20, ఆగస్టు 2014, బుధవారం

రేఫరహిత శివధనుర్భంగ వృత్తాంతము

రేఫరహిత శివధనుర్భంగ వృత్తాంతము
తాడిగడప శ్యామలరావు

ప్రథమభాగము


ఆదిత్యకులపావనాకృతులైన
బాలకులను గాధివంశపావనుని
చాల సన్మానించి జనక భూపతియు
భగవానుడా నాదు భాగ్యంబు పండి
చనుదెంచితివి నీదు సంకల్పమునకు
లోకంబులన్నియు లొంగి సేమంబు
గలిగి నడచుచునుండు గాధేయ నేడు
నా కేమి యానతి నా బల్క మెచ్చి
మూడు కాలంబుల ముచ్చట లెల్ల
తెలిసిన ముని యిట్లు తీయతీయంగ
నుడివె నీ బిడ్డలు కొడుకు లయోధ్య
నతికుశలత నేలు నట్టి మహాను
భావుడు దినమణి వంశవల్లభుడు
జనహితుండైన దశస్యందనునకు
నీ యొద్ద నున్నట్టి నిస్తులం బైన
శివమహాచాపంపు చెలువంబు జూప
నేనె దెచ్చితి నయ్య నీ సభ కిట్లు
దానిని తిలకించి తమ యింటి కేగ
తలచు బిడ్డల కీవు దాని చూపించ
వలయును మాదగు వాంఛితం బిదియ
యనినంత తమ యాన యనెను  భూపతియు
అటు బల్కి యుత్సాహ మతిశయించగను
పలుక జొచ్చెను మహీపాలు డా పైన
వినవయ్య మునినాథ వినిపింతు నీకు
భవుని చాపము మాకు వచ్చిన విధము
జననాథవంశభూషణు లిది వినుడు
భవుని చాపము మాకు వచ్చిన విధము
అల్లుడు శివునిపై నలిగి దక్షుండు
శివదేవునే వెలి జేసి యజ్ఞంబు
ఘటియింప జూచిన కలుషాత్ము డైన
దక్షుని భయమున దడదడ మనుచు
దేవత లేగిన దేవదేవుండు
శివుడంత కోపించి చేబూని విల్లు
భవునకు భాగంబు పంచక నొకడు
జన్నంబు చేయుట చాల తప్పనక
సమధికోత్సాహులై చన్నట్టి మీదు
తలలెల్ల డుల్లించ తలచితి ననిన
భీతులై దేవత లాతని పాద
పద్మంబులను బట్టి పనవిన జాలి
పడి నిలింపుల గాచి పదపడి యట్టి
పెనువింటి నెలమిని వినుడు మా వంశ
మందొక్క భక్తుని మన్నించి యిచ్చె
నాతడు నిమి నుండి యైదవవాడు
పదునైదు మందికి పైవాడు నాకు
యజ్ఞదీక్షితుడనై యవనిని దున్న
నాగేటి చాలున నాకు లభించి
నది యయోనిజ సీత యమిత సుశీల
భూలోకలక్ష్మియై పుట్టిన బాల
చాల దయామృతస్వాంత మా సీత
భూజాతయై పుట్టి యీ జనకు నింట
వెలసిన యీ తల్లి విధమెల్ల తెలిసి
మా కన్య నడుగుచు మహినున్న గొప్ప
జననాథు లిటు వచ్చి జనినది నిజము
బలశాలి యగు వాని భాగ్యమీ తన్వి
బలశాలి యెవడన్న పశుపతి వింటి
నెక్కిడ జాలిన చక్కని వాడె
యను నట్టి నా మాట నాలించి వేగ
శివమహాచాపంబు చేబూన బోయి
ఎంత కష్టించియు నించుక యైన
కదలింప సాధ్యంబు కాకున్న కినిసి
జనపతు లంతట జతగూడి మిథిల
పైకెత్తి వచ్చిన వెనుదీయ కేను
యుధ్ధంబు గావించి యుంటి నొక్కేడు
పోవక భూపతుల్ పోటెత్తి యుండ
చేయ వినతులు జేజేలకు నేను
నా బలంబంతట నాల్గింట నుబ్బె
నా పైన దుష్టుల నణచితి నేను
మీ యాన చొప్పున మునివేగి మీకు
చూపింతు నేపైన చాపంబు నిపుడె
ఈ నాడు గాని యీ యినకులేశుండు
పశుపతి చాపంబు పట్టి పై కెత్తి
జతచేయ గలిగెనా చక్కగా గుణము
బలశాలు లందున బలశాలి యితడె
ఈ యయోనిజ సీత నీతని కిచ్చి
వైభవం బొప్ప నుద్వాహంబు జేతు

15 కామెంట్‌లు:

  1. శ్రీమాన్ శ్యామలరావుగారికి ఆశీస్సులు మీ రేఫరహితశివ ధనుర్భంగ వృత్తాంతము శీర్షిక లోనే మూదు రేఫలు ప్రధమ భాగము యన్న పాదములో మరియొక రేఫమున్నది ధనుర్భంగము రీఫరహితమైతే ఆ పడము
    అర్ధమే మారిపోవును శీర్షికను తగినరీతిగా సరిచేయవలెను మీనూతన ప్రయత్నము ఫలించాలని పరమాత్మను ప్రార్ధించు చున్నాను

    రిప్లయితొలగించండి
  2. తిమ్మాజీరావుగారూ,

    శీర్షిక అనేది రేఫయుక్తంగా ఉన్నమాట నిజమే కాని అది పద్యభాగం కాదు.

    అలాగే ప్రథమభాగం అన్నది కూడా ఒక ఉపశీర్షిక - విభజనోపయుక్తంగా. అంతే. అదీ పద్యభాగం కాదు.

    కవిత్వంలో భాగం కాని వాటిలో రేఫం దోషం కాదు. ప్రతిజ్ఞాభంగం ఏమీ లేదు.

    మీ ఆశీర్వచనాలకు మిక్కిలి కృతజ్ఞుడను. అవి నాకు బలాన్నిస్తాయి. రెండవభాగం కూడా ఈ రోజున వ్రాస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. శ్రీయుత తిమ్మాజిరావు కెంబాయి గారు , రేఫ రహిత శివధనుర్భంగము అనే శీర్షిక లో రేఫమున్నంత మాత్రాన అది దోషమేమీ కాదు . ఆ శీర్షిక కిందనున్న కవిత్వములో ర కారముండదని మాత్రమే సూచన. ' నిరోష్ఠ్య రామాయణేత్యాది ' కవితా శీర్షికల వలెనే యిదీనూ . శీర్షిక లో మ కారముంటుంది కవిత్వంలో ప ఫ బ భ మ లేవీ ఉండవు నిరొష్ఠ్యము కాబట్టి. కనుక ఈ నామధేయము సముచితమే !

    శ్రీ తాడిగడప శ్యామలరావు గారూ ,

    పంచక నొకడు ( వ్యతిరేక క్త్వార్థము ద్రుతాంతము కాదు ) , మీదు ( యుష్మదస్మదాత్మార్థములకు మాత్రమే దు ప్రత్యయము ) , చేతు ( పొన్న పూల నీకు పూజఁ జేతు అన్న ప్రసిద్ధ చాటువొకటున్నప్పటికీ , చు వర్ణాంతాసమాపక క్రియలకు భవిష్యత్కాల నిర్ణయము చేయునప్పుడే తు ప్రత్యయము చేరుతుంది --- నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు లోలాగా , కాచు ----> కాతు , కాల రాచు ----> కాల రాతు , వచ్చు----> వత్తు ఇత్యాది . చేయు , వ్రాయు , వేయు మొదలగు క్రియలకు తు ప్రత్యయము చేరదు), ఆయా స్థానాలలో మాత్రమే సవరణలవసరం . మిగిలిన కవిత్వం సుగమం , హృద్యం .

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయంగారూ అద్భుతమైన కవిత్వం! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. డాక్టరుగారూ, వ్యతిరేక క్త్వార్థము ద్రుతాంతము కాదని తెలుసండీ. కాని అప్పుడప్పుడు అలా పడిపోతూ ఉంది. సరి జేస్తాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    మిస్సన్నగారూ, మీక్కూడా నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. శ్యామలరావుగారికి ఆశీస్సులు శీర్షికలో దోషమున్నదనిగాని ప్రతిజ్ఞా భంగమనిగాని నేను ప్రస్తావించలేదు
    మీరు చిత్ర కవిత్వములో ఇతోదికముగా రాణి౦చాలని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  7. శ్యామలరావుగారికి ఆశీస్సులు శీర్షికలో దోషమున్నదనిగాని ప్రతిజ్ఞా భంగమనిగాని నేను ప్రస్తావించలేదు
    మీరు చిత్ర కవిత్వములో ఇతోదికముగా రాణి౦చాలని ఆశిస్తున్నాను నాసంశయనివృత్తి జేసిన డా.విష్ణునందన్ గారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగుందండీ శ్యామల్రావు గారూ

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగుందండీ శ్యామల్రావు గారూ

    రిప్లయితొలగించండి
  10. శ్యామలరావు గారికి, ఇటువంటి ప్రయత్నం చేసిన ఇతర కవిమిత్రులకు అభినందనలు.
    చిన్న సందేహం. పాలనాకృతులు లోని వట్రసుడి ఇక్కడ రావచ్చా?

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    నిస్సందేహంగా రావచ్చు. ఋత్వానికి, రేఫకు సంబంధం లేదు.

    రిప్లయితొలగించండి
  12. శ్యామలరావు గారూ ! చాలా బాగుందండీ ! డా. విష్ణునందన్ గారూ మీరూ చర్చలు చేస్తుంటే మాకెన్నో క్రొత్త విషయాలు సోదాహరణముగా తెలుస్తుంటాయి..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. మీ రేఫరహితశివ ధనుర్భంగ వృత్తాంతము చాలా బాగుందండీ !క్రొత్త విషయములు తెలియ జేసినమీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. ముందుగా తమ ‘రేఫ రహిత శివధనుర్భంగము’ను ప్రచురణార్థం బ్లాగుకు పంపిన తాడిగడప శ్యామల రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    ప్రశంసించిన మిత్రులకు, సందేహాన్ని వెలిబుచ్చి జ్ఞానదాయకమైన వివరణ వచ్చుటకు కారకులైన కెంబాయి తిమ్మాజీ రావు గారికి, సోదాహరణంగా సందేహానికి తగు వివరణ ఇచ్చిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారు,
    సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.

    దీనిని ఒక్కసారి చూడగలరు.
    "సీతను పెండ్లాడ శివధను వొకదాని
    నెత్తి ముక్కలు చేసెనెంత బలుడ
    టంచును చెప్పికొనంగ నెన్నడు నైన
    మాకెట్టి యలుపది? మక్కువ కద,
    మధుబిందువులఁబోలు మాటల యందున
    పలుకుచుందుమెపుడు భవ్యకథల
    విన్న చెవులకెల్ల వేడుకయైనట్లె
    పాడెడు నోటికి పదిలమగును.

    హనుమ నేలువాని కంతట జయమగు
    మాట గాచు స్వామి! మంగళమ్ము.
    తమ్మునిఁ గని సంతతమ్ము సంతసపడు
    దేవుకెల్ల వేళ దివ్యజయము."

    రిప్లయితొలగించండి