కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్.
ఈరోజు పూరించవలసిన సమస్య...
అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్.
కవిమిత్రులారా! బ్లాగు అభిమానులారా!
నేటికి సమస్యాపూరణల సంఖ్య 1500 అయింది. దాదాపు ఐదుసంవత్సరాలుగా బ్లాగు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది. ఇంతకాలంగా ఒక్కరోజుకూడా నాగా లేకుండా కొనసాగిన ఘనత తెలుగు బ్లాగులోకంలో ‘శంకరాభరణం’ బ్లాగుకే దక్కిందని కించిత్తు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ విజయం కవిమిత్రుల సహకారం, భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. కవులు లేకుంటే శంకరాభరణం బ్లాగు శూన్యం. ‘తాంబూలా లిచ్చేశాను... తన్నుకు చావండి’ అని కన్యాశుల్కంలో చెప్పినట్లుగా కేవలం సమస్యను, చిత్రాన్ని ఇచ్చి పూరణలు, పద్యాలు వ్రాయమని మిమ్మల్ని కష్టపెడుతున్నాను. ఒక పూరణ కాని, పద్యాన్ని కాని వ్రాయడానికి ఎంత మానసిక కల్లోలానికి గురి అవుతారో నాకు అనుభవమే. అయినా మిత్రులు పద్యకవిత్వంపట్ల అభిమానంతో, ఆసక్తితో, పట్టుదలతో పద్యాలు వ్రాస్తూ నాకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.
మనమధ్య ఉండి, మనలోపాలను సరిదిద్ది బ్లాగుకు కొండంత అండగా ఉన్న పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి నిర్యాణం బ్లాగుకు తీర్చరాని పెద్దలోటు. వారి ఆశీస్సులు మనవెంట ఎప్పుడూ ఉంటాయి. వారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక!
ఇక బ్లాగును ఇక్కడితో ఆపివేయాలా, కొనసాగించాలా అని తర్కించుకుంటున్నాను. నాకేమో రోజురోజుకు ఓపిక, జ్ఞాపకశక్తి సన్నగిల్లుతున్నాయి. అందులోను కుటుంబసమస్యలు ఒకవైపు.. రోజంతా విశ్రాంతి లేకుండా ఆంధ్రభారతివారి నిఘంటువు పని మరొకవైపు.. కొత్త కొత్త సమస్యలను సృష్టించడం, సేకరించడం కష్టమౌతున్నది.
ఈ విషయంలో మిత్రుల సలహాలను ఆహ్వానిస్తున్నాను.
గౌరవ నీయులైన కంది వారికి ,
రిప్లయితొలగించండిశంకరుడు లేకున్న గంగ లేదు.
కాబట్టి ఓపిక బట్టి అలసట వచ్చినా కౌదల గంగను మోయ నెప్పుడును తగునైనది మనస్సునకు.
గంగ ప్రవాహము వారం మొత్తం మీదా ప్రవహించక పోయినా , రెండు మూడు రోజుల కొక్క మారు ప్రవహింప జేసిన కూడా చాలును ! నిలచిన నీటికి, పారు నీటికి వున్న వ్యత్యాసం మానస సరోవరానికి మన మధ్య ప్రవహించు గంగ కి వున్న వ్యత్యాసం. కనుల ముందున్న గంగ తల్లి . నిలచిన మానస సరోవరం ఉటోపియా .
జిలేబి
మాస్టారూ, ఈ బ్లాగుకి చిరకాల మిత్రుడిగా మీ కష్టం నేనెరుగుదును. నేను కూడా ఉడతా భక్తిగా కొన్ని సమస్యలను సూచించిన వాడినే. నాకు తెలిసి శంకరాభరణం మనలో చాలామందికి దినచర్యలో ఒక భాగమైపోయింది. నా సలహా, క్రొత్త కవి మిత్రులు వచ్చి చేరుతున్నారు కాబట్టి సమస్యా పూరణం కొనసాగించమని మనవి. అయితే మీ కష్టం ఎరిగినవాడిని కాబట్టి చిన్న మార్పు - రోజూ క్రొత్త సమస్య ఇవ్వనవసరం లేదు, అవసరాన్ని బట్టి పాత వాటిల్లోంచి మీ ఇష్టం వచ్చింది ఇస్తూ ఉండండి. ఆటోమాటిక్గా సమస్యని శెడ్యుల్ చేసి ముందస్తుగానే పెట్టవచ్చును గాబట్టి మీరు రోజూ కంప్యూటర్ దగ్గర కూర్చోవలసిన పని లేదు. అట్లాగే దోష విచారణ కూడా రెండు మూడు రోజులకొక మారు చేసినా పరవాలేదనిపిస్తోంది. తుది నిర్ణయం మీదే, అదే మాకు శిరోధార్యము.
రిప్లయితొలగించండి''అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ'';నెప్పుడున్
రిప్లయితొలగించండిగిలగిల లాడిన, న్నల భగీరధు నింబలె దీక్ష బూనుచున్
కిలకిల లాడు పక్షులటు కేవల భక్తి ని పూరణమ్ములన్
సలుపగ నుందు మార్య ! జల సంపద నందగ జేయ గోరెదన్ .
అలసట యేమి?శంకరున కాతడు దైవతమూర్తియేగదా!
రిప్లయితొలగించండియలసట మానవాళికగు నన్నిపనుల్ వెస చేయగానిలన్,
నలసిన సాధుజీవనుల కందరి సాయము తప్పుగాదుగా!
తెలిసిన మీదుబోంట్లకిట తెప్పున సాయము నంది యీయమా!
పూజ్యనీయులు, గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి శత కోటి వందనములు. శంకరాభరణము బ్లాగు నాకు పద్య భిక్ష పెట్టినది. మీ కష్టం విలువ కట్టలేనిది. నా కూనలమ్మ పద్యములందు బ్లాగు పైన, మీ పైన ఉడతా భక్తిగా వ్రాసినవి మరొక్క మారు
రిప్లయితొలగించండి9. శంకరాభరణము
శంకరాభరణమ్ము
కవుల కాభరణమ్ము
శంకలకు చరణమ్ము !ఓ.. కూనలమ్మ!
10.శ్రీ కంది శంకరయ్య గారు
బాధలందున వారు
పద్యములనే కోరు
గురువులందున వేరు !ఓ... కూనలమ్మ!
