28, ఆగస్టు 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 67

రావిపాటి లక్ష్మీనారాయణ


రామాయణము-

సీ.     దశకంఠుఁ డల్గె; నా(తతబలాఢ్యుఁ డయిన

తగునేర్పరి యభిమ)తమునఁ బోయి

యమ్ము లక్షుండు నేయ, విటపి హనుమ ధ

(న్యుఁడు గ్రహించెను; ధృతి నుత్తరమును)

వాని కిచ్చె; నసుర(వరసుయోధనకృతి

పాండుసమాఖ్యునిఁ) బావని శర

ముల నొంచి మించె; సల్లలితధైర్యము దితి

(కొమరు లొందిరి; తమతమ బలముల)

గీ.     కొలఁదిఁ బోర, వాయుజుఁడు వారలను నొంచి

నేలఁ గలిపె నక్షకుమారుని; దనుజపతి

యంప హనుమంతుఁ బట్టెద నంచు నింద్ర

జిత్తు కత్తి నూఱుచు నేగె సేనతోడ. (౮౨)



భారతము-

ఆ.    తతబలాఢ్యుఁ డయిన తగునేర్పరి యభిమ

న్యుఁడు గ్రహించెను ధృతి నుత్తర; మును

వరసుయోధనకృతి పాండుసమాఖ్యుని

కొమరు లొందిరి తమతమ బలముల. (౮౨)



టీక- ధృతి = (రా) ధైర్యముతో, (భా) ప్రీతితో; ఉత్తరమును = (రా) జవాబు; (భా) ఉత్తర = ఉత్తర యను విరాటరాజ పుత్రికను, మును = ముందుగా; అసురవరసుయోధనకృతి = రాక్షసులలో మంచి యోధుఁడగు దిట్ట (అక్షకుమారుఁడు); పాండుసమాఖ్యుని = (రా) తెల్లనికీర్తి గలవానిని, (భా) పాండుడను పేరుగల రాజుయొక్క; బలముల = (రా) శక్తుల, (భా) సైన్యముల; విటపి = చెట్టు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి