4, ఆగస్టు 2014, సోమవారం

సమస్యా పూరణం – 1494 (తల్లియుఁ దండ్రియును లేక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
తల్లియుఁ దండ్రియును లేక తనయుఁడు పుట్టెన్.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

 1. చెల్లిని యన్నయె పెంచెను
  తల్లియు తండ్రియును లేక, తనయుడు పుట్టెన్
  చెల్లికి వివాహము పిదప,
  మల్లి యనెడు యన్న నామమాబాబుకిడెన్

  రిప్లయితొలగించండి
 2. ఇల్లాలికి సంతానము
  కల్ల యనుచు నద్దె గర్భ కాంతకు గర్భం
  బల్లన చేయించ మగడు
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్!

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  తారకుణ్ణణచ గలిగిన శూరుడు-కారణజన్ముడు-శరవణభవుడు !

  01)
  ________________________________

  రెల్లు పొదలోన నగ్నియె
  పిల్లాడై వెల్గె, సురల - వేదన దీర్చన్ !
  మల్లుడు, తారకు నణచగ;
  తల్లియుఁ దండ్రియును లేక - తనయుఁడు పుట్టెన్ !
  ________________________________

  రిప్లయితొలగించండి
 4. దృష్టద్యుమ్నుడు :
  (దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు.. ద్రౌపది అన్న.
  ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.
  తన స్నేహితుడు.. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు
  ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు.
  ఇతడు కురుక్షేత్ర యుద్ధం లో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.
  కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి ,తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.
  చివరికి ద్రోణుని కుమారుడు అశ్వత్థామ చేతిలో ఘోరంగా మరణించాడు !)

  02)
  ________________________________

  చెల్లెలు పాంచాలి గలసి
  యల్లన తా నుద్భవించె - యఙ్ఞము నుండే
  బల్లిదుడై పగ దీర్చగ !
  తల్లియుఁ దండ్రియును లేక - తనయుఁడు పుట్టెన్ !
  ________________________________

  రిప్లయితొలగించండి
 5. ఏదో జానపద సినిమాలో :
  [ఒక రాచకుటుంబం-తల్లి-తండ్రి-ఇద్దరు పిల్లలు !
  శత్రువులనుండి తప్పించుకోవడానికి - తలో దిక్కౌతారు !
  పిల్లలు వెల్లువలో కొట్టుకు పోతే
  తండ్రి ఎలుగుబంటిగా మారిపోతే
  పరిగెడుతూ స్పృహ తప్పిన నిండుగర్భిణి యైన తల్లి
  తనయుడికి జన్మ నిస్తుంది ! అంతా విధి లీల (వ్రాలు) !]

  03)
  ________________________________

  పిల్ల లనాథ లయిరి యా
  తల్లియు తండ్రియును లేక !- తనయుడు బుట్టెన్
  దల్లికి ! తండ్రయ్యె నెలుగు !
  అల్లడ తల్లడ పడుటది - యా విధి రచనన్ !
  ________________________________
  అల్లడ తల్లడ పడు = మిక్కిలి బాధలు పడు

  రిప్లయితొలగించండి
 6. పిల్లలు జనియించ రనుచు
  కొల్లలు గా దంపతు లిల కుందుచు నుండన్
  మెల్లన విజ్ఞాన మెదుగ
  తల్లియుఁ దండ్రియును లేక తనయుఁడు పుట్టెన్.

  రిప్లయితొలగించండి
 7. ఒక సామాన్యుని మనోగతం

  కల్లోలం బాయె బ్రతుకు
  తల్లియు తండ్రియును లేక;తనయుడు పుట్టెన్
  మెల్లగ నాకిటు చూడగ,
  నిల్లును గడుపుటకునైన నెట్లగు నిపుడున్

  రిప్లయితొలగించండి
 8. పల్లెకుఁ బోవమగడు, తన
  తల్లియుఁ, దండ్రియును లేక, తనయుఁడు పుట్టెన్
  ఇల్లాలి సుఖప్రసవఁ ప్ర
  ఫుల్లత గృహమంతనిండె పూవుల సంతై

  రిప్లయితొలగించండి
 9. ఇల్లాలికి నిండె నెలలు
  తల్లీ ! నే వత్తుననుచు తల్లియె చెప్పెన్
  కల్లోల వరద వచ్చెను
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్

  రిప్లయితొలగించండి
 10. తొల్లి సముద్రము చిలుకగ
  తల్లియుఁ దండ్రియును లేక తనయుడు పుట్టెన్
  చల్లగ వెలుగు హిమాంశుగ
  యల్లనఁ జేరెను ముదమున నాశివు శిరమున్

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  యం.ఆర్.చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది.అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. పిల్లా! బంధుప్రీతియె
  కల్లనుచు నిరూపణమ్ము కానీయకుమా!
  చెల్లని మాట! యదెచ్చట
  తల్లియుఁ దండ్రియును లేక తనయుఁడు పుట్టెన్?

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  కొల్లలుగ సిరులనిచ్చిన
  తల్లి సముద్రునికిబుట్టు తనయవ జా
  బిల్లితనయుడై తనరగ
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్
  2.తల్లి యమెరికా యందున
  డిల్లీలోతండ్రియుండ డెహెరడూనున్
  పల్లె పడుచు గర్భ మిడగ
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్

  రిప్లయితొలగించండి
 14. మల్లెలవారి పూరణలు
  1.ఎల్లను సృష్టియు కలుగగ
  నెల్లనుతనయందు లయమునెవ్వడు జేయున్ల్
  చల్లగ గాచును నతడే
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్
  2.పిల్లలనాధలనందున
  పిల్లనినోకనిని కొనియును పెంచగ నతనిన్
  ఎల్లరుననరే వింతగ
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్
  3.పిల్లని పెంచిరి మాతృక
  లల్లన సేనాపతియయె అమరులకతడే
  వల్లీపతి యగు స్కందుడు
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్
  4.పిల్లలనాట్యూబునగన
  చెల్లెను నేడిటను శాస్త్ర సిద్ధిని గనుటన్
  చెల్లదు యనుటది తప్పగు
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్
  5.ఇల్లెడ మూకగ "రేపులు"
  కొల్లగ జరుగుచును నుండె కోమలి యొక తా
  అల్లరి,పిల్లను గన నా
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్

  రిప్లయితొలగించండి
 15. అల్లా! యేమీ చిత్రము ?
  తల్లియు దండ్రియును లేక దనయుడు పుట్టెన్
  కల్లా ,నిజమా , యీ యది
  కొల్లలుగా జరుగు చుండు కుశునుని బోలెన్

  రిప్లయితొలగించండి
 16. మల్లికి తొమ్మిది నిండెను
  తల్లియుఁ దండ్రియును లేక తనయుఁడు పుట్టెన్
  దిల్లీలో నుండుటచే
  వెళ్ళుట కాలస్యమగుట వీరల కయ్యో.

  రిప్లయితొలగించండి
 17. సుబ్బారావు గారూ మీ పూరణ బాగుంది.అయితే చివరి పాదం లోని "కుశునుని" అనేమాట మాత్రం అర్ధం కాలేదు.

  రిప్లయితొలగించండి
 18. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  నాలుగవ పూరణలో ‘చెల్లదు + అనుటను’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. అక్కడ ‘చెల్ల దటంచన తప్పగు’ అందామా?
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కల్లా’ అనకుండ ‘కల్లయొ నిజమో...’ అనండి.
  రెండుచింతల వా రన్నట్టు ‘కుశునుని వలె’...?
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. శంకరయ్య గారికి, నా సమస్యను ఆదరించి స్వీకరించినందుకు మీకు, పూరించిన తోటి కవి మిత్రులందరికీ అభివందనములు. అదే విధంగా మరో సమస్యను ఇస్తున్నాను. పరిశీలించి వీలు వెంబడి ప్రచురించగలరు. "చక్రమ్ములు లేని బండి చక చక సాగెన్"

  రిప్లయితొలగించండి
 20. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  ధన్యవాదాలు. సమస్యలను స్వయంగా సృష్టించడానికి, సేకరించడానికి ఇబ్బంది పడుతున్న నాకు మహోపకారం చేస్తున్నారు.
  రేపటి సమస్యను ఇప్పటికే షెడ్యూల్ చేశాను. మీ సమస్యను తరువాత ప్రకటిస్తాను. మీరు పంపే సమస్యలను నేరుగా బ్లాగులో ప్రకటించక నాకు మెయిల్ పెట్టండి.
  shankarkandi@gmail.com

  రిప్లయితొలగించండి
 21. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
  చిన్న సవరణతో...

  ఇల్లాలికి నిండె నెలలు
  తల్లీ ! నే వత్తుననుచు తల్లియె చెప్పెన్
  వెల్లువన పయన మాగగ
  తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్

  రిప్లయితొలగించండి
 22. కల్లగ నలుగున జేసిన
  పిల్లడి తలద్రుంచి యతుకు పెట్టగ నౌరా!
  మెల్లగ వినాయకుండై
  తల్లియుఁ దండ్రియును లేక తనయుఁడు పుట్టెన్!

  రిప్లయితొలగించండి
 23. చిల్లర దైవమ్ముల వలె
  తల్లియు తండ్రియును కలిగి తన్నులు తినకే
  పిల్లడు పరమేశ్వరునకు
  తల్లియుఁ దండ్రియును లేక తనయుఁడు పుట్టెన్

  రిప్లయితొలగించండి