శ్రీ పండిత నేమాని వారు నేను బెంగళూర్ లో ఉన్నప్పుడు బ్లాగు లోని మిత్రులు అన్ని సమస్యలకు వారి పూరణ గాని, వారి వ్యాఖ్యగాని పెట్టుట అలవడిన బ్లాగునకు మంచిది. నా వలె అప్పుడప్పుడు ప్రేక్షకుని వలె వచ్చిన వారు పద్య రచన లోని మాధుర్యమును పొంద జాలరని చెప్పినారు.
గురుదేవులు మన్నించాలి వారి మాటలు వ్రాసితిని కానీ నేను వారు చెప్పినది పాటించక పోతిని. ఈ మధ్య పద్యము వ్రాయ వలెనని కోరిక కలుగు చున్నది. పని వత్తిడి వల్ల, నా కుటుంబము ఒక చోట, నేను మరొక చోట నుండుట వల్ల వ్రాయలేక పోతున్నాను.
నా కోరిక ఈ శంకరాభరణము కల కాలము ఇలా సాగి పోవాలని...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిన్నపము జేయుచుంటిని
రిప్లయితొలగించండిసన్నుత ! మఱి యాపవలదు శక్తింగొలది
నన్నువ నిచ్చుచు నుండుము
బన్నము గాకుండు నటుల బ్రతిదివ సంబున్
మహా పండితులు మాత్రమే సమస్యలను పూరించ గలరు అనుకొనుచున్న, కవిత్వములో ఓనమాలు దిద్దుకుంటున్న, నాచేత సమస్యా పూరణలు చేయించిన ఘనత గురువర్యులు కంది శంకరయ్య గారికే చెందుతుంది. ఒక బొమ్మను యిచ్చి పద్యము వ్రాయ మంటే నేను వ్రాయ లేను అని చెప్పేవాడిని. నాలో మనోధైర్యాన్ని కలిగించింది శంకరా భరణం.ఈ బ్లాగు ఉండ దంటే బాధగా ఉన్నది.
రిప్లయితొలగించండికలవరమాయె మానసము కాంచ గనేటి సమస్యఁ ప్రొద్దున
న్నలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్
కలతను పొందగా మనము కాంచగ లేను కవిత్వ మాధురిన్
తలపులు రావు నాకిక, పదమ్ములు వ్రాయగ లేను భావిలో
మహా పండితులు మాత్రమే సమస్యలను పూరించ గలరు అనుకొనుచున్న, కవిత్వములో ఓనమాలు దిద్దుకుంటున్న, నాచేత సమస్యా పూరణలు చేయించిన ఘనత గురువర్యులు కంది శంకరయ్య గారికే చెందుతుంది. ఒక బొమ్మను యిచ్చి పద్యము వ్రాయ మంటే నేను వ్రాయ లేను అని చెప్పేవాడిని. నాలో మనోధైర్యాన్ని కలిగించింది శంకరా భరణం.ఈ బ్లాగు ఉండ దంటే బాధగా ఉన్నది.
రిప్లయితొలగించండికలవరమాయె మానసము కాంచ గనేటి సమస్యఁ ప్రొద్దున
న్నలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్
కలతను పొందగా మనము కాంచగ లేను కవిత్వ మాధురిన్
తలపులు రావు నాకిక, పదమ్ములు వ్రాయగ లేను భావిలో
శంకరా భరణ బ్లాగ్ కవి మిత్రులకు నమస్కారములు
రిప్లయితొలగించండిపద్య సాహిత్య రచనలు కనుమరుగయ్యే ప్రమాధ దశలో శ్రీ కంది శంకరయ్య గురువరులు ఆర్ధిక కుటుంబ సమస్యలు వయోభారమును లెక్క చేయక తన శంకరా భరణ బ్లాగ్ ద్వారా గత ఐదు సంత్సరాలనుండి నిర్విరామంగా కొనసాగిస్తూ అనేక నవకవులకు పద్యరచనా విధానము చంధస్సు సూత్రాలను వివరిస్తూ , తప్పులను సవరిస్తూ మార్గ నిర్దేశకులైన శ్రీ కంది శంకరయ్య గురువరులుకు, అదే విధముగా ఛందో బద్దంగా పద్యాలను వ్రాయుటకు నిరంతరము సూచనలు సలహాలను అందిందించిన కీ. శే. పండిత నేమాని గురువరులకు మనః పూర్వక వందనములు.
కీ. శే . పండిత నేమాని లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణములో పద్య సాహిత్యమును ప్రోత్సహిస్తూ పెంపొందించు అభిరుచిగల అనుభవజ్ఞులైన కవులెవరైన పండిత నేమాని వలె శ్రీ కంది శంకరయ్య కు తోడుగా ఉండి శంకరా భరణము బ్లాగ్ ను యదావిధిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగు ద్వారా తెలుగు భాషకు దూరంగా మహారాష్ట్రలో ఉంటున్న నేను సమస్యా పూరణ , చిత్ర లేఖన ద్వారా హృద్యంగా పద్య రచనలు చేయగలుగు తున్నానని చెప్పుటకు సంతోషిస్తున్నాను నా లాగే ఎంతో మంది నవకవులు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను.
ధన్యవాదములు
గలగల దూకు గంగ శివగంగనభంగతరంగ మాలికన్
రిప్లయితొలగించండితలనిడి పొంగిపోదువని దల్తుము ధూర్జటి నీవె నిట్లనం
గ, లయము గాదె విశ్వమిట గౌరి విభో!విన, నమ్మ శక్యమే
అలసటవచ్చె శంకరున కౌదల గంగను మోయనెప్పుడున్
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిపలువిధి గంతులేయుచును, పావన స్వర్గము నుండి జారుచున్
చెలగెడి గంగ పట్టియును చేర్చెను జూటములందు నీశుడే
అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయనెప్పుడున్
పిలిచెడు నా భగీరధుని వెస్కగ పంపె నధోజగత్తుకున్
చెలగుచు నాట్యమాడుచును చేరెను చక్కగ నీశునెత్తిపై
గిలగిల లాడుచుండగను, గింగిరులాడెడి యామెగంతులన్
అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయనెప్పుడున్
జలజల పారిసానువుల చక్కగ జారె హిమాద్రినుండియున్
1“అలసటవచ్చె,శంకరునకౌదలగంగనుమోయ”నె ప్పుడున్
రిప్లయితొలగించండితలపగ లేడు, యేలనన తానిడె చల్లదనమ్ము గంగ,చంద్రుడున్,
వలపున నింపె పార్వతిటు వామతలమ్మున మేని భాగమై
కలతలు దీరి లోకములు గర్భము నందున విశ్రమించగా
2.“అలసట వచ్చె, శంకరున, కౌదల గంగను మోయ” నెప్పుడున్
తలపగ నేరడాత డొక దైవము,పూజ్యుడు , బోధకుండు, వా
డలసట జెందడ వ్విధిని ,ఆర్య!,మహోదయ!కంది శంకరా!
