలుల
ఎనిమిది చుట్టుల పెనుబండి మీద
నిటలాక్షు చాపంబు నెలకొని యున్న
మణిగణాలంకృతమంజూష నపుడు
వేసట నా యైదు వేలమందియును
కొనితెచ్చి నిలుపగా జనకుని యెదుట
కనుగొని యొడయడు మునిమండనునకు
అద్దాని జూపించి అఖిల లోకేశు
పెద్ద చాపం బిదె యిద్దాని నెత్త
మానవనాథుల మాట యెందులకు
యక్షదనుజనాగు లక్షీణబలులు
దేవముఖ్యులకైన దీనిని బూని
వంచి గుణంబును బంధించ నలవె
యుత్కృష్టమగు వింటి నో మహాభాగ
గాధేయ మౌనిపుంగవ యింక దీని
తమ శిష్యులకు జూప దగునయ్య యనగ
కలువకన్నులవాడ ఘననీలవపుష
జలజాప్తఘనకులతిలక బాలేందు
మౌళి దాల్చిన యట్టి మహితచాపంబు
కన్నులపండువుగా కనవయ్య
యని ముని వేడుక నాన తీయగను
వినయాతిశయమున మునినాథునకును
జననాథునకును వందనములు చేసి
గజగమనంబున ఘనమైన విల్లు
శోభించుచుండు మంజూషను గదిసి
నడచిసవ్యంబుగా గడు భక్తి జూపి
ఓ శివచాపమా యుధ్ధతు డగుచు
వచ్చెను వీడని భావింపవలదు
శివుడన్న నాకుండు చిత్తంబు నందు
నిశ్చలంబై యుండు నిజమైన భక్తి
భవునదై యొప్పెడు బాణాసనంబు
పావనములయందు పావనమనుచు
భావించి వచ్చితి భవదీయమైన
తేజంబు నీక్షించ దీనికి నీవు
కోపించకుండగ గొంకెంచకుండ
నా యందు దయచూపి నన్ను నీ చెలిమి
గొననిమ్ము నా చేత గొననిమ్ము నిన్ను
నని చాల వినుతించి వినయంబు వెలయ
గడియలు విడిపించి ఘనమైన పెట్టె
తలుపు నల్లన దీసి తా గాంచెనపుడు
దివ్యశోభల నీను దేవుని విల్లు
ఠీవి నెగడు దేవదేవుని విల్లు
కని దాని ఘనశోభ కమలాక్షు డపుడు
మునిపతి జనపతు లను గని పలికె
కైలాసపతివింటి గంటి మీ వలన
దయతోడ దీనిని తాకు భాగ్యంబు
అనుమతించుడు ధన్యమగు నాదు జన్మ
మా పైన మీ దైన యానతి యున్న
వాంఛింతు గుణము నవశ్యంబు దొడుగ
బాణంబు సంధించు భావంబు గలుగు
పెద్దలు మీ జెప్పు విధము చేసెదను
మీ పాదముల సాక్షి మునిగణనాథ
మీ పాదముల సాక్షి మిధిలాధినాథ
యనవిని మునిపతి జనపతు లపుడు
మిక్కిలి ముదమంది చక్కని పలుకు
పలికితి వయ్య నీ తలచిన యట్లు
శివుని చాపంబును చేబూన వయ్య
చక్కగా గుణమును సంధించ వయ్య
జయమస్తు శుభమస్తు జలజాక్ష యనగ
ధనువును వెస డాసి దాని మధ్యమున
జనపతియగు దశస్యందను పెద్ద
కొడుకు చేయిడి పైకి గొబ్బున లేపె
వేల మందికి కదుప వీలు కానట్టి
నీలగళుని విల్లు లీలగా నెత్తె
నెత్తుటయే యేమి ఈశాను దివ్య
చాపంబు గుణమున సంధించె వేగ
శింజిని నాపైన చెవిదాక లాగి
దినపతికులమౌళి కనువిందు చేయ
నంతలో వింతగా నంతకాంతకుని
పెనువిల్లు నడిమికి ఫెళ్ళున తునిసె
భూకంపమనునట్లు పుట్టిన ధ్వనికి
విలయమేఘధ్వానవిధమైన ధ్వనికి
మునిపుంగవుండన జనపతి యనగ
దినమణికులమణిదీపకు లనగ
చక్కగ నిలువంగ సభనున్న జనులు
వివశులై తక్షణం బవనిపై బడగ
తెలివిడి జనులకు గలిగెడి దాక
తాళి నృపాలుండు తాపసిం డాసి
ముకుళిత హస్తుడై మోదం బెసంగ
పలుకాడ దొడగెను పదిమంది వినగ
భగవానుడా నాదు భాగ్యంబు పండె
ఈ నాటి కొక జోదు నీశాను వింటి
నెత్తగా జాలిన యెక్కటి మగని
కన్నులపండువుగా చూడ గంటి
ఇనవంశమున నెంత ఘనుడుదయించె
ముక్కంటి పెనువిల్లు
తుక్కాయె నిపుడు
శివుని విల్లెత్త నా శివునకే తగును
శివుడు గా కున్న కేశవునకే తగును
కలనైన నూహింప గా దన్యు డొకడు
లీలగా కొని తన కేల నద్దాని
బేలపోవగ జేసె బెండు విధాన
నన్నట్టి దద్భుత మాయె మహాత్మ
ఇనకులపావను నెలమి సీతమ్మ
తనపతిగా గొని ధన్యయై వెలుగు
జనకుల కులయశంబును చాల నెగయు
ఘనబలశాలికై జనకుని బిడ్డ
వధువని పలికితి పంతంబు నెగ్గె
తమ యాన యగు నేని తద్దయు వేడ్క
నా యయోధ్యాపతి కతివేగముగను
సంగతి తెలుపగా సచివుల నిపుడు
పంపువాడను వివాహంపు వైభవము
నకు బిల్వ నంపెద నా పట్టణమున
అనవిని గాధేయు డమిత సంతుష్టు
డై మిధిలాధీశు నటు చేయ బంచె.
--oOo--