వలదని వేడుచుంటి మిము బ్లాగు సమస్యల నాపు జేయగా
రిప్లయితొలగించండి1“అలసటవచ్చె,శంకరునకౌదలగంగనుమోయ”నె ప్పుడున్
తలపగ లేడు, యేలనన తానిడె చల్లదనమ్ము చంద్రుడున్,
వలపున నింపె పార్వతిటు వామతలమ్మున మేని భాగమై
కలతలు దీరి లోకములు గర్భము నందున విశ్రమించగా
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
3.నిలకడ లేని గంగ తన నెత్తిని నిత్యము జారుచుండగా
తలగడ నుంచలేక తన తాల్మి నశి౦చగ నిద్రలేమి చే
తలవిదిలించ జాలక సతమ్మును ధ్యానమునందెనుండగా
అలసటవచ్చె,శంకరున,కౌదల గంగను మోయ నెప్పుడున్
తలపయి జేరగంగ తనదానిగ ప్రేముడి స్వీకరించుచున్
రిప్లయితొలగించండివలచిన గౌరికిన్ సగము భాగము కాయము పంచి మెచ్చుచు
న్నిలువని నాగులన్ మెడను నింపిన శంకరు నాడ భావ్యమే?
"అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్!".
రిప్లయితొలగించండినవనవ సంశయాంశగతినౌషధమై కవిధీచికిత్సకై
సవనమె శంకరాభరణ చాలిత నిత్యలసత్సమీక్షణమ్
కవనపు జాహ్నవీ హవన కార్య సుదక్షత శ్రౌతనిత్యమై
అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్.
శ్రీ శంకరయ్యగారు, దత్త సమస్యాంతర్గతమైన మీ భావం ఇదేనా ?
అలసటెఱుంగకార్తుల సమాదరణంబునఁ గాచుచుండుటన్
రిప్లయితొలగించండి"అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్!".
విలసితశంకరాభరణ వేల్పగు శంకరమాన్యమూర్తి యే
యలసట లేక నిత్యము మహాత్కవిమండలికండగా నిలున్.
శంకర! సత్కవిత్వ గుణ సాంద్రత కొల్పి కవీశ్వరాళి ని
శ్శంకగ పూరణల్ సలుపు శక్తిని కొల్పిన పండితోత్తమా!
జంకకు మెన్నడున్.శివుడు జంకుచు గంగను వీడ లేదుగా?
వంకలు మాని పండితుల భావన నెన్నుచు సాగుచుండుమా!
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ....
రిప్లయితొలగించండికలహములాడె గంగమను గాంచిన గట్టులరేనిపట్టి తా
నలిగెను, నాధుడన్న మరియాదను వీడెను, చిచ్చుకంటితో
పలుకుట మానినట్టి తన పత్నిని మచ్చిక సేయబోవగ
న్నలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయనెప్పుడున్
పండిత నేమానివారి నిర్యాణం బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్ధిస్తూ
ప్రణామములు గురువుగారు,...
రిప్లయితొలగించండిశంకరాభరణము కొనసాగించాలా వధ్దా అనే మీవుంస మీరు వ్యక్తపరచడంచూసి మనసుకు చాలా భాధ కల్గింది నాలాంటి వారికెందరికో పద్యబిక్ష పెట్టి, చందోబద్దంగా వ్రాయడం నేర్పించారు...మీరు, శ్రీనేమాని గురువుగారు,ఇప్పటికే నేమాని గురువుగారి పద్యములు, శుభాశీస్సులు బ్లాగులో కనబడక కనులు చెమరిస్తున్నాయి..ఇక శంకరాభరణమే కనుమరుగవుతుందంటే ..చాలా కష్టంగా వుంది... రోజుకోక్క పూరణ పద్య రచనలతో నిరాటంకంగా ఎంతోకాలంగా శ్రమిస్తూ శంకరాభరణంకు అఖండ కీర్తినార్జించి పెట్టారు..ఇది నిజంగా ఒక తపస్సు...అది ఒక్క మీకే సాధ్యమయ్యింది...
నా విన్నపమేమిటంటే .... సమస్యాపూరణ లివ్వడం తమకు కాస్తంత శ్రమ కల్గించే పని కావున, కనీసం తమకు తోచిన చిత్రానికి పద్యరచననైనా కొన సాగిస్తే మా వంటి ఔత్సాహికులకు మార్గదర్శకమౌతుందని, అనుభనజ్ఞులైన మన కవిమిత్రుల సహకారంతో శంకారాభరణంను కొనసాగించమని ప్రార్ధన..
శ్రీ పండిత నేమాని వారి ఆకస్మిక నిర్యాణం దిగ్భ్రాంతి కరము , బాధాకరమూ . ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ముఖ పరిచయము లేని మా బోంట్లకే ఇంత కష్టమవుతూ ఉంటే ఇక శోకతప్త హృదయులైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడమెవ్వరి తరము ? నేమాని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ , వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూన్నాను .
రిప్లయితొలగించండి"ఇవె మీకు శుభాశీస్సులు ,
వివరింపఁగ మీ కవిత్వ విధి నిది దోషం
బవు , దిద్దఁగ వలెన"ను స
త్కవి యగు నేమాని వారిఁకన్ గన రారా ?
సాధుత్వాసాధుత్వ
ప్రాధాన్యములఱసి పలుకు పండితుఁడిఁకపై
శోధింపడె యీ ' కవితా
సాధనము 'ను ? నమ్మఁగా నిజమ్మిదియేనా ?
( కవితా సాధనము = శంకరాభరణ కవిత్వ వేదిక )
స్తుత పాండిత్య విలాస వైఖరుల నస్తోకాంధ్ర సాహిత్య వి
స్తృత సేవా విధి సంచరించి కవితా శ్రీ పీఠిఁ బాలించి శా
శ్వత కీర్తింబొడఁగన్న ధీమతి మహా సారస్వతాంభోధి ' పం
డిత నేమాని 'ని సంస్మరించెదను నేడీ రీతి ఖిన్నుండనై !
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. తమరి నిర్ణయమును జదివిన తఱి నే నాశ్చర్యమునకు గుఱియయినాను. ఈ శంకరాభరణం బ్లాగు...పద్యము నిరాఘాటముగఁ గొనసాఁగుటకయి మీరేర్పఱచుకొన్న యుద్యమము. పద్యమును స్థిరతరముగ వెలుఁగొందునట్లు చేయుటయేకదా మీ యాశయము? ఈ బ్లాగు మూలమున నెందఱో యువకవులు పద్యకవులుగ వెలుఁగొందుచున్నారు. ఇది మీరు సాధించిన విజయము! దీనిని మీరు నిరంతరాయముగ నడుపవలెనని మా యందఱి కోరిక. దీనిని నడుపుట మీకు క్లేశకరమైనను నడుపక తప్పదని నా యభిమతము. అగుచో, దీనిని నడుపుటకై యొక సులభమార్గము కలదు. మీరు ప్రతిదినము మూఁడు టపాలు పెట్టకుండ, దినమున కొకటి చొప్పున..అనఁగా...నొకదినము సమస్యాపూరణము...ఇంకొక దినమున వర్ణనాంశము...మఱియొక దినమున దత్తపది...మఱింకొక దినమున సంకల్పిత గ్రంథభాగ ప్రచురణము...వీలయినచో...నిషిద్ధాక్షరి (గతమున నిచ్చినట్లు) నిర్వహింపఁగలరు. ప్రతిదినము సమస్యలకై వెదుకవలసిన యవసరముండదు కావున మీకుఁ గొంత తెఱపి యుండఁగలదు. ఇఁక పద్య విశ్లేషణము...దినమునకుఁ బలుమాఱులు కాకుండ, దినమునకు నొకటి రెండు పర్యాయములు విశ్లేషించిన సరిపోవును. మీ యాశయమును నెఱవేరును. మాకందఱకును సంతసముఁ గలుగును. కావున తా మీ విషయములను దృష్టియందుంచుకొని, మన్నించి బ్లాగును కొనసాఁగించఁగలరని మనవి.
రిప్లయితొలగించండిమన్నింతురను నమ్మికతో...
భవదీయ మిత్రుఁడు,
గుండు మధుసూదన్
నిలపడె జుట్టు నందు తొలి నింగిని జారిన గంగ ధారలన్?
రిప్లయితొలగించండిగళమున కాలకూటమును గైకొని గావడె లోకులెల్లరిన్?
పిలుపు వినంగనే సకల భీతుల బాపగఁ జూచు చుండ! నే
యలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయనెప్పుడున్?
గురుదేవులకు ప్రణామములు. గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా 'శంకరాభరణం' బ్లాగును ఆరోగ్య, కుటుంబ సమస్యల మధ్య నడుపుట అసమానము మరియు అద్వితీయము. మీరు పడిన శ్రమకు అభినందనలు. మా వృత్తి సంబంధిత సమస్యల మధ్య ఒక ఆట విడుపుగ తదుపరి మా విధి నిర్వహణకు ఉత్సాహాన్ని ప్రసాదించిన ఉత్తమోత్తమ బ్లాగుకు
ఆటంకము కలిగించకుండా పైన మాన్యుల సూచనలనుసరించి తమరిఛ్చా పూర్వకంగా నిర్ణయించ ప్రార్థన.
తలపఁగ నాంధ్ర పద్య కవితా రసమే సుర గంగ ; దాని భూ
రిప్లయితొలగించండిస్థలిఁ దపియించుచుండెడి రసఙ్ఞ హృదంతర సీమలందు ని
చ్చలు ప్రవహింపఁజేయ ననిశమ్ము శ్రమించుచునుండు ; నిక్కమే !
యలసట వచ్చె శంకరునకౌదల గంగను మోయనెప్పుడున్ !
ఈ 'శంకరునకు ' దివ్య గంగా ప్రవాహాన్ని బోలిన పద్య కవితా గంగ ను తాను మాత్రమే ధరించడానికి అలసట వచ్చింది , అందుకే పద్యకవితలకై తహతహలాడే రసఙ్ఞుల హృదయాలను ఈ శంకరాభరణ వేదిక ద్వారా కవితామృతాన్ని అందిస్తూ ఆహ్లాదపరుస్తున్నాడని భావము .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యా ! నమస్కారములు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాము. రోజుకొక్క సమస్య ఇవ్వటం నిజంగా సమస్యే.. దానిని మీరు అధిగమించి ఇన్ని సంవత్సరాలు బ్లాగును నడపటం అనేది ఒక "రికార్డే " ..మీ బ్లాగు నీడన ఉద్దండుల నుండి పద్య రచన అభ్యాసకుల వరకు సేద తీరుచూ ఉన్నవారే..ఇంకా ఎంతోమంది సారమెరిగిన బాట ' సారులు ' పద్యకవితా ఫలముల రసములను గ్రోలుచున్నవారే. మీకుటుంబ ఆరోగ్య ఆర్థిక సమస్యలెన్ని యున్ననూ మీరు దీనిని ఒక యజ్ఞముగా భావించి కొనసాగించుచున్న విషయం అందరికీ అనుభవమే.
రిప్లయితొలగించండిముఖ్యముగా నేను ఎప్పుడో అదపాదడపా ఆకాశవాణి లో సమస్యాపూరణము చేసి నేనూ పద్యములను వ్రాయగలనని అనిపించుకున్నాను..మీ బ్లాగు వలన రోజూ పద్యములను వ్రాయగలుగుతూ మీ ద్వారా తప్పొప్పులను తెలుసుకుంటూ మెరుగులు దిద్దుకున్నాను. ముఖ్యముగా మీ స్ఫూర్తి తోనే నేనూ ఒక బ్లాగును నిర్వహించుచున్నాను. శంకరాభరణం లేకపోతే నా పద్యరచన, బ్లాగు ఉండేది కాదు.అందులకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడను.
ఇక మీకు కొంత విశ్రాంతి కలుగుటకు నాకు తోచిన సూచనలు. శంకరాభరణ యజ్ఞము నిరంతరం కొనసాగాలని మా ఆకంక్ష. రాబోవురోజుల్లో ఇంకా క్రొత్తగా కవిమిత్రులు రాగలరని అనుకొనుచున్నాను.దీని నిర్వహణకు మరియొక సమర్థులు మీకు తోడుగా ఉంటే బాగుండుననిపిస్తున్నది.ఈ క్రమంలో శ్రీ నేమాని వారిని తలవకుండా ఉండలేము.
సూచన: ఇప్పటి వరకూ ఇచ్చిన సమస్యలను మొదటినుండి వరుసగా ( రోజూ ఒకటి మాత్రమే )మరల ఇచ్చినచో ఇప్పుడు వచ్చిన కవి మిత్రులు దాదాపు క్రొత్త వారు కనుక వారికవి క్రొత్త సమస్యలే యగును.ప్రాత వారుకూడా మరింతమెరుగైన మరియొక పూరణము చేయవచ్చు. మీకుకూడా కొంత విశ్రాంతి దొరుకుతుంది అని నా అబిప్రాయము. మీకు వీలైతే క్రొత్తగా వారానికి ఒక సమస్యగాని, దత్తపది గాని, వర్ణన గాని,ఇలా యేదో ఒకటిమాత్రమే ఇస్తే బాగుంటుందని..మీకు వీలైన రీతిలో శంకరాభరణాన్ని కొనసాగించాలని మా కోరిక.
పాత సమస్యలను మరలా ఒక క్రమ పద్ధతిలో పునరావృతము చేయడమనే శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి సూచనతో ఏకీభవిస్తున్నాను !
రిప్లయితొలగించండిపూజ్యనీయులు కంది శంకరయ్య గారికి,
రిప్లయితొలగించండినిరాటంకంగా కొనసాగుతూ తెలుగు బాష గొప్పతనాన్ని ప్రపంచానికి 'చాటు'తున్న ఈ బ్లాగును మీలాంటి గొప్ప సాహితీ మిత్రుల సహకారంతో కొనసాగించమని మనవి .
మీ బ్లాగులో అతిధి రచయితలుగా ఇద్దరు, ముగ్గురిని నియమించి వారిచే "సమస్యలు' ఇప్పించే అవకాశాన్ని పరిశీలించగలరు.
శంకరాభరణం బ్లాగు మిత్రులందరికి విన్నపము. మన బ్లాగు మిత్రులందరు కలసి ఒకసమావేశం నేర్పాటు చేసుకుంటే బాగుంటుంది. గురువు గారు వారి సంసిద్ధత తెలియ జేయాలి.శంకరాభరణం బ్లాగు తో ప్రపంచ రికార్డు సాధించిన గురువు గారికి సన్మానం చేసుకోవాలి.
రిప్లయితొలగించండిగలగల పారు పద్య రసగంగను పెంపొనరించుచుండి మ
రిప్లయితొలగించండిమ్ముల కవితాప్రయాణమున పూర్ణజయమ్మున వెల్గఁజేయు ని
శ్చలయుత ధీమతావరులు శంకరులిట్లువచిచుటెట్లగున్??
యలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయనెప్పుడున్.
గురుదేవులకు నమస్కారములు.
మన బ్లాగు కవిమిత్రులు వెలిబుచ్చిన అభిప్రాయములను చదివినాను. వారన్నట్లుగానే "శంకరాభరణము" మా అందరి జీవితములో ఒక భాగమైపోయినది. దీనినుండి విడిపోవడము అనే విషయము జీర్ణశక్యము కానిది. కానీ మీయొక్క కష్టములను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలామంది కవిమిత్రులు పెద్దలు తెల్పినట్లుగా అవే సమస్యలనే పునహా ఇచ్చినా కూడా సరిపోతుందనే భావిస్తున్నాను.
ముఖ్యంగా, దత్తపది యిస్తూ వర్ణనాంశము నిర్దేశించడము అనేది అన్నిటికంటే ఉత్తమంగా భావిస్తున్నాను. ఎలాగూ పద్యరచన శీర్షిక ఉండనే ఉన్నది.
మీకు శ్రమ లేకుండా ఎవరినైనా సహాయకారిగా ఎన్నుకోవడము కూడా ఉన్నతమైన ఉత్తమమైన మార్గము. రోజులో ఒక్కసారిమాత్రమే బ్లూగులో మీ వ్యాఖ్యలను ప్రచురించినా సరిపోతుంది.
ఏదిఏమైనా ఈ " పద్యరచనా యజ్ఞము " నిరాఘాటంగా కొనసాగాలని అభిలషిస్తున్నాను.
తుదినిర్ణయము మాత్రము మీదే..
భవదీయ శిష్యపరమాణువు
సంపత్ కుమార్ శాస్త్రి.
గురువర్యులకు నమస్కారములు. 1500 సమస్యా పూరణములను నిరాటంకముగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు. దీని కొస మీరు పడుతున్న శ్రమ శ్లాఘనీయము. కనీ హఠాత్తుగా విరమించదలచడం మిత్రులందరికీ యేదో తెలియని యందోలన కలుగుతున్నది. బహుశా టెండూల్కర్ రిటైర్మెంట్ విన్నప్పుడు కలిగిన అనుభూతి లాంటిది. అంతగా అలవాటు పడిపోయాము. అలాగని ఈ వయసులో మీ మీద వత్తిడి తేవటం కూడా మంచిది కాదు. పండిత నేమాని గారి నిధనము తరువాత మీకు బహుశా పూరణల సమీక్షలలో సహాయకుల కొరత ఏర్పడియుండ వచ్చు. నా తరపున మీ భారము టాఘ్ఘీణ్ఛ్ఃఆడాఆణీఈ కొన్ని సూచనలు చేయ దలచుకొన్నాను
రిప్లయితొలగించండి1. ప్రతి కవి మిత్రుడు కొన్ని సమస్యలను సేకరించి (ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగ - కవిత్వం నేర్చుకోవటంలో ఇదికూడా భాగమే ) మీకు అందించటం.
2. బ్లాగ్ లో కొందరు మిత్రులు సమీక్షించ గలిగిన వారు వున్నారు. మీకు వీలు లేని సమయములో వారు ఆ బాష్యతలను స్వీకరించవచ్చు.
3. కవిమిత్రులు ఒకరి పూరణల నొకరు సమీక్షించు కోవడం (సున్నితముగా నొప్పించుకోకుండా )
(కేవలం నాకు తోచినది చెప్పాను. అన్యదా భావించ వలదు )
వలదిది శంకరార్యులకు భారము హెచ్చిన గాని పల్కగా
'అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్'
వెలవెలఁబాఱు 'బ్లా'గికను వేదిక యేదిక మాకు పద్యముల్
సులువుగ నేర్వగన్? తమకు శుష్మము నివ్వగ సోముఁ గోరెదన్
శ్రీ గుండు మధుసూదన్ గారి అభిమతము సమంజసమైనది అనుకుంటాను. మనమందరూ యోచించి వారానికొక్క క్రొత్త సమస్యను కల్పించి అదించినా కొంతవరకు ప్రయోజనకరము. ప్రతియొక్క పూరణమునూ ప్రత్యేకముగా పేరుపేరునా అభినందించడం, అందరికీ ప్రియమైనదే. జనప్రియతకు, నవకవులను ఆకర్షించుటకూ అది అగత్యమే. ఐనను, పర్యాయముగా మరొక మార్గాన్ని ఎన్నుకొవచ్చు. దినాంతమున, ఒక సమీక్షగా, తప్పులను త్రిద్ది, మంచి పద్యాలలోని కావ్య, భాష, రసాది గుణాలని ప్రస్తుతించి, తమ స్వీయపూరణములనూ అందించి కొన్నివాక్యాలలో అన్ని పరిహృతులనూ క్రోఢీకరించవచ్చునేమో ! రోజుకొ దత్తపది, సమస్య, వర్ణన, చమత్కార పద్యం ఇలా సరళీకరించన శ్రీయుతలుకు కొంత శ్రమతగ్గవచ్చు. ౧౫౦౦ వరకూ నిరాతంకంగా సాగించిన యోజకశక్తి మరికొన్ని సహస్ర సంచికలను సృష్టించక పోతుందా!
రిప్లయితొలగించండిమిత్రులు శంకరయ్యగారి శంకరాభరణం బ్లాగు ఈ బ్లాగులోకానికే తలమానికం. వారి ఇబ్బందులు కూడా అవశ్యం అలోచించదగ్గవి. ఇక్కడ కొన్ని మంచి సూచనలూ వచ్చాయి. అవసరమైతే ఈ బ్లాగు నిర్వహణకు కొద్దిమందికి బాధ్యతలు అప్పగించి వారు పర్యవేక్షకులుగా ఉండటం కూడా ఒక మంచి పధ్ధతి అనుకుంటాను. నేమానివారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఇప్పుడు బ్లాగుమిత్రుల బాధ్యతలు సమస్యాపూరణలతో పాటు కొంచెం పెరిగాయి. గురువుగారికి వారు కొత్తసమస్యలను ఉత్సాహంతో పంపుతూ ఉండటం కూడా వారికి శ్రమతగ్గించే ఉపాయాల్లో ఒకటిగా అందరం గ్రహించాలి. వృత్తిపరమైన బాధ్యతల ఒత్తిడివలన నేను పద్యాలు వ్రాయటం బాగా తగ్గింది. మళ్ళీ దారి లోనికి రావలసి ఉంది. ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, ఐదు సంవత్సరములుగా శంకరాభరణం బ్లాగు నడుపుతు కనుమరుగవుతున్న పద్య సంస్కృతికి ప్రాణం పోస్తున్న సాహితీ పిపాసి యైన మీరు బ్లాగును నిలిపి వేయ వలెనను నిర్ణయం తీసుకోవటానికి దారి తీస్తున్న పరిస్థితులను అర్థం చేసుకోగలం. విశ్వ వ్యాప్తంగా వీక్షిస్తున్న వీక్షకులు, సాహితీ ప్రియులు, మీ బ్లాగు ద్వారా సమస్యలను పూరించడం నేర్చుకున్న మా వంటి వారికి, కవి మిత్రులకు తీరని లోటు ఏర్పడుతుందనేది సత్య దూరం కాదు. ప్రస్తుతం నేను బ్లాగులో క్రియాశీలంగా పాల్గోన లేకపోయినప్పటికి శంకరాభరణం వీక్షిస్తున్న వారిలో నేను ఒకడినే. మీరు మరిన్ని వసంతాలు శంకరాభరణం బ్లాగును నిరాటంకంగా కొనసాగించాలని మనసారా కోరుకుంటన్నాను. మా కోరిక మన్నిస్తారని మనవి.
రిప్లయితొలగించండిగురువుగారూ. మీ బ్లాగు నిరంతరాయంగా సురఝరిలాగ ప్రవహిస్తూ ఉండక తప్పదు. కవిమిత్రుల నుంచి పలు సూచనలు వచ్చాయి. మీకు నచ్చిన బాటను పట్టండి.
రిప్లయితొలగించండిబ్లాగు నిర్వహణను మీకు నచ్చిన కవిమిత్రులలో సమర్థులన దగ్గ వారికి వంతులవారిగా అప్పచెప్ప వచ్చును. ఉదాహరణకు వారమున కొకరికి.
మీరు పర్యవేక్షకులుగా సహాయపడుతూ ఉండవచ్చును.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండితెలుఁగుఁ బద్యమ్ములు స్థిరముగా వెలుఁగొంది
......భావితరమ్ముల వఱలుఁగాక;
తెలుఁగుఁ బద్యమ్మె ప్రథిత యశమ్మునుఁగూర్చి
......తెలుఁగు విశిష్టత నిలుపుఁగాక;
తెలుఁగుఁ బద్యపు టందియలు ఘల్లుఘల్లునఁ
......దెలుఁగు నేలను నర్తనలు సలుపుత;
తెలుఁగుఁ బద్యపు మాధురులు తెనుంగు కవుల
......కలములఁ బ్రవహించి ఘనతనిడుత;
అనుచు భావించి శ్రీ శంకరయ్యగారు
"శంకరాభరణ"మ్మను సాహితీ వి
కాస పద్యరచన బ్లాగుఁ గల్పనమ్ము
చేసి, ఘనతనుఁ గాంచిరి స్థిరముగాను!
సుందరమొందెడి యీ"బ్లాగ్"
నందుండిరి పద్యకవులు నభ్యుదయమ్మున్
బొందెడి జాతికి జాగృతి
నందఁగఁ జేసెడి సుకవులు నవ్యకవీశుల్!
వీరలందఱి పద్యాలు భేషనంగఁ
దప్పులొప్పులు సరిఁజూచి, దయను దిద్ది,
గురులు నేమానివారలు స్థిరతరమగు
కీర్తిఁగని, కీర్తిశేషులై, క్లేశమిడిరి!
నవ్యకవిమార్గదర్శన మవ్యవహిత
ముగనుఁ జేసి, బ్లాగును మునుముందుకుఁ జనఁ
బెద్ద దిక్కయి వెలుఁగొందు వీరి పోక,
శంకరయ్యగారికయె వజ్రప్రహరము!
ఈశంకరనామహితులు
క్లేశమ్మొనఁగూడఁగాను కించిదసహజ,
స్వాశయభంగమునకు నిట
వైశయిక నివర్తనమ్ము వలచిరి కట్టా!
వెఱచినచోఁ బెద్దదగును,
వెఱవకయున్నను మఱింక వెదకియుఁ గనఁగన్
జిఱుతుకయునుఁ గనఁబడదయ;
వెఱవఁ దగనిదానిఁ గూర్చి వెఱవఁగనేలా?
కావున నో శంకరయ్యగారూ!
"మనసు దిటవు చేసి మఱలంగ నీ బ్లాగు
మున్నుఁ జన్న రీతి ముందుకుఁ జని,
సాహితీ వికాస సంపత్కరమ్ముగా
వెలుఁగు లీనునట్లు నిలుపుమయ్య!"
"ప్రతిదినము నీవు మూఁడు టపాలు కాక,
యొక్కటైననుఁ బ్రకటించి నిక్కమైన
పద్దెమునకిట స్థానమ్ముఁ బదిలపఱచి,
సాఁగిపోవంగఁ జేయు మో శంకరార్య!"
*** *** *** ***
వెలిఁగెడి తెల్గు పద్దెము నవీన విధమ్మున శీర్షమందునన్
నిలిపెను బ్లాగుఁజేసి; సురనిర్ఝరి శీర్షముఁ దాల్చు శంకరుం
బొలుపున మోసి మోసి, యశముం దగఁ బొందియు, భారతీవ్రత
న్నలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్!
-:స్వస్తి:-
పలువురుఁ శంకరాభరణ బ్లాగు సహాయము తోడ పద్యముల్
రిప్లయితొలగించండిగలగల పారు గంగవలె గంటము పట్టియు వ్రాయుచుండగా
వలవల బోయి రందరును; బ్లాగును నిల్పదలంచ,నందరున్
వలదని కోరుచున్న రిక బ్లాగు నిరోధమునాపివేయుమా!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఏదో చెప్పరాని మనోవైక్లబ్యానికి గురియై బ్లాగుకు సెలవు చెపుదామా అన్న ఆలోచన వచ్చింది. కాని ఇందరు ఇంతగా బ్లాగును అభిమానిస్తూ దీనిని కొనసాగించవలసిందిగా కోరుతూ ధైర్యం చెప్పి, సలహాలు ఇచ్చి, వెన్నుతట్టి ప్రోత్సహించడం నాకు ఆనందాన్ని, నూతనోత్సహాన్ని కలిగించాయి. మీరు ఇచ్చిన సూచనలను అమలులో పెడతాను.
జిలేబీ గారికి,
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
రెండుచింతల రామకృష్ణమూర్తి గారికి,
కందుల వరప్రసాద్ గారికి,
సుబ్బారావు గారికి,
అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
‘శీనా’ శ్రీనివాస్ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
యం.ఆర్.చంద్రమౌళి గారికి,
చింతా రామకృష్ణారావు గారికి,
శైలజ గారికి,
డా. విష్ణునందన్ గారికి,
గుండు మధుసూదన్ గారికి,
గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
శ్రీనివాస్ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
‘శ్యామలీయం’ శ్యామలరావు గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
మిస్సన్న గారికి,
ధన్యవాదాలు.
నాకు ఓపిక ఉన్నంతవరకు బ్లాగు కొనసాగుతుందని హామి ఇస్తున్నాను.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిబంధువుల ఇంట్లో పెళ్ళిచూపుల కార్యక్రమానికి వెళ్ళి, తరువాత కొందరు మిత్రులను కలిసి వచ్చినందున రోజంతా బ్లాగుకు అందుబాటులో లేను. అందువల్ల నా స్పందనలను వెంటవెంటనే తెలియజేయలేకపోయాను. మన్నించండి. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు అందించిన మిత్రులు....
భాగవతుల కృష్ణారావు గారికి,
రెండుచింతల రామకృష్ణమూర్తి గారికి,
అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారికి,
‘శీనా’ శ్రీనివాస్ గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
యం.ఆర్.చంద్రమౌళి గారికి,
చింతా రామకృష్ణారావు గారికి,
శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారికి,
గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి,
డా. విష్ణునందన్ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
గుండు మధుసూదన్ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
శంకరయ్యగారూ,మీరు వ్రాసినది చదివి చింతించను.నామట్టుకు నేను 1000 బ్లాగులతర్వాత మానుకొన్నాను.కాని ఇంకా చాలామంది కొనసాగించ్డానికి ఉత్సాహంగా ఉన్నారుకాబట్టి ,నాసూచనలు ఇస్తున్నాను.
రిప్లయితొలగించండి1.పూర్తిగామానివేయడం కన్న రోజుబదులు,వారానికోసారు సమస్యో ఏదో అంశం మీద పద్యరచనో ఇవ్వడం.
2.ఈ బ్లాగులోవ్రాస్తున్నవారిలో మంచిపండితులు ,కవులూ ఉన్నారు.వారు ఎవరైనా ఈ మహత్తర బాధ్యతను స్వీకరించడం.(శ్రీ గుండు మధుసూదన్ గారు వంటివారు )
3.సాహితీకౌముది పత్రిక సంపాదకవర్గంవంటి వారి సహకారాన్ని తీసుకోవడం.
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ,మీరు వ్రాసినది చదివి చింతించను.నామట్టుకు నేను 1000 బ్లాగులతర్వాత మానుకొన్నాను.కాని ఇంకా చాలామంది కొనసాగించ్డానికి ఉత్సాహంగా ఉన్నారుకాబట్టి ,నాసూచనలు ఇస్తున్నాను.
1.పూర్తిగామానివేయడం కన్న రోజుబదులు,వారానికోసారు సమస్యో ఏదో అంశం మీద పద్యరచనో ఇవ్వడం.
2.ఈ బ్లాగులోవ్రాస్తున్నవారిలో మంచిపండితులు ,కవులూ ఉన్నారు.వారు ఎవరైనా ఈ మహత్తర బాధ్యతను స్వీకరించడం.(శ్రీ గుండు మధుసూదన్ గారు వంటివారు )
3.సాహితీకౌముది పత్రిక సంపాదకవర్గంవంటి వారి సహకారాన్ని తీసుకోవడం.
శ్రీ శంకరయ్య గారికి నమస్కారము శంకరాభరణ బ్లాగును ఇకముందు కుడా నిరాటంకంగా నిర్వహిస్తానని చెప్పడం సంతోషాన్ని కలుగ జేసింది మిత్రుల సూచనలు ,మీ వెసులుబాటునిబట్టి ముందుకు సాగండి .
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని గారు స్వర్గస్థులైనారను విషయము నేడు బ్లాగుద్వారా తెలిసికొని చాలా కలత చెందాను . మనసు వికలమై పోయింది . పండితుడు ,కవి మరియు విశిష్టమైన వ్యక్తిత్వము గలిగిన సహృదయుడైన శ్రీ నేమాని గారు ఇక లేరు సత్యం జీర్ణించు కోలేక పోతున్నాను శంకరాభరణం బ్లాగులో అప్పుడప్పుడు పాలుపంచుకొంటున్న నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి తప్పొప్పులను సవరించినన్ను ప్రోత్సహించారు .వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను
శ్రీ కంది శంకరయ్య గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిమీ సందేహానికి కవి మిత్రులందరూ వారి సలహాలను ఇచ్చారు. పనుల వత్తిడిలో చాలా రోజుల తరువాత శంకరాభరణం బ్లాగు చూసి నేను రెండు విషయాలలో చింతిస్తున్నాను. పండిత శ్రీ నేమాని వారి భగవద్సాన్నిధ్యానికి పయనం, మీరు బ్లాగు గురించి ఆలోచించడం.
మిత్రులు అన్నపరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పినట్లు , నేను కూడా ఛందస్సు గురించి జ్ఞానం లేని వాడిని. అయితే శంకరాభరణం బ్లాగులో చేరి, పద్య రచన ప్రారంభించి కొనసాగిస్తున్న నేను, మీ ఆశీస్సులతో ఉత్సాహ రాఘవ శతకం అనే పేరుతో ఒక శతకం రచించాను. ప్రస్తుతం ముద్రణ ప్రయత్నాలలో ఉన్నాను.
రిప్లయితొలగించండినాలాంటి వారెందరో నూతన కవులకు, ప్రారంభీకులకు ప్రోత్సాహాన్నిచ్చే ఈ బ్లాగు చిరకాలం సాగుతూ ఉండాలని నా ఆకాంక్ష.
ఒకప్పుడు సినీ రంగంలో గాయనీ గాయకులు లేక, హిందీ సినీ రంగం నుండి గాయకులను అప్పుకు తెచ్చుకొని పాటలు పాడించుకుంటున్నందుకు చింతించి, కోపించి, ముందడుగు వేసి పాడుతా తీయగా కార్యక్రమాన్ని ప్రారంభించి, నేటికీ ఒక నిరంతర ఝరీ ప్రవాహంలా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తద్వారా అనేక గాయనీ గాయకులను తెలుగు జాతికి పరిచయం చేసిన ఘనుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు.
అదే విధంగా అనేక మంది కవులను తెలుగు భాషకు పరిచయం చేసిన, చేస్తూ ఉన్న ఘనత శంకరాభరణం బ్లాగుకే దక్కుతుంది. ఈ సత్కార్యంలో అడుగడుగుా గురువు గారి శ్రమ మనకు కనపడుతూ ఉన్నది. కనుక ఈ ప్రవాహం ఆగకూడదు. సమస్య పోస్ట్ చేయటం, తప్పులు సవరించటం, లేదా చర్చించటం - తెలిసిన వారందరూ చేయవచ్చు. అయితే వివాదాలకు పోకుండా ఉంటే మంచిది కదా.ఏది ఏమైనా ఈ ప్రవాహం ఆగకూడదనేదే నా ఆశయం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యా! గత అయిదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతోమందికి పద్యభిక్ష పెట్టిన మన బ్లాగు ఇక ఉండదంటే మనసుకు ఏంటో కష్టంగా ఉంది. కోరి కోరి విషం మా చేతులో పెట్టినట్టు ఉంది. మీరొక్క సారి పునరాలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది. పద్యం రాసే వాళ్ళే కరువైపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వారు పూనుకోకుంటే పద్యానికి దిక్కు లేకుండా పోయేది. సమస్య ఇవ్వడం ఎంత కష్టమో దాన్ని పూరించడం కూడా అంతే కష్టం. మీరిచ్ఛే సమస్యలు మా స్వంత సమస్యలను మరిపించి, మమ్ములనెంతగానో మురిపించి, మా మెదడుకు పనిపెట్టించి, మా పనిపట్టించి చీకట్లో దివ్వెలాగా ఉపకరించింది. అటువంటి బ్లాగు కనుమరుగవడం మంచిది కాదు. కాబట్టి సమయోచిత నిర్ణయం తీసుకోగలరు. నాకంటే పెద్దవారు, పద్యాలపై ఆసక్తి ఉన్నవారు, పద్యపుంగవులు అనిపించుకొన్నవారు చూపిన దారిలో మీరు ఆలోచిస్తే బాగుంటుంది. శ్రీ నేమాని వారి సహకారం లేదని మీరు విషాద యోగం అవలంబిస్తే మా బోటి వాళ్లకు దారేది? ఎందరికో సమస్యలిఛ్చి, సమస్యలను సరిచూసుకుని, సరిచేసుకొని, సమస్యా పరిష్కారం చేసిన మీరు ఈ సమస్యను సక్రమంగానే పరిష్కరించగలరని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ గుఱించి , మీ బ్లాగ్ గుఱించి ప్రశంసాపూర్వక ప్రస్తావనలు విన్నాను. మీ నుండి నాకు ఆదరపూర్వకముగా ముఖపుస్తకమిత్రబృందములోనికి ఆహ్వానించి ప్రతిదివసము మీరిచ్చు సమస్యాపూరణలో పాలుపంచుకొనే అవకాశం కలిగించినందులకు ధన్యవాదములు. మీ బ్లాగ్ ను ఈ (10/7/2017-@7am)రోజే చూస్తున్నాను.ఒక్కొక్కసారి మీరిచ్చే సమస్యలు ముఖపుస్తకం లౌ కనబడుటలేదు. దీనిలో చూడవచ్చను కొంటున్నాను.కాని నాకు ఇది ఆద్యదినంగా కనబడుటలేదు. నేనెట్లు చూతునో మార్గదర్శనం చేయగలరు. ధన్యవాదములతో.. నమస్కారములు..
శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ గుఱించి , మీ బ్లాగ్ గుఱించి ప్రశంసాపూర్వక ప్రస్తావనలు విన్నాను. మీ నుండి నాకు ఆదరపూర్వకముగా ముఖపుస్తకమిత్రబృందములోనికి ఆహ్వానించి ప్రతిదివసము మీరిచ్చు సమస్యాపూరణలో పాలుపంచుకొనే అవకాశం కలిగించినందులకు ధన్యవాదములు. మీ బ్లాగ్ ను ఈ (10/7/2017-@7am)రోజే చూస్తున్నాను.ఒక్కొక్కసారి మీరిచ్చే సమస్యలు ముఖపుస్తకం లౌ కనబడుటలేదు. దీనిలో చూడవచ్చను కొంటున్నాను.కాని నాకు ఇది ఆద్యదినంగా కనబడుటలేదు. నేనెట్లు చూతునో మార్గదర్శనం చేయగలరు. ధన్యవాదములతో.. నమస్కారములు..